2027 Honda CBR1000RR-R Fireblade: హోండా తన ఫ్లాగ్‌షిప్ సూపర్‌బైక్ CBR1000RR-R Fireblade ను కొత్త రూపంలో పరిచయం చేసింది. ఇటలీలోని మిలాన్‌లో జరిగిన EICMA 2026 ప్రదర్శనలో ఈ కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. 2027 మోడల్‌గా అందుబాటులోకి రానున్న ఈ బైక్‌ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది. అవి Standard, SP & HRC Works Edition.
ఈసారి హోండా ప్రధానంగా బైక్ పెర్ఫార్మెన్స్‌ను మెరుగుపరచడం, బరువు తగ్గించడంపై దృష్టి పెట్టింది. ఇంజిన్, ఛాసిస్, ఏరోడైనమిక్స్‌లో చాలా మార్పులు చేసింది. మరి, 2026 మోడల్‌తో పోలిస్తే కొత్త Firebladeలో వచ్చిన మార్పులేంటో తెలుసుకుందాం.
ఇంజిన్, ఛాసిస్‌లో కీలక మార్పులు
2027 Honda CBR1000RR-R Firebladeలో 999cc, లిక్విడ్ కూల్డ్, ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్‌ను కొనసాగించారు. అయితే పవర్, టార్క్ అందించే విధానంలో మార్పులు చేశారు.
| వివరాలు | 2027 Fireblade | 2026 Fireblade |
|---|---|---|
| ఇంజిన్ | 999cc, లిక్విడ్ కూల్డ్, ఇన్‌లైన్ ఫోర్ | 999cc, లిక్విడ్ కూల్డ్, ఇన్‌లైన్ ఫోర్ |
| పవర్ | 217.5hp @ 14,000rpm | 217.5hp @ 14,500rpm |
| టార్క్ | 114Nm @ 10,500rpm | 113Nm @ 12,000rpm |
| గేర్‌బాక్స్ | 6-స్పీడ్ | 6-స్పీడ్ |
| కెర్బ్ వెయిట్ | 199kg | 201kg |
| పవర్ టు వెయిట్ రేషియో | 1092.96hp/టన్ | 1082.09hp/టన్ |
పవర్ విషయంలో రెండు మోడళ్లలోనూ 217.5hp అవుట్‌పుట్ కొనసాగుతోంది. అయితే కొత్త మోడల్‌లో ఈ పవర్ 500rpm ముందుగానే అందుతుంది. టార్క్ 113Nm నుంచి 114Nmకు పెరిగింది. అంతేకాకుండా గరిష్ట టార్క్ 12,000rpmకు బదులుగా 10,500rpm వద్దే అందుతుంది. దీంతో తక్కువ నుంచి మధ్యస్థ RPM పరిధిలో మెరుగైన పనితీరు లభిస్తుందని హోండా తెలిపింది.
ఈ మార్పుల కోసం కొత్త వేరియబుల్ ఎయిర్ ఇన్‌టేక్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఇంజిన్ వేగాన్ని బట్టి గాలి ప్రవేశించే మార్గం పొడవు, వ్యాసాన్ని ఈ సిస్టమ్ సర్దుబాటు చేస్తుంది. ఇంజిన్ అంతర్గత భాగాల్లోనూ మార్పులు చేశారు. మెగ్నీషియం ఇంజిన్ కవర్లు & అల్యూమినియం బోల్ట్‌లు ఉపయోగించారు.
ఇది కూడా చదవండి: Tesla Cybertruck: భారీ అంచనాలతో వచ్చిన సైబర్‌ట్రక్‌కు టాటా.. 2027లో ఉత్పత్తి నిలిపివేయనున్న టెస్లా
బరువు 2kg తగ్గింపు
కొత్త Firebladeలో మరో ముఖ్యమైన మార్పు బరువు తగ్గింపు. 2026 మోడల్‌తో పోలిస్తే 2027 మోడల్ బరువు 2kg తగ్గింది. దీంతో కెర్బ్ వెయిట్ 201kg నుంచి 199kgకు చేరింది.
దీని కోసం ఫ్రేమ్ వాల్ మందాన్ని 2mm తగ్గించారు. ఛాసిస్ దృఢత్వాన్ని మెరుగ్గా నిర్వహించేలా స్వింగ్‌ఆర్మ్ డిజైన్‌ను మార్చారు. తక్కువ బరువున్న వీల్స్, కొత్త చైన్‌ను ఉపయోగించడం ద్వారా అన్‌స్ప్రింగ్ మాస్‌ను కూడా తగ్గించారు.
