How To Apply For Bharat Series Registration Number: దేశమంతా వాహన రిజిస్ట్రేషన్ వ్యవస్థను సులభంగా మార్చాలనే ఉద్దేశంతో, భారత ప్రభుత్వం, భారత్ సిరీస్ (BH Series) నంబర్ ప్లేట్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఈ సిరీస్‌తో ఉన్న చాలా వాహనాలు రోడ్లపై కనిపిస్తున్నాయి. అదే సమయంలో, ప్రతి రాష్ట్రంలోనూ పాత విధానంలోనే వెహికల్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో, భారత్ సిరీస్ అవసరం ఏంటి?.
భారత్ సిరీస్ (BH Series) అంటే ఏంటి, ఉపయోగం ఏంటి?
భారత్ సిరీస్ నంబర్ ప్లేట్ స్కీమ్‌ను 2021లో కేంద్ర రవాణా శాఖ ప్రవేశపెట్టింది. దీనివల్ల, ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాన్ని వేరే రాష్ట్రానికి తీసుకెళ్లినా మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రత్యేకంగా, తరచూ రాష్ట్రాలు మారే ఉద్యోగులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. వేరే రాష్ట్రానికి తరలిన తరువాత వాహన రీ-రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా, నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే BH సిరీస్ నంబర్ వాహనాలను దేశంలో ఎక్కడైనా నడపవచ్చు. అయితే ఈ నూతన విధానం గురించి ఇంకా చాలామందికి స్పష్టత లేదు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నివసించే వాళ్లు ఈ నంబర్‌ను ఎలా పొందాలి? ఎవరి కోసం ఇది అందుబాటులో ఉంది?
ఉదాహరణకు.. BH సిరీస్ నంబర్లు ఇలా కనిపిస్తాయి: "21 BH 25 2345 AA". ఇందులో... 21 అంటే బండి రిజిస్ట్రేషన్ జరిగిన 2021 సంవత్సరం, BH అంటే భారత్ సిరీస్, 2345 అనేది ర్యాండమ్‌గా ఇచ్చే సీరియల్ నంబర్‌ను, AA అనేది ఆల్ఫాబెట్స్‌ను (I&O కాకుండా) సూచిస్తుంది.
భారత్ సిరీస్ నంబర్ ప్లేట్ పొందడానికి ఎవరు అర్హులు?
కేంద్రం రూపొందించిన గైడ్‌లైన్స్ ప్రకారం, BH సిరీస్ నంబర్ కోసం ఈ కేటగిరీలవారు అర్హులు:
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
రక్షణ శాఖ ఉద్యోగులు
బ్యాంకింగ్, PSU ఉద్యోగులు
ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు (కంపెనీ పేరు కనీసం 4 రాష్ట్రాల్లో నమోదై ఉంటే). ప్రైవేట్ ఉద్యోగులు ఈ నంబర్ పొందాలంటే, తమ కంపెనీకి క్రాస్-స్టేట్ ప్రెజెన్స్ ఉందని చూపించే సర్టిఫికెట్ అవసరం.
తెలుగు ప్రజలు ఎలా దరఖాస్తు చేయాలి?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నివసించే వారు BH సిరీస్ నంబర్ కోసం వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలోనే దరఖాస్తు చేయాలి. ఇందుకోసం డీలర్ ద్వారా లేదా Parivahan పోర్టల్ ద్వారా అప్లై చేయవచ్చు.
అవసరమైన డాక్యుమెంట్లు:
ఉద్యోగాన్ని సూచించే ID ప్రూఫ్
ప్రైవేట్ కంపెనీ అయితే, కంపెనీ నుంచి సరైన ఫార్మాట్‌లో NOC లేదా అఫిడవిట్
చిరునామా రుజువు
పాన్, ఆధార్
RC అప్లికేషన్, ఫామ్ 20
ఎంత ఫీజు చెల్లించాలి?
రాష్ట్రాల్లో జరిగే సాధారణ రిజిస్ట్రేషన్ సమయంలో, వాహన యజమాని లైఫ్ టైమ్ రోడ్ టాక్స్ (15 ఏళ్ళు) కట్టాలి. అయితే, BH సిరీస్ నంబర్ తీసుకునేవాళ్లు మొదటి రెండు సంవత్సరాల కోసం రోడ్డు పన్ను (Road Tax) కట్టాలి. ఆ తర్వాత రెండేళ్లకు ఒకసారి కట్టుకుంటూ వెళ్లాలి.దీనివల్ల, తరచూ రాష్ట్రాలు మారేవాళ్లకు భారం తగ్గుతుంది.
కీలక పాయింట్లు
ఇప్పటికే రిజిస్టర్ చేసిన వాహనానికి BH సిరీస్ అప్లై చేయడం సాధ్యపడదు.
వాహన కొనుగోలు సమయంలోనే ఇది కావాలని స్పష్టంగా చెబితే మాత్రమే డీలర్ ద్వారా ప్రాసెస్ జరుగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో చాలామంది డీలర్లు ఈ సేవ అందిస్తున్నా, కొన్ని చోట్ల ఇంకా అవగాహన లోపం ఉంది.
ఉద్యోగ మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాల నుంచి తరచూ వేరే రాష్ట్రాలకు వెళ్లేవాళ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్కీమ్ చక్కగా ఉపయోగపడుతుంది. దీని గురించి అధికారిక వెబ్‌సైట్ లేదా స్థానిక RTO వద్ద పూర్తి సమాచారం పొందవచ్చు.