Honda ADV160 Maxi-Scooter Details In Telugu: హోండా కంపెనీ, తన తొలి అడ్వెంచర్‌ స్టైల్‌ మాక్సీ స్కూటర్‌ ADV160ని భారత మార్కెట్‌కు పరిచయం చేసింది (లాంచ్‌ చేయలేదు). బైక్‌ను తలపించే డిజైన్‌, ప్రీమియం ఫీచర్లు, పవర్‌ఫుల్‌ ఇంజిన్‌తో వచ్చిన ఈ స్కూటర్‌.. మన మార్కెట్‌లో కొత్త విభాగానికి శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ మోడల్‌ను భారత్‌లోనే తయారు చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు హోండా వెల్లడించడం విశేషం.

Continues below advertisement

హోండా ADV160ని కంపెనీ 'సిటీ అడ్వెంచర్‌' కాన్సెప్ట్‌తో రూపొందించింది. పెద్ద పరిమాణంలోని X ADV మోడల్‌ నుంచి స్ఫూర్తి పొందిన ఈ స్కూటర్‌లో.. ఎత్తుగా ఉండే అడ్జస్టబుల్‌ విండ్‌స్క్రీన్‌, ట్విన్‌ LED హెడ్‌ల్యాంప్స్‌, బ్లాక్‌ ప్యాటర్న్‌ టైర్లు ఆకర్షణగా నిలుస్తాయి. సాధారణ స్కూటర్‌లతో పోలిస్తే ఇది బైక్‌ తరహా లుక్‌ను అందిస్తూ యువతను ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఉంది.

ఫీచర్ల విషయానికి వస్తే ADV160లో TFT ఇన్‌స్ట్రుమెంట్‌ డిస్‌ప్లే, Honda RoadSync ద్వారా స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ, USB ఛార్జింగ్‌ సాకెట్‌, Honda Selectable Torque Control (ట్రాక్షన్‌ కంట్రోల్‌), సింగిల్‌ ఛానల్‌ ABS వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. అలాగే 27 లీటర్ల సామర్థ్యంతో అండర్‌సీట్‌ స్టోరేజ్‌ కూడా అందుబాటులో ఉంది. రోజువారీ ప్రయాణాలతో పాటు వీకెండ్‌ రైడ్స్‌కు కూడా ఈ స్కూటర్‌ అనువుగా ఉండేలా హోండా రూపకల్పన చేసింది.

Continues below advertisement

ఇది కూడా చదవండి: హోండా నుంచి టూవీల్స్ సునామీ! 151 కి.మి. రేంజ్ బైక్ నుంచి ఇ- క్లచ్‌ టెక్నాలజీతో రానున్న 10 మోడల్స్ ఇవే!

ఈ మాక్సీ స్కూటర్‌కు 157cc సింగిల్‌ సిలిండర్‌, లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్ఠంగా 16.3hp శక్తి & 14.9Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CVT ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే ఈ ఇంజిన్‌ ప్రత్యేకత ఏమిటంటే ఇది E85 ఇంధనానికి అనుకూలంగా ఉండటం. అంటే.. E20 నుంచి E85 వరకు (85 శాతం ఎథనాల్‌ & 15 శాతం పెట్రోల్‌) వివిధ ఇంధన మిశ్రమాలతో ఈ స్కూటర్‌ను నడపవచ్చు. భవిష్యత్‌లో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని హోండా ఈ సాంకేతికతను అందిస్తోంది.

సస్పెన్షన్‌ వ్యవస్థలో ముందు భాగంలో టెలిస్కోపిక్‌ ఫోర్క్‌, వెనుక భాగంలో ట్విన్‌ షాక్‌ అబ్జార్బర్లు ఉన్నాయి. ముందు 14 అంగుళాల చక్రం, వెనుక 13 అంగుళాల చక్రాన్ని అందించారు. ADV160 మొత్తం బరువు 133 కిలోలు కాగా, సీటు ఎత్తు 780 మిల్లీమీటర్లు. 165 మిల్లీమీటర్ల గ్రౌండ్‌ క్లియరెన్స్‌తో భారత రోడ్లపై సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా రూపొందించారు. 8.1 లీటర్ల ఇంధన ట్యాంక్‌ కూడా దీని ప్రత్యేకతల్లో ఒకటి.

ఇది కూడా చదవండి: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే!

ఈ స్కూటర్‌ను హోండా తన RedWing & ప్రీమియం BigWing షోరూమ్‌ల ద్వారా విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీ ADV160ను కేవలం ఆవిష్కరించగా, లాంచ్‌ తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. ధరను ఇంకా వెల్లడించలేదు. అయితే భారత్‌లోనే తయారీ జరగడం వల్ల ధర పోటీ స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రీమియం స్కూటర్‌ను కోరుకునే యూజర్లకు హోండా ADV160 ఒక కొత్త ప్రత్యామ్నాయంగా నిలవొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.