Bulletproof Cars India: యుద్ధరంగంలో సైనికుల రక్షణ కోసం కవచాలు, హెల్మెట్లు, లోహపు ప్లేట్లు వాడకం వంటివి మన భారతీయ చరిత్రలో వేల ఏళ్ల క్రితమే ఉన్నాయి. లోహపు యుగం నుంచే మనిషి తనను తాను రక్షించుకోవడానికి కవచాలపై ఆధారపడ్డాడు. అదే ఆలోచన ఇప్పుడు ఆధునిక కాలంలో బుల్లెట్‌ప్రూఫ్, మైన్‌ప్రూఫ్ కార్లు, ప్రీమియం SUVలుగా మారింది.
ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధాలు లేకపోయినా... నేటి కాలంలో రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు, ఇతర వ్యవస్థలకు చెందిన ప్రముఖులు, భద్రతా బలగాలకు చెందిన కీలక అధికారులు మాత్రం ఇంకా ప్రమాదాలను ఎదుర్కొనే పరిస్థితుల్లోనే ఉంటున్నారు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా రూపొందించే వాహనాలే ఈ ఆర్మర్డ్ కార్లు (Armoured Cars). ఈ రంగంలో భారత్‌లో ప్రముఖంగా వినిపించే పేరు చండీగఢ్‌కు చెందిన JCBL.
సాధారణ కార్ నుంచి ఆర్మర్డ్ కార్ వరకుఒకప్పుడు కేవలం అదనపు లోహపు షీట్‌లు, సాధారణ బుల్లెట్‌ప్రూఫ్ గాజును కార్లకు అమర్చేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్లను పూర్తిగా రీ-మాన్యుఫ్యాక్చర్ చేస్తూ, భద్రతతో పాటు కంఫర్ట్‌ను కూడా అందిస్తున్నారు.
ఈ ఆర్మర్డ్ కార్లు బయట నుంచి చూస్తే సాధారణ లగ్జరీ కార్ల మాదిరిగానే కనిపిస్తాయి. లోపల కూడా అదే స్థాయి సౌకర్యాలు ఉంటాయి. అయితే, దీనిని ఇలా మార్చడం అంత సులువు కాదు. ఎందుకంటే, ఇలా మారే కార్లలో సింహభాగం లగ్జరీ సెగ్మెంట్‌కు చెందినవే - JCBL CEO రుషాంక్ దోషి
బయటకు సాధారణ కార్లే...JCBL ఫ్యాక్టరీలో ఒకేసారి కనీసం 15 SUVలపై పని జరుగుతుంది. రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, ల్యాండ్ క్రూజర్ లాంటి ఖరీదైన వాహనాలు అక్కడ కనిపిస్తాయి. వీటన్నిటినీ వెంటనే కవర్ చేస్తారు. కారణం ఒక్కటే - యజమానులకు తప్ప, ఈ కార్లు బుల్లెట్‌ప్రూఫ్ అన్న విషయం బయటకు తెలియకూడదు. బయట నుంచి చూస్తే ఇవి సాధారణ SUVలే. కానీ లోపల మాత్రం పూర్తిగా ఒక సేఫ్‌లా మారిపోతాయి.
బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ ఎంత బలంగా ఉంటుంది?ఫ్యాక్టరీలో ప్రదర్శనకు ఉంచిన బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ ప్యానెల్స్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని గ్లాస్ షీట్లు 40 మిల్లీమీటర్ల మందం ఉంటాయి. పిస్టల్, రైఫిల్ బుల్లెట్లతో వీటిని పరీక్షించారు. గన్‌తో షూట్ చేసినప్పుడు కొన్ని లేయర్లు దెబ్బతిన్నా, మొత్తం గ్లాస్ ప్యానెల్ మాత్రం చెక్కుచెదరదు.
హామర్‌తో బలంగా కొట్టినా కూడా ఆ విండ్‌స్క్రీన్ విరగదు. కారణం... ఈ గ్లాస్ సాధారణ గాజు కాదు. గ్లాస్, పాలీకార్బొనేట్ లేయర్లను ఒకదానిపై ఒకటి అమర్చి తయారు చేస్తారు. దీనివల్ల, బుల్లెట్ ఈ గ్లాస్‌కు తగలగానే, దాని శక్తి అన్ని వైపులకు విస్తరించి బలహీనమవుతుంది, ఆ తూటా బయటే ఆగిపోతుంది. ఈ బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌కు యూరోపియన్ ప్రమాణాల ప్రకారం BR2 నుంచి BR7 వరకు రేటింగ్‌లు ఉంటాయి.
