ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించడానికి దిగుమతి చేస్తున్న బ్యాటరీలు భారతీయ వాతావరణానికి సెట్ అవ్వకపోయే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సరస్వత్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా కాలిపోతున్నాయి. దీనిపై ఆయన స్పందించారు. మన వాతావరణానికి తగ్గ బ్యాటరీలను మనమే రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.


‘ప్రస్తుతం మనదేశంలో ఉపయోగిస్తున్న బ్యాటరీలు భారతీయ వాతావరణానికి సూట్ అవ్వట్లేదేమో... కాబట్టి బ్యాటరీలను దిగుమతి చేసుకునేటప్పుడు వాటిని పరీక్షించడం కూడా ముఖ్యమే.’ అని సరస్వత్ అన్నారు.


సరస్వత్ గతంలో డీఆర్‌డీవో చీఫ్‌గా కూడా పనిచేశారు. భారతదేశం వంటి వేడి వాతావరణానికి తగినట్లు ఈ బ్యాటరీలు రూపొందించడం లేదని, కొన్ని బ్యాటరీల నాణ్యత కూడా నాసిరకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందువల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.


ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతూ ఉండటంపై ప్రభుత్వం కూడా ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ కూడా దిగుమతి చేసిన సెల్స్ వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రాథమిక నివేదికను ఇచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలు దగ్థం కావడం, దేశవ్యాప్తంగా బ్యాటరీ బ్లాస్ట్‌లు జరుగుతూ ఉండటంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై కమిటీ వేసింది.


‘బ్యాటరీ టెక్నాలజీ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంది. ప్రస్తుతానికి మనదేశంలో బ్యాటరీలు ఎక్కువగా తయారు కావడం లేదు. వీలైనంత త్వరగా సెల్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లను నెలకొల్పాలి. అక్కడ రూపొందించే బ్యాటరీలు భారతదేశంలోని అధిక ఉష్ణోగ్రతలు తట్టుకునేలా ఉండాలి.’ అని సరస్వత్ పేర్కొన్నారు. కొన్ని దేశాలు ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద పనిచేసే బ్యాటరీ సెల్స్‌ను రూపొందిస్తున్నాయని ఆయన తెలిపారు.