MP GVL On Amaravati : మూడు రాజధానులు రాజకీయ ఎత్తుగడే అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. అమరావతి ప్రాంతంలో పర్యటించిన ఆయన రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విష‌యంలో ప్రత్యేక దృష్టి సారించాల‌ని సూచించారు. ప్రభుత్వం వద్ద వ‌న‌రుల‌కు లోటు లేద‌ని మ‌న‌సు పెట్టి ప‌నిచేయాల్సి ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల విష‌యంలో రాష్ట్ర ప్రభుత్వం మ‌న‌సు పెట్టి ప‌నిచేయ‌టం లేద‌ని ఆయ‌న విమర్శించారు. మూడు రాజ‌ధానులు అయ్యే ప‌నికాద‌ని జగన్ ప్రభుత్వానికి కూడా తెలుస‌ని, ఇది కేవ‌లం రాజ‌కీయ ఎత్తుగ‌డ మాత్రమే అని జీవీఎల్ ఆరోపించారు. 


హైకోర్టు తీర్పును ధిక్కరించినట్లే 


టీడీపీని దెబ్బతీసేందుకే అమరావతిని నిర్లక్ష్యం చేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. అమరావతిలోని నిర్మాణాలను పరిశీలించిన అనంతరం తుళ్లూరు రైతులతో జీవీఎల్ సమావేశమయ్యారు. జీవీఎల్‌ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీసేందుకు వైసీపీ రాజకీయ ఎత్తుగడే మూడు రాజధానులు అన్నారు. రాజకీయాల కోసం అమరావతిని బలిచెయ్యొందని ఎంపీ అన్నారు. హైకోర్టు తీర్పు తర్వాత కూడా మూడు రాజధానులు అంటే కోర్టు తీర్పును ధిక్కరించేలా ప్రభుత్వ వైఖరి ఉందని జీవీఎల్‌ నరసింహారావు  విమర్శించారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని బీజేపీ ఇప్పటికే తీర్మానం చేసిందన్నారు. హైకోర్టు తీర్పు అమల్లో ఉండగా మూడు రాజధానులు ప్రస్తావన చేసే అవకాశం వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. హైకోర్టు తీర్పును సవాల్‌ చేసే సత్తా ఉంటే ప్రభుత్వం ఎందుకు చేయలేదని జీవీఎల్ చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని వీడి కనీస వసతులు కల్పిస్తే అమరావతి అభివృద్ధి చెందుతుందన్నారు. 


బిల్లు తెచ్చే ప్రసక్తే లేదు 


"ప్రముఖ సంస్థలు రాజధానికి రావాలంటే మౌలికసదుపాయాలు ముఖ్యం. ఇప్పటికే నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ పూర్తవుతోంది. కేంద్రం పూర్తి సామర్థ్యం మేరకు ఏపీకి సాయం చేస్తుంది. నిధుల పేరుతో సాకు చెబుతూ రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేయడంలేదు. ఇతర సదుపాయాలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేసే అవకాశం ఉందని కానీ రాష్ట్ర ప్రభుత్వం అలా చేయడంలేదు. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు చేసే ప్రసక్తే లేదు. ఈ విషయంలో ప్రభుత్వానికి అవగాహన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మూడు రాజధానులపై బిల్లు తెచ్చే ప్రసక్తే లేదు. హైకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం నడవాల్సి ఉంటుంది. మూడు రాజధానులు కేవలం రాజకీయ ఎత్తుగడే. " అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.