2026 Honda Elevate facelift missing features: హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి వచ్చింది. కొత్త మోడల్‌లో కంపెనీ కొన్ని కీలక మార్పులు చేసింది. ముందు సీట్లు & వెనుక సీట్లకు వెంటిలేషన్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు వచ్చాయి. దీంతో ఎలివేట్ మరింత ఆకర్షణీయంగా మారింది. అయితే, కొన్ని విషయాల్లో మాత్రం ఈ SUV ప్రత్యర్థి కార్ల కంటే వెనుకబడింది. Hyundai Creta, Kia Seltos, Skoda Kushaq, Maruti Suzuki Victoris & Tata Sierra వంటి మోడళ్లలో లభించే కొన్ని ఫీచర్లు ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో లేవు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Continues below advertisement

1. పానోరమిక్ సన్‌రూఫ్

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో సింగిల్ పేన్ సన్‌రూఫ్ మాత్రమే ఉంది. పానోరమిక్ సన్‌రూఫ్ మాత్రం లేదు. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్ & మారుతి సుజుకి విక్టోరిస్‌లోని టాప్‌ వేరియంట్లలో పానోరమిక్ సన్‌రూఫ్ అందుబాటులో ఉంది. పెద్ద గ్లాస్ రూఫ్ కోరుకునే వారికి ఇది ఎలివేట్‌లో ఒక లోటుగా చెప్పొచ్చు.

Continues below advertisement

2. పూర్తిస్థాయి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

ఎలివేట్‌లో డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇందులో 7 అంగుళాల TFT డిస్‌ప్లే ఉంటుంది. ఇంధన వినియోగం, ట్రిప్ సమాచారం, బయట ఉష్ణోగ్రత & ADAS సెట్టింగ్స్ వంటి వివరాలు ఇందులో కనిపిస్తాయి. అయితే ఇది పూర్తిస్థాయి డిజిటల్ క్లస్టర్ కాదు. క్రెటాలో 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్ ఉంది. కియా సెల్టోస్‌లో 12.3 అంగుళాల డిజిటల్ క్లస్టర్ లభిస్తుంది. స్కోడా కుషాక్ & మారుతి సుజుకి విక్టోరిస్‌లో కూడా 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్లు ఉన్నాయి.

3. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్

ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లేదు. అంటే డ్రైవర్ & ముందు ప్రయాణికుడు తమకు నచ్చిన ఉష్ణోగ్రతలను విడిగా సెట్ చేసుకోలేరు. హ్యుందాయ్ క్రెటా & కియా సెల్టోస్‌లో ఈ ఫీచర్ ఉంది. ఎలివేట్‌లో వెనుక సీట్ల వెంటిలేషన్, యాంబియంట్ లైటింగ్ & గాలి నాణ్యత డిస్‌ప్లే వంటి ఫీచర్లు వచ్చినా.. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మాత్రం రాలేదు.

ఇది కూడా చదవండి: టాటా ఎలక్ట్రిక్ కార్లపై దసరా ఆఫర్లు.. హారియర్ ఈవీ నుంచి పంచ్ ఈవీ వరకు భారీ బెనిఫిట్స్‌

4. పవర్డ్ టెయిల్‌గేట్

ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో పవర్డ్ టెయిల్‌గేట్ కూడా లేదు. మారుతి సుజుకి విక్టోరిస్ & టాటా సియెర్రాలో ఈ ఫీచర్ ఉంది. విక్టోరిస్‌లో మరో ప్రత్యేకత కూడా ఉంది. హ్యాండ్స్ ఫ్రీగా బూట్ తెరవడానికి లేదా మూసివేయడానికి జెస్చర్ కంట్రోల్ కూడా అందుబాటులో ఉంది.

5. బాస్ మోడ్

వెనుక సీటులో కూర్చున్న ప్రయాణికులకు ఎక్కువ లెగ్‌రూమ్ కావాలంటే ఉపయోగపడే ఫీచర్ బాస్ మోడ్. దీని ద్వారా వెనుక ప్రయాణికుడు ముందు ప్రయాణికుడి సీటును ముందుకు జరపవచ్చు. హోండా ఎలివేట్‌లో ఈ ఫీచర్ లేదు. టాటా సియెర్రా & హ్యుందాయ్ క్రెటాలో బాస్ మోడ్ లభిస్తుంది. ముఖ్యంగా వెనుక సీటులో ప్రయాణించే వారికి ఇది ఉపయోగకరమైన ఫీచర్.

6. పరిమిత పవర్‌ట్రెయిన్ ఎంపికలు

ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.5 లీటర్ సహజ పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతోంది. ఇది 121hp శక్తి & 145Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్‌తో దీనిని ఎంచుకోవచ్చు. CVT వేరియంట్‌లో 7 స్పీడ్ ప్యాడిల్ షిఫ్టర్లు కూడా ఉన్నాయి. 

అయితే, పవర్‌ట్రెయిన్ ఎంపికలు పరిమితంగా ఉన్నాయి. టర్బో పెట్రోల్, డీజిల్, CNG లేదా హైబ్రిడ్ ఆప్షన్లు ఎలివేట్‌లో లేవు. హ్యుందాయ్ క్రెటా & కియా సెల్టోస్‌లో టర్బో పెట్రోల్, డీజిల్ ఎంపికలు ఉన్నాయి. మారుతి సుజుకి విక్టోరిస్‌లో పెట్రోల్‌తో పాటు CNG & స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్లు ఉన్నాయి. టాటా సియెర్రాలో డీజిల్, సహజసిద్ధ పెట్రోల్ & టర్బో పెట్రోల్ ఇంజిన్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: 2026 Honda Elevate Facelift గ్రాండ్ ఎంట్రీ... ఫైనాన్స్‌లో కొనాలంటే ముందుగా ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి, EMI ఎంతవుతుందో పూర్తి వివరాలు

ఇవే కాకుండా కొన్ని అరుదైన ఫీచర్ల విషయంలోనూ ఎలివేట్ వెనుకబడింది. స్కోడా కుషాక్‌లో వెనుక సీటు మసాజ్ ఫంక్షన్ ఉంది. టాటా సియెర్రాలో మూడు స్క్రీన్ల సెటప్‌లో భాగంగా ముందు ప్రయాణికుడి కోసం ప్రత్యేక డిస్‌ప్లే ఉంది. కొన్ని ప్రత్యర్థి మోడళ్లలో వెనుక సన్‌బ్లైండ్స్ కూడా ఉన్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.