Process To Get Refund On Vehicle Life Tax: మీరు కొత్త కారు లేదా బైక్ కొన్నప్పుడు లైఫ్ ట్యాక్స్ (జీవిత కాల పన్ను) కట్టడం తప్పనిసరి. సాధారణంగా, ఏదైనా వాహనం జీవిత కాలం 15 సంవత్సరాలు కాబట్టి, ఈ ట్యాక్స్ 15 సంవత్సరాల పాటు వాహనానికి వర్తిస్తుంది. కానీ ఉద్యోగం, బిజినెస్ లేదా చదువు కారణంగా మీరు మరో రాష్ట్రానికి వెళ్ళాల్సి వస్తే?, అక్కడ మళ్లీ రీరిజిస్ట్రేషన్ చేయించుకుని కొత్తగా లైఫ్ ట్యాక్స్ కట్టాలి. ఇలాంటప్పుడు చాలా మంది “ఇప్పటికే పాత రాష్ట్రంలో చెల్లించాం కదా, డబ్బు పోతుందా?” అని ఆలోచిస్తారు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు కట్టిన పాత లైఫ్ ట్యాక్స్‌ను రిఫండ్‌గా తిరిగి పొందవచ్చు.
రీరిజిస్ట్రేషన్ చేయించకపోయినా పర్లేదా?
మోటారు వాహనాల చట్టం ప్రకారం, ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి వాహనాన్ని తీసుకువెళ్లి, అక్కడ 30 రోజులకుపైగా ఉంటే, కొత్త రాష్ట్రంలో తప్పనిసరిగా రీరిజిస్ట్రేషన్ చేయించాలి. ఉదాహరణకు, విశాఖకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ. 1.25 లక్షల లైఫ్ ట్యాక్స్ కట్టి కొత్త కారు రిజిస్టర్ చేయించుకున్నారు. కానీ ఏడాది తిరగకముందే అతనికి బెంగళూరుకు బదిలీ అయింది. తన వాహనాన్ని కర్ణాటకలో వాడాలంటే అక్కడ కొత్తగా లైఫ్ ట్యాక్స్ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. అంటే, ఏడాది కూడా కాకముందే ఒకే వాహనానికి రెండు రాష్ట్రాల్లో రెండుసార్లు లైఫ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. కానీ ఆయన తెలివిగా అప్లై చేసి, ఆంధ్రప్రదేశ్‌లో కట్టిన ట్యాక్స్‌లో మిగిలిన సంవత్సరాల వాటాను రిఫండ్‌గా తిరిగి పొందగలిగారు.
రిఫండ్ రూల్స్
ప్రస్తుత మోటారు వాహనాల చట్టం ప్రకారం, ఒక వాహనం లైఫ్ పీరియడ్ (జీవితకాలం) 15 సంవత్సరాలు అని గుర్తుంచుకోండి.
మీరు ఒక రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలు వాడి, కొత్త రాష్ట్రానికి వెళ్తే, మిగిలిన సంవత్సరాలకు ట్యాక్స్ అక్కడ కట్టాలి.
గతంలో కట్టిన సంవత్సరాల లైఫ్ ట్యాక్స్‌ను పాత రాష్ట్రం నుంచి రిఫండ్‌గా క్లెయిమ్ చేయవచ్చు.
రిఫండ్ కోసం అప్లై చేసే విధానం
ముందుగా పాత రాష్ట్రంలోని RTO వద్ద నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) తీసుకోవాలి.
కొత్త రాష్ట్రంలో రీరిజిస్ట్రేషన్ చేసి, అక్కడి రూల్స్ ప్రకారం వెహికల్‌కు ట్యాక్స్ కట్టాలి.
కొత్త RC (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్) కాపీ, ట్యాక్స్ రసీదు, పాత RC, బ్యాంక్ వివరాలు కలిపి పాత రాష్ట్రంలోని RTO కార్యాలయంలో రిఫండ్‌కు దరఖాస్తు చేయాలి.
ఉదాహరణకు....
ఒక వాహనం APలో 4 సంవత్సరాలు వాడి, కర్ణాటకకు తీసుకెళ్లారనుకోండి.
కర్ణాటకలో మిగిలిన 11 సంవత్సరాలకు లైఫ్ ట్యాక్స్ కట్టాలి.
APలో కట్టిన 4 సంవత్సరాల ట్యాక్స్ మొత్తాన్ని రిఫండ్‌గా క్లెయిమ్ చేయవచ్చు.
ఏపీ & తెలంగాణ స్పెషల్ రూల్స్
ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన వాహనం తెలంగాణకు వస్తే, రిఫండ్ కోసం ఏపీలో రిజిస్ట్రేషన్ చేసిన RTO కార్యాలయంలోనే అప్లై చేయాలి.
అదే విధంగా, తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనం ఏపీలో రీరిజిస్ట్రేషన్ అయితే, తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసిన RTO వద్దే రిఫండ్ దరఖాస్తు ఇవ్వాలి.
వాహన యజమానులకు ఉపయోగపడే టిప్
చదువులు, ఉద్యోగం లేదా ట్రాన్స్‌ఫర్‌ల వల్ల రాష్ట్రం మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది. అలాంటప్పుడు చాలా మంది పాత రాష్ట్రంలో కట్టిన ట్యాక్స్ వృథా అయిపోయిందనుకుంటారు. కానీ అసలు వృథా కాదు. మీరు అప్లై చేస్తే ఆ డబ్బు మీ అకౌంట్‌లో తిరిగి వస్తుంది. కొత్త రాష్ట్రంలో రీరిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పాత రాష్ట్రం నుంచి రిఫండ్ క్లెయిమ్ చేసుకుంటే, మీరు మంచి మొత్తాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఈ రూల్ తెలిసినవాళ్లు లాభపడతారు, తెలియని వాళ్లు నష్టపోతారు.