Electric Scooter Maintenance Tips: మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇప్పుడు చాలా మంది రోజువారీ ప్రయాణాల్లో ప్రధాన భాగంగా మారాయి. పెట్రోల్‌ రేట్లు పెరగడం, ట్రాఫిక్‌ ఎక్కువ కావడం, నగరాల్లో EV ఛార్జింగ్‌ సదుపాయాలు వేగంగా పెరగడం వంటి కారణాలతో ప్రజలు ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వైపు మరింత ఆకర్షితులవుతున్నారు. కానీ ఈ స్కూటర్లకు అసలు ప్రాణం బ్యాటరీ. దానిని ఎలా కాపాడుకుంటామన్నదే స్కూటర్‌ పెర్ఫార్మెన్స్‌, రేంజ్‌, లాంగ్‌టర్మ్‌ ఖర్చులు.. ఇలా అన్నింటినీ ప్రభావితం చేస్తుంది.

Continues below advertisement


తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులకు తగ్గట్టుగా, మీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్యాటరీ లైఫ్‌ను గరిష్టంగా పెంచేందుకు పాటించాల్సిన ప్రాక్టికల్‌ టిప్స్‌ ఒకేచోట ఇస్తున్నాం.


20%–80% ఛార్జింగ్‌ రేంజ్‌ని ఫాలో అవ్వండి
లిథియమ్‌-ఐయాన్‌ బ్యాటరీలకు 0% నుంచి 100% ఫుల్‌ సైకిల్స్‌ మంచిది కాదు. ప్రతిరోజూ బ్యాటరీని పూర్తిగా జీరోకు దించటం, తర్వాత తరచుగా 100% ఛార్జింగ్‌కు తీసుకెళ్లటం - ఇవి రెండూ బ్యాటరీ కెపాసిటీని త్వరగా తగ్గిస్తాయి. రోజూ ఆఫీస్‌/కాలేజ్‌ కు వెళ్తున్న వారైతే, మధ్య మధ్యలో చిన్నపాటి టాప్-అప్స్‌ (కొద్దిసేపు ఛార్జింగ్‌) చేస్తే చాలు. ఎక్కువ రైడ్‌ ఉన్నరోజు మాత్రమే 100% వరకు ఛార్జ్‌ చేయండి.


వేడితో బ్యాటరీ త్వరగా డ్యామేజ్‌ అవుతుంది
తెలుగు రాష్ట్రాల్లో వేసవి పరిస్థితులు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్యాటరీలకు పెద్ద పరీక్ష. స్కూటర్‌ను నేరుగా ఎండలో గంటల కొద్దీ పార్క్‌ చేయడం, రైడ్‌ అయిన వెంటనే ఛార్జ్‌ పెట్టడం - ఇవి కూడా బ్యాటరీ కెమికల్‌ స్ట్రక్చర్‌పై ప్రభావం చూపుతాయి. అందుకే:


తప్పని పరిస్థితుల్లో తప్ప, EVని వీలైనంత వరకు నీడలోనే పార్క్‌ చేయండి


లాంగ్‌ రైడ్‌ తర్వాత 10–15 నిమిషాలు బ్యాటరీ కూల్‌ అయ్యేలా సమయం ఇవ్వండి


బ్యాటరీ హీట్‌ ఉన్నప్పుడు ఛార్జ్‌ వేయడం మానేయండి


మ్యానుఫ్యాక్చరర్‌ ఇచ్చిన ఛార్జర్‌ మాత్రమే వాడండి


చౌకగా దొరికే డూప్లికేట్‌ ఛార్జర్లు కొని మోసపోవద్దు. అవి వోల్టేజ్‌ అవుట్‌పుట్‌ స్టేడీగా ఇవ్వవు, బ్యాటరీలో ఓవర్‌హీటింగ్‌ లేదా ఇబ్బందులు వస్తాయి.


మీ ఒరిజినల్‌ ఛార్జర్‌ డ్యామేజ్‌ అయితే, కంపెనీ ఆథరైజ్డ్‌ ఛార్జర్‌తో మాత్రమే రీప్లేస్‌ చేయండి.


టైర్‌ ప్రెషర్‌ను సరిగ్గా ఉంచండి
ఈ విషయాన్ని చాలామంది లెక్కలోకి తీసుకోరు కానీ, టైర్లలో గాలి తక్కువగా ఉంటే మోటార్‌ మీద అదనపు లోడ్‌ పడుతుంది. అదే అదనపు లోడ్‌ బ్యాటరీ పైన కూడా పడుతుంది. ఫలితంగా, బండి రేంజ్‌ (తిరిగే దూరం) తగ్గుతుంది. ప్రతి వారం ఒకసారి అయినా టైర్‌ ప్రెషర్‌ చెక్‌ చేయండి. అలాగే, ఆకస్మికంగా ఫాస్ట్‌ యాక్సిలరేషన్‌ ఇవ్వడం, హార్డ్‌ బ్రేకింగ్‌ చేయడం కూడా రేంజ్‌ను తగ్గిస్తాయి.


సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ తప్పక చెక్‌ చేయండి
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న చాలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (BMS) అప్‌డేట్స్‌ ఇస్తుంటాయి. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం వల్ల, అవి:


టెంపరేచర్‌ కంట్రోల్‌ మెరుగుపరుస్తాయి


ఛార్జింగ్‌ సేవింగ్‌ మోడ్‌లను ఆప్టిమైజ్‌ చేస్తాయి


రేంజ్‌ మీటర్‌ అంచనాలను ఇంకా ఆక్యురేట్‌గా చేస్తాయి


సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లినప్పుడు లేదా మొబైల్‌ యాప్‌లోనైనా కొత్త అప్‌డేట్స్‌ చెక్‌ చేయడం అలవాటు చేసుకోండి.


సర్వీసింగ్‌ మిస్‌ కావద్దు
సాధారణంగా, ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు నిర్వహణ చాలా తక్కువ. అయినప్పటికీ... స్కూటర్‌ కనెక్టర్లు, వైరింగ్‌, కూలింగ్‌ రూట్స్‌, బ్యాటరీ మౌంటింగ్‌ ఇవన్నీ మీ పర్యవేక్షణలో ఉండాలి. సర్వీసింగ్‌ రెగ్యులర్‌గా చేస్తే చిన్న సమస్యలు పెద్దవిగా మారకముందే  తెలుసుకోవచ్చు. సరిగ్గా మెయింటెయిన్‌ చేస్తే బ్యాటరీ అందించే రేంజ్‌ స్థిరంగా ఉంటుంది, కెపాసిటీ సడెన్‌గా పడిపోదు.


ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్యాటరీని కాపాడుకోవడం అసలు కష్టం కాదు. స్మార్ట్‌ ఛార్జింగ్‌, వేడి నుంచి రక్షణ, బ్యాలెన్స్‌డ్‌ రైడింగ్‌, రెగ్యులర్‌ సర్వీసింగ్‌ - ఈ నాలుగు హ్యాబిట్స్‌ పాటిస్తే మీ బ్యాటరీ వారంటీ పీరియడ్‌ కంటే చాలా ఎక్కువకాలం హెల్దీగా పని చేస్తుంది. రేంజ్‌ కూడా స్థిరంగా వస్తుంది, లాంగ్‌టర్మ్‌ మెయింటెనెన్స్‌ ఖర్చులు బాగా తగ్గుతాయి.


ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.