Rebel 300 & Rebel 500 Details In Telugu: భారత మార్కెట్‌లో క్రూయిజర్ బైక్‌ల అభిమానులకు హోండా అదిరిపోయే గిఫ్ట్‌ను సిద్ధం చేసింది. ఈ కంపెనీ ఒకేసారి 10 కొత్త మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించగా, వాటిలో Rebel 300 & Rebel 500 ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్టైలిష్ బాబర్ డిజైన్, పవర్‌ఫుల్ ఇంజిన్లు, ఇ-క్లచ్ టెక్నాలజీతో ఈ రెండు బైక్‌లను యువత కోసమే డిజైన్ చేశారు. ముఖ్యంగా నగర ట్రాఫిక్‌లో తరచూ క్లచ్ నొక్కాల్సిన ఇబ్బందిని తగ్గించే ఇ-క్లచ్ వ్యవస్థ ఈ బైక్‌ల ప్రధాన హైలైట్‌గా చెప్పొచ్చు.
Honda Rebel 500 ఇప్పటికే భారత మార్కెట్‌లో CBU మోడల్‌గా రూ.5.12 లక్షల ధరకు అందుబాటులో ఉంది. అయితే, కొత్త మోడల్‌లో దాదాపు 50 శాతం విడిభాగాలను భారత్‌లోనే సేకరించనున్నట్లు హోండా ప్రకటించింది. ఇంజిన్‌ను మాత్రం దిగుమతి చేసుకోనుంది. దీంతో తయారీ వ్యయం తగ్గి, ధర కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డిజైన్Rebel 300 & Rebel 500 రెండూ ఒకే కుటుంబానికి చెందిన బాబర్ స్టైల్‌ను కొనసాగిస్తున్నాయి. టియర్‌డ్రాప్ ఆకారంలోని ఇంధన ట్యాంక్, గుండ్రటి LED హెడ్‌లైట్, రెండు భాగాల సీటు, చిన్న ఎగ్జాస్ట్ ఈ బైక్‌లకు ప్రత్యేకమైన క్లాసిక్ లుక్‌ను తీసుకొచ్చాయి. సింపుల్‌గా కనిపించినా రోడ్డుపై మాత్రం ఈ బైక్‌లు ప్రత్యేకంగా కనిపించేలా హోండా రూపకల్పన చేసింది.
ఇది కూడా చదవండి: హైరైడర్ హైబ్రిడ్ & డస్టర్ టర్బో DCT కంపారిజన్ - లాంగ్‌టర్మ్‌లో ఎక్కువ లాభం ఇచ్చేది ఏ కారు?
Rebel 300లో 286cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇది సుమారు 30 hp శక్తి & 27.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు Rebel 500లో 471cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉండగా, ఇది 46 hp శక్తి & 43.3 Nm టార్క్‌ను అందిస్తుంది. రెండు బైక్‌ల్లోనూ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించారు.
ఇ-క్లచ్ టెక్నాలజీఈ రెండు బైక్‌లలోనూ హోండా అత్యాధునిక ఇ-క్లచ్ (E-Clutch) టెక్నాలజీని అందిస్తోంది. ఈ వ్యవస్థతో గేర్‌లు మార్చేటప్పుడు క్లచ్ లీవర్‌ను నొక్కాల్సిన అవసరం ఉండదు. ట్రాఫిక్‌లో తరచూ గేర్‌లు మార్చాల్సిన సందర్భాల్లో ఇది రైడర్‌కు మరింత సౌకర్యాన్ని కల్పిస్తుంది. అవసరమైతే క్లచ్‌ను మాన్యువల్‌గా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉండటం మరో ప్రత్యేకత. స్టాండర్డ్ వేరియంట్‌తో పాటు E-Clutch వేరియంట్‌లో కూడా ఈ రెండు బైక్‌లు అందుబాటులోకి రానున్నాయి.
రెండు బైక్‌లలోనూ కేవలం 690 మిల్లీమీటర్ల సీటు ఎత్తును అందించారు. దీంతో పొట్టి ఎత్తు ఉన్న రైడర్లు కూడా ఎంతో సులభంగా ఈ బైక్‌లను నడపగలరు. ఎత్తుగా ఉన్న హ్యాండిల్‌బార్, ముందువైపు అమర్చిన ఫుట్‌పెగ్‌లు కలిసి రిలాక్స్‌డ్ క్రూయిజింగ్ అనుభూతిని అందిస్తాయి. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లతో సస్పెన్షన్‌ను అమర్చారు. ముందు 130/90-16 & వెనుక 150/80-16 సైజు టైర్లను ఉపయోగించారు. Rebel 300 బరువు 172 కిలోలు కాగా, Rebel 500 బరువు 191 కిలోలు.
ఇది కూడా చదవండి: జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
ఫీచర్ల విషయానికి వస్తే ఈ బైక్‌లు క్లాసిక్ క్రూయిజర్ తత్వాన్ని కొనసాగిస్తున్నాయి. రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అధునాతన ఎలక్ట్రానిక్ వ్యవస్థలను ఇందులో ఇవ్వలేదు. అయితే డ్యూయల్ ఛానల్ ABSను స్టాండర్డ్‌గా అందించారు. అంతేకాదు, అంతర్జాతీయ మోడళ్లలో ఉన్న LCD డిస్‌ప్లే స్థానంలో భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన కొత్త గుండ్రటి TFT డిస్‌ప్లేను అందించడం విశేషం.
ప్రస్తుతం Honda Rebel 300 & Rebel 500 ధరలు, విడుదల తేదీని కంపెనీ ప్రకటించలేదు. అయితే రాబోయే వారాల్లో పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. బాబర్ స్టైల్, ఇ-క్లచ్ టెక్నాలజీ, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌తో ఈ రెండు బైక్‌లు భారత క్రూయిజర్ సెగ్మెంట్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువతతో పాటు లాంగ్ రైడ్స్‌ను ఇష్టపడే రైడర్లకు ఇవి ఆకర్షణీయమైన ఎంపికలుగా మారనున్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
