Honda Activa 125 vs TVS NTORQ 125:భారత్‌లో ఫ్యామిలీ వినియోగదారులు ఈ మధ్య కాలంలో కుటుంబంలోని అందరూ డ్రైవ్ చేసేందుకు వీలుగా స్కూటర్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే క్రమంగా స్కూటర్లకు ప్రాధాన్యత పెరుగుతోంది. అందుకే హోండా యాక్టివా 125, టీవీఎస్ ఎన్ టార్క్ 125 మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. మీరు కొత్తగా స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నట్టు అయితే ఈ రెండింటి మధ్య పోలికలు, తేడాలు తెలుసుకోవడం చాలా అవసరం. అప్పుడే మీ అవసరాలకు తగ్గట్టు వాహనాన్ని ఎంచుకోవచ్చు. లేకుంటే కచ్చితంగా ఈ విషయంలో మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది.
ఒకప్పుడు కేవలం ఆపీస్ అవసరాలకే పరిమితమైన స్కూటర్లు, ఇప్పుడు స్టైల్‌కు, టెక్నాలజీకి కేరాఫ్ అడ్రెస్‌గా మారాయి. ఈ క్రమంలో మార్కెట్ లీడర్ హోండా నుంచి వచ్చిన యాక్టివా 125, యువతను ఉర్రూతలూగిస్తున్న టీవీఎస్ ఎన్ టార్క్ 125 మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.
హోండా యాక్టివా 125 ఒక క్లాసిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది హోందాగా కుటుంబంలోని అందరికీ నచ్చేలా ఉంటుంది. దీని ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, సిగ్నేచర్ స్టైల్ నగర ప్రయాణాలు ఒక ప్రీమియం లుక్ ఇస్తుంది.
దీనికి పూర్తిగా భిన్నంగా టీవీఎస్ ఎన్ టార్క్ 125 ఉంటుంది. ఎయిర్‌క్రాఫ్ట్ ప్రేరేపిత స్పోర్టీ డిజైన్, షార్ప్ లైన్స్ దీని సొంతం. ఇది కేవలం ప్రయాణం కోసమే కాదు, రోడ్డుపై ఒక స్టేట్‌మెంట్ ఇవ్వాలనుకునే యువత కోసం రూపొందించారు.
ఇంజిన్ సామర్థ్యం, పనితీరు
ఇంజిన్‌పరంగా చూస్తే రెండూ 125సీసీ విభాగంలోనే ఉన్నా, వాటి స్వభావం వేరు. హోండా యాక్టివా 125 వాహనం 123.92 సీసీ ఇంజన్‌తో 8.42 పీఎస్ పవర్, 10.5ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. దీని ఇంజన్ చాలా రిఫైన్డ్‌గా ఉండి, సైలెంట్ స్టార్ట్ సిస్టమ్‌తో వస్తుంది.
టీవీఎస్ ఎన్ టార్క్ 125 వాహనం 124. 8 సీసీ ఇంజన్‌తో 9.5 పీఎస్ పవర్, 10.6ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. యాక్టివాతో పోలిస్తే ఇది మరింత శక్తివంతమైంది. వేగంగా పుంజుకుంటుంది.
ఫీచర్లు, టెక్నాలజీ
టెక్నాలజీ విషయంలో ఎన్‌టార్క్ ముందంజలో ఉంది. ఎన్ టార్క్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ అసిస్ట్, కాల్/ ఎస్‌ఎంఎస్ అలర్ట్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. యాక్టివాలో ఇవి కనిపించవు. ఎన్ టార్క్‌లో 20 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉండగా, యాక్టివాలో 18 లీటర్లు మాత్రమే ఉంది. రెండింటిలోనూ ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, డిజిటల్ కన్సోల్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
మైలేజ్‌లో ఎవరు కింగ్?
సాధారణంగా భారతీయ వినియోగదారుడు మొదట అడిగే ప్రశ్న మైలేజ్ ఎంత అని. అయితే హోండా యాక్టివా 125, టీవీస్ ఎన్ టార్క్ 125 రెండూ కూడా దాదాపు 47kmpl మైలేజీని అందిస్తున్నాయి. అయితే హైవే ప్రయాణాల్లో ఎన్ టార్క్ 53.4kmplవరకు మైలేజీని ఇవ్వగలదు.
బడ్జెట్ విషయానికి వస్తే టీవీఎస్ కాస్త చౌకగా కనిపిస్తోంది. టీవీఎస్ ఎన్ టార్క్ 125 ఎక్స్ షోరూమ్ ధర సుమారు 81, 750 రూపాయలు ఉంది. హోండా యాక్టివా 125 ప్రారంభ ధర 89, 406 రూపాయలుగా ఉంది.
