Honda City Facelift: హోండా మోటార్స్ తన సిటీ, సిటీ హైబ్రిడ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈ నెలలోనే మనద దేశంలో విడుదల చేసింది. ఎక్స్‌టీరియర్ లుక్‌లో కొన్ని మార్పులతో పాటు కొన్ని కొత్త ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. ఇప్పుడు ఈ కారు ఏకైక 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 121 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే దీని e:HEV వేరియంట్‌లో మునుపటి మాదిరిగానే అదే 1.5 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ లభిస్తుంది. మీరు ఈ కారును ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే, దీని డౌన్‌పేమెంట్, ఈఎంఐ వివరాలను తెలుసుకోవాలి.


ఎలా లెక్కించాలి?
కారును 10 శాతం డౌన్ పేమెంట్ చేసి కొనుగోలు చేశారని అనుకుందాం. తర్వాత మీరు కారు బ్యాలెన్స్ మొత్తంపై 10 శాతం బ్యాంక్ వడ్డీ రేటుతో ఐదు సంవత్సరాల ఈఎంఐ ప్లాన్‌ని ఎంచుకున్నారని అంచనా వేద్దాం. మీ సౌలభ్యం ప్రకారం కాల వ్యవధి లేదా లోన్ మొత్తాన్ని లేదా ఈఎంఐని ఎంచుకోవచ్చు. అలాగే వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేటు కూడా భిన్నంగా ఉండవచ్చు.


ధర ఎంత?
హోండా సిటీ యొక్క ఎంట్రీ-లెవల్ SV వేరియంట్ ప్రారంభ ధర రూ. 11.49 లక్షలకు లభిస్తుండగా, టాప్ ఆఫ్ ది రేంజ్ ZX CVT మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.97 లక్షలుగా ఉంది. ఢిల్లీలో దీని ఆన్ రోడ్ ధర రూ. 13.25 లక్షల నుండి రూ. 18.31 లక్షల మధ్య ఉంది.


మొత్తం ఒకేసారి చెల్లించాలా?
మీరు కారు యొక్క టాప్-ఎండ్ ZX CVT వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారని అనుకుందాం. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.97 లక్షలుగా ఉంది. మీరు దాని ఆన్ రోడ్ ధర రూ. 18.31 లక్షల్లో 10 శాతం అంటే రూ. 1.83 లక్షలు చెల్లిస్తే రూ. 16.48 లక్షల రుణాన్ని పొందుతారు.


దీని కోసం మీరు ఐదు సంవత్సరాల పాటు ఈఎంఐ చెల్లించాలనుకుంటే ప్రతీ నెలా రూ. 35,022 కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ కారు కోసం మొత్తం రూ. 21.01 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ కారు లో ఎండ్ వేరియంట్‌ని ఎంచుకుని రూ. 1.30 లక్షల డౌన్‌పేమెంట్ చేస్తే, నెలకు రూ. 25,398 ఈఎంఐ చెల్లించాలి.


ఎవరితో పోటీ?
ఈ కారు మారుతి సుజుకి సియాజ్, న్యూ జనరేషన్ హ్యుందాయ్ వెర్నాతో పోటీపడుతుంది. కొత్త వెర్నా త్వరలో విడుదల కానుంది. ఇందులో ADAS టెక్నాలజీ కూడా  అందించనున్నారు. రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో ఇది అప్‌డేట్ కానుంది.


కొత్త సిటీ మోడల్లో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్ కూడా అందించారు. దీనితో పాటు మీరు సూట్‌లో 360 డిగ్రీ సెన్సార్, మిటిగేషన్ బ్లైండ్ స్పాట్, లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అన్ని ఫీచర్లను చూడవచ్చు.


సెక్యూరిటీ ఫీచర్లుగా హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టీ యాంగిల్ రియర్ వ్యూ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్, ఓఆర్వీఎం మౌంటెడ్ లేన్ వాచ్ కెమెరా కూడా ఉన్నాయి. దీంతో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్, పీఎం 2.5 క్యాబిన్ ఎయిర్‌ ఫిల్టర్ కూడా హోండా సిటీలో కనిపిస్తాయి.