కొత్త డిజైన్, ఏరోడైనమిక్స్
కొత్త Fireblade బాడీ డిజైన్‌ను హోండా రేసింగ్ కార్పొరేషన్ (HRC) సహకారంతో అభివృద్ధి చేశారు. కొత్త ఫెయిరింగ్ ద్వారా వింగ్‌లెట్లు లేకుండానే ఎక్కువ డౌన్‌ఫోర్స్ లభించేలా రూపొందించారు. అదే సమయంలో ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని కూడా మెరుగుపరిచారు.
ఈ బైక్‌లో 16.6 లీటర్ల సామర్థ్యం కలిగిన బయటకు కనిపించే Titanium Fuel Tank ఉంది. ముందు, వెనుక భాగాల్లో కొత్త LED లైటింగ్‌ను అందించారు.
రైడర్ ఎయిడ్స్‌లో మార్పులు
గత మోడల్‌లో ఉన్న ఎలక్ట్రానిక్ రైడర్ ఎయిడ్స్‌ను కొత్త Firebladeలోనూ కొనసాగించారు. రైడర్‌కు అవసరమైన సమాచారం 5-అంగుళాల TFT డిస్‌ప్లేలో కనిపిస్తుంది. ఎడమ హ్యాండిల్‌బార్‌పై ఉన్న ఫోర్-వే నావిగేషన్ స్విచ్‌ల ద్వారా వీటిని నియంత్రించవచ్చు.
హోండా స్మార్ట్ కీ సిస్టమ్ ద్వారా ఇగ్నిషన్, స్టీరింగ్ లాక్‌ను కీ లేకుండానే నిర్వహించవచ్చు. Standard, Track & Race అనే మూడు రైడ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. 6-యాక్సిస్ IMU ఆధారంగా పనిచేసే ఎలక్ట్రానిక్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. కార్నరింగ్ ABS & కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లూ ఉన్నాయి.
ఇది కూడా చదవండి: 9999, 0001 వంటి ఫ్యాన్సీ నంబర్లు పొందడం ఎలా? Parivahan పోర్టల్‌లో అప్లై చేసుకునే విధానం ఇదిగో
కొత్త వర్క్స్ ఎడిషన్ ప్రత్యేకతలు
2027 Fireblade లైనప్‌లో Standard, SP వేరియంట్లతో పాటు కొత్త HRC వర్క్స్ ఎడిషన్‌ను కూడా తీసుకొచ్చారు. ఈ వేరియంట్‌ను ప్రధానంగా ట్రాక్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఈ ఎడిషన్‌లో పూర్తిగా మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకునే ఓహ్లిన్స్ సస్పెన్షన్, బ్రెంబో హైప్యూర్ బ్రేకులు ఉన్నాయి. కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన ఫ్రంట్ ఫెండర్, రియర్ డక్ట్ & హై-డౌన్‌ఫోర్స్ వింగ్‌లెట్స్ కూడా ఇందులో ప్రత్యేకంగా అందించారు.
ఇంకా.. సింగిల్-సీట్ కాన్ఫిగరేషన్, అడ్జస్టబుల్ స్టీరింగ్ & స్వింగ్‌ఆర్మ్ పివట్ కాలర్‌లు ఉన్నాయి. వీటి ద్వారా ఛాసిస్ జ్యామెట్రీని అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు. బాటమ్-న్యూట్రల్ రేసింగ్ షిఫ్టర్ వంటి ఐచ్ఛిక HRC కిట్ భాగాలకు కూడా ఈ వేరియంట్‌లో సపోర్ట్ ఉంటుంది.
మొత్తంగా చూస్తే.. 2027 Honda CBR1000RR-R Firebladeలో భారీ పవర్ పెరుగుదల కంటే ఇంజిన్ పనితీరును మెరుగుపరచడం, బరువు తగ్గించడం, కార్నరింగ్ సామర్థ్యాన్ని పెంచడంపై హోండా దృష్టి పెట్టింది. ముఖ్యంగా HRC వర్క్స్ ఎడిషన్ ద్వారా ట్రాక్ రైడర్లకు మరిన్ని ప్రత్యేక హార్డ్‌వేర్ ఎంపికలను అందిస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
