Car Colour Changing Rules Of Motor Vehicle Act: కొంతమంది, తమ కారుకు తమ ఇష్టానికి తగ్గట్లు మార్పులు చేయిస్తుంటారు. సీటింగ్ మార్చడం, స్పీకర్లు యాడ్ చేసుకోవడం, లైటింగ్‌లో మార్పు, కారుకు ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్ వంటివి చేయిస్తుంటారు. కార్లలో ఇలాంటి మార్పులకు సంబంధించి భారతదేశంలో చట్టాలు కఠినంగా ఉన్నాయి, ఈ విషయం చాలా మందికి తెలీదు. కొంతమంది, కారు కలర్ తమకు నచ్చలేదనో, పెయింట్ పోతోందనో, మరో కారణం వల్లో.. ఆ రంగును మార్చి మరో రంగు వేయిస్తుంటారు. అయితే, దీనికోసం మీరు ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మీ వాహనం రంగును మారిస్తే, దానిని RTOలో రిజిస్టర్ చేసి, రంగు మార్పునకు చట్టబద్ధత కల్పించాలి. సింపుల్‌గా చెప్పాలంటే... భారతీయ మోటారు వాహనాల చట్టం ప్రకారం, మీ కారు రంగును మార్చడానికి మీ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)ని అప్‌డేట్ చేయడం తప్పనిసరి. లేకుంటే మీరు చట్టపరమైన శిక్షకు అర్హులు అవుతారు. చిక్కులు తప్పవన్నమాట.
జరిమానా, జప్తు, కేసు మీరు ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కారు రంగును మార్చి, ఆ విషయాన్ని RCలో అప్‌డేట్ చేయకపోతే, మీరు భారీ జరిమానా చెల్లించడానికి సిద్ధం కావాలి. మీ కారును జప్తు చేసి, చట్ట ప్రకారం మీపై కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. అసాంఘిక శక్తులను నియంత్రించడానికి ప్రభుత్వం ఇలాంటి నియమాలు పెట్టింది. ఒకవేళ మీరు మీ కారు రంగును మార్చినా జరిమానా/ జప్తు/ కేసుల బారిన పడకూడదు అనుకుంటే ఒకటే మార్గం ఉంది. RTOలో ఈ విషయాన్ని తెలియజేసి, మీ కారు కొత్త రంగును RCలో నమోదు చేయించండి. RC అప్‌డేషన్ పూర్తయితే ఇక మీరు ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా కారులో చక్కర్లు కొట్టవచ్చు.
కారు టైర్లు మార్చాలనుకుంటే..మీ కారులో ఏవైనా మార్పులు చేసేటప్పుడు, చట్ట ప్రకారం, కారు ప్రాథమిక నిర్మాణాన్ని మార్చకూడదు. ఉదాహరణకు, మీరు మీ వాహనం టైర్లను మార్చాలనుకుంటే మార్చేయవచ్చు. కానీ, కొత్త టైర్లు ఆ వాహనం టాప్ మోడల్‌కు తగ్గట్లుగా ఉండడం ముఖ్యం. మీరు మీ బండి మోడల్‌కు సరిపోని టైర్లను ఇన్‌స్టాల్ చేస్తే, దానిని చట్టవిరుద్ధంగా (Car tire replacement rules) పరిగణిస్తారు.
పెట్రోల్ కారును CNG కారుగా మార్చాలనుకుంటే..చాలా మంది, తమ పెట్రోల్ కారును CNGలోకి (Rules for converting a petrol car to a CNG car) మారుస్తుంటారు. అంటే, కారులో ఉపయోగించే ఇంధన రకాన్ని మార్చడానికి ప్రయత్నిస్తారు. వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో పెట్రోల్ అని ఉంటుంది కాబట్టి, CNG లోకి మారాలనుకున్నప్పుడు ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేయాలి, మీ RCని అప్‌డేట్ చేయాలి. ఇలా.. కారులో కొన్ని కీలక మార్పులు చేపట్టినప్పుడు మీ వాహనం RCలోనూ ఈ విషయాన్ని నవీకరించాలి. లేకపోతే భారీ జరిమానా లేదా కారు జప్తు, కొన్ని సందర్భాల్లో పోలీసు కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.