BR2 - 9mm పిస్టల్ బుల్లెట్లకు రక్షణ
BR4 - .44 మాగ్నమ్
BR6 - 7.62mm రైఫిల్, AK-47 స్థాయి
BR7 - ఆర్మర్ పియర్సింగ్ రైఫిల్ బుల్లెట్లు
కారుకు కవచం ఎలా వేస్తారు?SUVని ఎంత స్థాయిలో రక్షించాలన్నది యజమాని అవసరాలపై ఆధారపడి ఉంటుంది. బుల్లెట్‌ప్రూఫ్ మెటీరియల్స్‌లో స్టీల్ ప్లేట్లు, కాంపోజిట్ షీట్లు, కెవ్లార్ వంటివి వాడతారు. 7.62mm రైఫిల్‌తో కాల్చినా పూర్తిగా దాటలేని కాంపోజిట్ షీట్లు కూడా అక్కడ కనిపిస్తాయి.
ఒక టయోటా ఫార్చునర్‌ను ఉదాహరణగా చూస్తే... బ్యాటరీ చుట్టూ స్టీల్ బాక్స్, ఫ్యూయల్ ట్యాంక్ చుట్టూ హెవీ గేజ్ స్టీల్ కవరింగ్ కనిపిస్తుంది. కేబిన్‌లో కనిపించే రూఫ్ లైనింగ్ సాధారణ క్లాత్ కాదు, అది కూడా బాలిస్టిక్ స్టీల్. పిలర్స్, వెనుక భాగం అన్నీ కలిపి లోపల ఒక పూర్తిస్థాయి మెటల్ షెల్ తయారవుతుంది. కారు కింద భాగంలో (ఫ్లోర్ కింద) కెవ్లార్ బ్లాంకెట్లు ఉంటాయి. గ్రెనేడ్లను కింద నుంచి విసిరినా ఇవి రక్షణ ఇస్తాయి.
భారీ తలుపులు, ప్రత్యేక చక్రాలుడోర్లు తిరిగి అమర్చిన తర్వాత ఒక్కో తలుపు బరువు సుమారు 80 కిలోలు అవుతుంది. అందుకే ఫ్రేమ్స్, హింజ్‌లు ప్రత్యేకంగా బలంగా చేస్తారు. ముందుభాగంలో 40mm మందం ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ విండ్‌స్క్రీన్‌కు కూడా ప్రత్యేక ఫ్రేమ్ అవసరం.
చక్రాల విషయానికి వస్తే, ఇవి సాధారణ అలాయ్‌లు కావు. హెవీ డ్యూటీ స్టీల్ వీల్స్, జీరో-ఎయిర్ రన్‌ఫ్లాట్ ఇన్‌సర్ట్స్ వాడతారు. టైర్లు పూర్తిగా పాడైనా కొంత దూరం ప్రయాణించవచ్చు. ఈ ఫిట్టింగ్స్ వల్ల అదనంగా పెరిగే 800 కిలోల బరువుకు తగినట్లుగా సస్పెన్షన్, స్ప్రింగ్స్, డ్యాంపర్లు అప్‌గ్రేడ్ చేస్తారు.
లోపల మరో సేఫ్‌వెనుక హాచ్, గాజు పూర్తిగా బుల్లెట్‌ప్రూఫ్ చేయరు. బూట్ లోపల మరో భారీ స్టీల్ డోర్ ఉంటుంది. దీనిని లోపలి నుంచే తెరవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో వెనుక వైపు నుంచి బయట పడేందుకు ఇది ఉపయోగపడుతుంది.
డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది?బుల్లెట్‌ప్రూఫ్ ఫార్చునర్‌లో కూర్చుంటే బయటి శబ్దం పూర్తిగా తగ్గిపోతుంది. మందపాటి గ్లాస్, మెటల్ కారణంగా కేబిన్ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇంజిన్ స్టార్ట్ చేసినా డీజిల్ శబ్దం చాలా తక్కువగా వినిపిస్తుంది. కానీ డ్రైవింగ్‌లో అదనపు బరువు స్పష్టంగా తెలుస్తుంది. యాక్సిలరేషన్‌లో కొంత మందగమనం ఉంటుంది.
అయితే అప్‌గ్రేడ్ చేసిన సస్పెన్షన్ వల్ల రైడ్ క్వాలిటీ మెరుగవుతుంది. బ్రేకింగ్‌కు మాత్రం మరింత శక్తి అవసరం అవుతుంది. ఫ్యూయల్ వినియోగం కూడా పెరుగుతుంది.
ఖర్చు ఎంత అవుతుంది?
భద్రతను బట్టి ధర కూడా భారీగానే ఉంటుంది.
ఫార్చునర్ లాంటి SUVకి బుల్లెట్‌ప్రూఫింగ్ ఖర్చు - ₹25 లక్షల నుంచి ₹40 లక్షల వరకు
లగ్జరీ SUVలకు - ₹55 లక్షల నుంచి ₹1.5 కోట్ల వరకు
ఈ కార్లకు CMVR నిబంధనలు, RTO అనుమతులు, కొన్నిసార్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి కూడా అవసరం.
మొత్తంగా చూస్తే, బుల్లెట్‌ప్రూఫ్, మైన్‌ప్రూఫ్ కార్లు అనేవి కేవలం లోహం జోడించిన వాహనాలు కాదు. ఇవి భద్రత, ఇంజినీరింగ్, కంఫర్ట్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసే 'కదిలే కోటలు'.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.