Maruti Baleno Price, Mileage And Features In Telugu: మారుతి సుజుకీ బ్రాండ్‌లోని పాపులర్‌ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో భారత్ NCAP (BNCAP) క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సాధించింది. మారుతి తన వాహనాలలో భద్రతకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సేఫ్టీ రేటింగ్ రుజువు చేస్తోంది. ఈ కారు కంటే ముందు మారుతి డిజైర్‌ (Maruti Suzuki Dzire Safety Rating) కూడా సేఫ్టీ రేటింగ్స్‌లో ముందు వరుసలోకి వచ్చింది.

క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ భద్రత రేటింగ్మారుతి బాలెనో క్రాష్ టెస్ట్‌లో... 6 ఎయిర్‌ బ్యాగ్‌లు కలిగిన వేరియంట్ పెద్దల భద్రతలో 32 పాయింట్లకు గాను 26.52 పాయింట్లు సాధించింది. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో 16 పాయింట్లకు గాను 14.99 పాయింట్లు సాధించింది. అదే సమయంలో... 2 ఎయిర్‌బ్యాగ్‌లు కలిగిన వేరియంట్‌ను కూడా క్రాష్‌ టెస్ట్‌ చేశారు. ఈ వేరియంట్‌లో... పెద్దల భద్రతలో 24.04 పాయింట్లు & సైడ్ టెస్ట్‌లో 12.50 పాయింట్లు సాధించింది. చిన్న పిల్లల భద్రతలో ఈ రెండు వేరియంట్‌లు 49 పాయింట్లకు గాను 34.81 పాయింట్లను, సమానంగా సాధించాయి. ISOFIX యాంకరేజ్ & డమ్మీ పనితీరు కూడా ఒకే రేటింగ్‌ పొందాయి.

సైడ్ క్రాష్‌లలో అదనపు రక్షణ అందించే కర్టెన్ & థొరాక్స్ ఎయిర్‌ బ్యాగ్‌లు ఉన్నాయి కాబట్టి 6 ఎయిర్‌ బ్యాగ్‌ల వేరియంట్ మరింత మెరుగైన వాహనంగా నిలుస్తుంది. ఈ వేరియంట్ సైడ్ బారియర్ టెస్ట్‌లో 90% పైగా స్కోర్ చేసింది, భద్రత పరంగా మరింత సామర్థ్యం ఈ కారుకు ఉందని నిరూపించింది.

భద్రత సాంకేతికతభద్రతా సాంకేతికత (Safety technique) విషయానికి వస్తే... ESC (Electronic Stability Control), పాదచారుల భద్రత చర్యలు ‍‌(Pedestrian safety measures) & సీట్ బెల్ట్ రిమైండర్ ‍‌(Seat belt reminder) ఫీచర్లు ఈ రెండు వేరియంట్లలో ప్రామాణికంగా ఉన్న లక్షణాలు. వాస్తవానికి, ఈ రెండు కార్లను 2024 లోనే పరీక్షించారు & ఫలితాలు 2025లో విడుదల అయ్యాయి. ఈ రెండు వేరియంట్‌లు (AGS & MT) 1,220 కిలోల బరువు కలిగి ఉన్నాయి & రెండింటినీ సమానంగా పరీక్షించారు.

మీరు బాలెనో కొనాలని ఆలోచిస్తుంటే, ముఖ్యంగా కుటుంబంతో కలిసి హైవేపై ప్రయాణించే వారికి/దూర ప్రయాణాలు చేసేవారికి 6 ఎయిర్‌బ్యాగులు ఉన్న బాలెనో వేరియంట్ సురక్షితమైన & మెరుగైన ఆప్షన్‌ కావచ్చు.

5 స్టార్‌ రేటింగ్‌ సాధించిన మారుతి డిజైర్‌

మారుతి సుజుకి ఫోర్త్‌ జనరేషన్‌ డిజైర్‌ (Maruti Dzire) సూపర్‌ ఫీట్‌ సాధించింది. గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ (GNCAP) క్రాష్‌ టెస్టులో ఈ కాంపాక్ట్‌ సెడాన్‌ 5 స్టార్‌ రేటింగ్‌ అందుకుంది. పెద్దల సేఫ్టీ విషయంలో 5 స్టార్‌ రేటింగ్‌, చిన్నారుల సేఫ్టీ విషయంలో 4 స్టార్‌ సాధించింది. గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ నుంచి 5 స్టార్‌ రేటింగ్‌ పొందిన తొలి మారుతి సుజుకీ కారు ఇదే. పెద్దల భద్రతలో 34 పాయింట్లకు 31.24 పాయింట్లు & పిల్లల భద్రతలో 42 పాయింట్లకు 39 పాయింట్లు సాధించింది. ఈ కారులో ఆరు ఎయిర్‌ బ్యాగ్స్‌, అన్ని సీట్లకు 3 పాయింట్‌ సీట్‌ బెల్ట్‌ విత్‌ రిమైండర్‌ ఉన్నాయి. 

వాస్తవానికి, అన్ని విషయాల్లో సామాన్యుడికి అందుబాటులో ఉండే మారుతి సుజుకీ, భద్రత విషయంలో మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. కాలితో తన్నినా మారుతి కార్లకు సొట్ట పడుతుంది, అంత సున్నితంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో, Maruti Dzire 5-స్టార్‌ రేటింగ్‌ అందుకోవడం విశేషం.