BRS decided to boycott ssembly sessions:భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ నడుపుతున్నారా లేక సీఎల్పీ మీటింగ్ నడుపుతున్నారా అని బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. స్పీకర్ వైఖరి..సీఎం వాడిన భాషకు నిరసనగా అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని హరీష్ రావు ప్రకటించారు. మూసి ప్రక్షాళన అంశంపై సభలో జరిగిన చర్చ తర్వాత బీఆర్ఎస్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం తీసుకునే ముందు అసెంబ్లీలో హరీష్ మాట్లాడారు. తమపై వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే మైక్ కట్ చేసి ప్రతిపక్షాల గొంతు గొంతునొక్కుతున్నారని ఆరోపించారు. ఈ సభలో అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఎమ్మెల్యేలందరికీ సమాన హక్కులు ఉంటాయని.. ఆ హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ పై ఉందన్నారు. మా గొంతు నొక్కుతున్నప్పుడు, మా హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు స్పీకర్ ప్రతిపక్షాన్ని రక్షించాలన్నారు.
బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు కనీసం 7 రోజుల పాటు నడుపుతామని అందరి సమక్షంలో నిర్ణయించాము. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మళ్ళీ బీఏసీ మీటింగ్ పెట్టి పొడిగింపుపై నిర్ణయిద్దామని అనుకున్నాం. కానీ ఆశ్చర్యకరంగా బీఏసీ మినిట్స్ లో ఆ ఏడు రోజుల ప్రస్తావన ఎందుకు పొందుపరచలేదు. సభలో తీసుకున్న నిర్ణయానికి మినిట్స్ లో పొంతన లేకపోతే ఎలా.. అని ప్రశ్నించారు. సభలో జరగబోయే బిజినెస్ గురించి, అజెండా కాపీలను తెల్లవారుజామున 2, 3 గంటలకు పంపిస్తున్నారు. సభ్యులు ఎప్పుడు నిద్రలేవాలి, ఎప్పుడు చదువుకోవాలి.. సబ్జెక్ట్ మీద ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలని హరీష్ రావు ప్రశ్నించారు. సభ ప్రారంభానికి కనీసం 24 గంటల ముందు ఎజెండాను సభ్యులకు పంపాలనేది ఈ సభ ఆనవాయితీ అని గుర్తు చేశారు.
ఆ సాంప్రదాయాన్ని ఎందుకు పాటించడం లేదు. దీనివల్ల అర్ధవంతమైన చర్చకు ఆస్కారం లేకుండా పోతోందన్నారు. మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే మాకు సమాధానం చెప్పాల్సింది పోయి... సభా నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి లేచి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. మేము అడిగిన ఏ ఒక్క పాయింట్‌కు సీఎం దగ్గర క్లారిఫికేషన్ లేదు. పైగా మాకు మైక్ ఇవ్వకుండా, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొటెస్ట్ చేయడం సభ్యుడి హక్కు. మాకు మైక్ ఇవ్వకపోవడం ముమ్మాటికీ సరికాదన్నారు. మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువగా ఉంది. సభా నాయకుడి హోదాలో ఉండి ఆయన మాట్లాడుతున్న భాష వినడానికే చాలా కష్టంగా, అసహ్యంగా ఉందన్నారు.
ఆ తర్వాత నొక్కుతున్న స్పీకర్ పక్షపాత వైఖరిపై.. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన వ్యక్తం చేశారు. సభను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. మంగళవారం సభలో పీపీటీ ఉన్నందున.. బీఆర్ఎస్ హాజరు కాకపోతే కాంగ్రెస్ వాదన మాత్రమే వినిపించే అవకాశం ఉంది.