Hyundai Verna 5-Star Safety Rating: ఇండియాలో పాపులర్‌ సెడాన్లలో ఒకటైన హ్యుందాయ్ వెర్నా.. ప్రయాణీకుల భద్రత విషయంలో మంచి గుర్తింపు సాధించింది. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (Bharat NCAP) నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో ఈ కారు పూర్తి స్థాయి 5 స్టార్ రేటింగ్ దక్కించుకుంది. పెద్దలతో పాటు పిల్లల భద్రత విభాగాల్లోనూ ఐదు స్టార్లు సాధించింది.

Continues below advertisement

కొత్త భారత్ NCAP విధానంలో 5 స్టార్ రేటింగ్ పొందిన తొలి కాంపాక్ట్ సెడాన్‌గా వెర్నా నిలిచింది. ఈ వారంలో మహీంద్రా XEV 9S, టాటా సియెర్రా EV తర్వాత భారత్ NCAPలో ఐదు స్టార్లు సాధించిన మూడో కారుగా కూడా గుర్తింపు పొందింది. 5-స్టార్ రేటింగ్ పొందిన హ్యుందాయ్ కార్ల జాబితాలో వెర్నా మూడో మోడల్. గతంలో నిలిపివేసిన టక్సన్ SUV, వెన్యూ సబ్‌కాంపాక్ట్ SUV ఈ రేటింగ్ సాధించాయి.

హోండా సిటీ, వోక్స్‌వ్యాగన్ విర్టస్, స్కోడా స్లావియా వంటి ప్రత్యర్థి మోడళ్లకు భారత్ NCAP ఇంకా పరీక్షలు నిర్వహించలేదు. అయితే విర్టస్, స్లావియా గతంలో గ్లోబల్ NCAP క్రాష్ టెస్టుల్లో ఐదు స్టార్లు సాధించాయి. 

Continues below advertisement

 పెద్దల భద్రతలో 28.22 పాయింట్లు

భారత్ NCAP పరీక్షల్లో.. హ్యుందాయ్ వెర్నా 'అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్' (AOP) విభాగంలో 32 పాయింట్లకు 28.22 పాయింట్లు సాధించింది. ఇప్పటివరకు భారత్ NCAP పరీక్షించిన హ్యుందాయ్ కార్లలో ఇదే అత్యల్ప స్కోర్.

ముఖ్యంగా ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బ్యారియర్ క్రాష్ టెస్ట్‌లో వెర్నాకు కొంత స్కోర్ తగ్గింది. ఈ పరీక్షలో 16 పాయింట్లకు 12.45 పాయింట్లు మాత్రమే వచ్చాయి. పరీక్ష ఫ్యాక్ట్‌షీట్ ప్రకారం, ముందు భాగం నుంచి ఢీకొన్నప్పుడు పెద్దలకు లభించిన రక్షణ స్థాయి 'గుడ్' నుంచి 'మార్జినల్' వరకు ఉంది. డ్రైవర్ శరీరంలోని చాలా భాగాలకు రక్షణ 'అడిక్వేట్' నుంచి 'మార్జినల్' స్థాయిలో నమోదైంది.

ఇది కూడా చదవండి: సేఫ్టీలో సత్తా చాటిన టాటా సియెర్రా ఈవీ: పెద్దలు, పిల్లల రక్షణ పరీక్షల్లో బెస్ట్ స్కోర్లు సొంతం

 సైడ్ క్రాష్ టెస్టులో దాదాపు పూర్తి మార్కులు

సైడ్ డిఫార్మబుల్ బ్యారియర్ క్రాష్ టెస్ట్‌లో వెర్నా మంచి ప్రదర్శన చేసింది. ఈ పరీక్షలో 16 పాయింట్లకు 15.77 పాయింట్లు సాధించింది. అయితే, అడల్ట్ టెస్ట్ డమ్మీ ఛాతీ భాగానికి లభించిన రక్షణను 'అడిక్వేట్'గా మాత్రమే అంచనా వేశారు.

సైడ్ పోల్ ఇంపాక్ట్ పరీక్షలో రక్షణ స్థాయి 'గుడ్'గా నమోదైంది. అంటే, పక్క నుంచి ఢీకొనే ఘటనల్లో వెర్నా మంచి రక్షణను అందించినట్లు పరీక్ష ఫలితాలు సూచిస్తున్నాయి.

 పిల్లల భద్రతలో 44 పాయింట్లు

చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) విభాగంలో హ్యుందాయ్ వెర్నా 49 పాయింట్లకు 44 పాయింట్లు సాధించింది. చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్, డైనమిక్ టెస్టుల్లో పూర్తి మార్కులు దక్కించుకుంది.

వాహన అంచనా విభాగంలో మాత్రమే కొన్ని పాయింట్లు కోల్పోయింది. అయినప్పటికీ, మొత్తం మీద పిల్లల భద్రతలోనూ ఐదు స్టార్ రేటింగ్ సాధించింది.

ఇది కూడా చదవండి: ప్రయాణానికి 'సేఫెస్ట్‌ కారు' అని నిరూపించుకున్న Mahindra XEV 9S.. భారత్ NCAP పరీక్షల్లో '5 స్టార్ సేఫ్టీ రేటింగ్'

మొత్తంగా చూస్తే.. భారత్ NCAPలో ఐదు నక్షత్రాల హోదా సాధించడం వెర్నాకు కీలక పరిణామం. అయితే, ప్రత్యర్థి మోడళ్లకు భారత్ NCAP పరీక్షలు ఇంకా జరగనందున, వాటితో నేరుగా ఈ రేటింగ్‌ను పోల్చకూడదు. విర్టస్, స్లావియాకు గ్లోబల్ NCAPలో 5-స్టార్ రేటింగ్ ఉన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.