Honda Activa Price and Smart Features: స్కూటర్ల మార్కెట్‌లో హోండా యాక్టివా డామినేషన్‌ అంతా, ఇంతా కాదు. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్లలో ఇది ఒకటి. దీని అర్ధం.. భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్న అతి కొన్ని స్కూటర్లలో హోండా యాక్టివా ఒకటి. అమ్మకాల పరంగా, ఈ ఏడాది మార్చిలోనూ పోటీ స్కూటర్లను వెనక్కి నెట్టి నంబర్ 1 పొజిషన్‌లో స్టాండ్‌ వేసుకుని మరీ కూర్చుంది.

హోండా కంపెనీ రిలీజ్‌ చేసిన రిపోర్ట్‌ ప్రకారం, గత నెల (2025 మార్చి)లో, హోండా యాక్టివా 110 & యాక్టివా 125 కలిపి మొత్తం 1,89,735 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఇదే నెలలో (2024 మార్చి) అమ్ముడైన 1,55,931 యూనిట్లతో పోలిస్తే సేల్స్‌ ఈసారి 21.67% పెరిగాయి. వార్షిక వృద్ధి మాత్రమే కాదు, నెలవారీగా చూసినా సేల్స్‌లో గ్రోత్‌ కనిపిస్తుంది. 2025 ఫిబ్రవరిలో అమ్ముడైన హోండా యాక్టివా స్కూటర్లు (110cc & 125cc కలిపి) 1,74,009 యూనిట్లు. మార్చిలో ఈ సంఖ్య 1,89,735 యూనిట్లకు పెరిగింది కాబట్టి, నెలవారీ అమ్మకాలలో 9.03% పెరుగుదల నమోదైంది. సగటు భారతీయుల్లో హోండా యాక్టివా ఆదరణ నెలనెలా, ఏటికేడు పెరుగుతోంది అనడానికి ఈ గణాంకాలు నిదర్శనం.

హోండా యాక్టివా 110/యాక్టివా 6Gహోండా యాక్టివా 110ను యాక్టివా 6G అని కూడా పిలుస్తారు. మీరు హోండా షూరూమ్‌కు వెళితే, ఈ స్కూటర్‌ను రెండు వేరియంట్లలో చూడవచ్చు. హోండా యాక్టివా 110 ఎక్స్-షోరూమ్ ధర రూ. 78,684 నుంచి రూ. 84,685 వరకు ఉంటుంది. ఇది 109.51cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో రేసుగుర్రంలా పరుగులు తీస్తుంది, 7.8 bhp పవర్‌ను & 9.05 Nm పీక్ టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. 

హోండా యాక్టివా 110 మైలేజీ మైలేజీ పరంగానూ, ఈ సెగ్మెంట్‌లో, హోండా యాక్టివా 110ను బెస్ట్‌ స్కూటర్‌ అని చెప్పవచ్చు. దీని ట్యాంక్‌లో ఒక్క లీటర్‌ పెట్రోల్‌ పోస్తే ఆగకుండా 55 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. హోండా యాక్టివా 110/యాక్టివా 6G ఇంధన ట్యాంక్‌ కెపాసిటీ 5 లీటర్లు. కంపెనీ లెక్క ప్రకారం, ట్యాంక్‌ ఫుల్‌ చేస్తే ఇది 275 కిలోమీటర్ల దూరం వెళ్లగలదు. అంటే, కంపెనీ ప్రకారం, హోండా యాక్టివా 110 ట్యాంక్‌ ఫుల్‌ చేసుకుని హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లవచ్చు, మధ్యలో పెట్రోల్‌ కోసం ఆగాల్సిన అవసరం రాదు. 

హోండా యాక్టివా 110 ఫీచర్లు హోండా యాక్టివా 110లో 4.2-అంగుళాల TFT డిజిటల్ డిస్‌ప్లే ఉంది, ఇది బ్లూటూత్ కనెక్టివిటీ & నావిగేషన్‌కు సపోర్ట్‌ చేస్తుంది. USB టైప్-C ఛార్జింగ్ పోర్టును కూడా కంపెనీ అందించింది. హోండా రోడ్‌సింక్ యాప్ ద్వారా కాల్ & SMS అలెర్ట్స్‌ స్మార్ట్ ఫీచర్లను ఈ టూవీలర్‌కు యాడ్‌ చేశారు.

హోండా యాక్టివా 125హోండా యాక్టివా 125ను OBD-2B నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్‌ చేసి రిలీజ్‌ చేశారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 95,140 & ఈ ధర వద్ద ఈ బండిని ప్రీమియం విభాగం కింద చూడాలి. ఈ స్కూటర్‌లో అతి పెద్ద ప్లస్‌ పాయింట్‌ దాని మైలేజీ. ఇది లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వగలదని ARAI (Automotive Research Association of India) సర్టిఫై చేసింది. బ్లూటూత్ కనెక్టివిటీ, USB టైప్-C పోర్ట్ & డిజిటల్ కన్సోల్ వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను కూడా ఈ స్కూటర్‌లో చూడవచ్చు.

110 Vs 125 - ఏది బెస్ట్?ఇవి రెండూ రోజువారీ ప్రయాణాలకు చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు బడ్జెట్‌ చూసుకుంటే యాక్టివా 110 తీసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ పవర్, మైలేజ్ & స్మార్ట్ ఫీచర్లను కోరుకుంటే యాక్టివా 125ని తీసుకోవచ్చు.