Honda Activa 125 vs Bajaj Chetak C2501: మీరు కొత్త స్కూటర్ కొనే ప్లాన్‌లో ఉన్నారా అయితే మీ మైండ్ కచ్చితంగా ఒకే ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది. "సంప్రదాయ పెట్రోల్ స్కూటర్ కొందామా లేకా ట్రెండీ ఎలక్ట్రిక్ స్కూటర్ వైపు వెళ్దామా?" ఒకవైపు దశాబ్దాలుగా ఇండియన్ రోడ్లపై తిరుగులేని రారాజుగా వెలుగుతున్న హోండా యాక్టివా 125, మరోవైపు క్లాసిక్ లుక్స్‌తో ఎలక్ట్రిక్ ప్రపంచంలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బజాజ్ చేతక్ C2501. ఈ రెండిండిలో మీ అవసరాలకు తగ్గట్టుగా మీ జేబుకు చిల్లుపడకుండా ఉండే స్కూటర్ ఏదో తేల్చుకోవడం ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. బడ్జెట్, మైలేజ్, పెర్ఫార్మెన్స్‌లో ఏది టాప్, హోండా ఇచ్చే భరోసా బెటరా? లేకా బజాజ్ అందిచే మోడ్రన్ టెక్నాలజీ గొప్పదా? పూర్తి విశ్లేషణ ఇక్కడ చూడండి.
మీ జేబుకు ఏది సెట్ అవుతుంది?
ఏ వాహనం కొనాలన్నా మనం మొదట చూసేది ధర. ఇక్కడ హోండా యాక్టివా 125 స్పష్టమైన ఆధిక్యాన్ని చూపిస్తోంది. దీని ఎక్స్‌షో రూమ్ ధర కేవలం 90,178 రూపాయలు. అదే ఆన్‌రోడ్ ధర సుమారు 1, 05, 708 రూపాయలు. ఇక బజాజ్ చేతక్ C 2501 విషయానికి వస్తే, దీని ఎక్స్ షోరూమ్ ధర 1,35, 306 రూపాయలు ఉంటే ఆన్‌రోడ్ ప్రైస్ 1, 39, 926 రూపాయులుగా ఉంది. అంటే పెట్రోల్ స్కూటర్ కంటే ఎలక్ట్రిక్ చేతక్ సుమారు 34,000పైనే ఎక్కువ ఖరీదు. అయితే పెట్రోల్ ఖర్చులు ఉండవు కాబట్టి లాంగ్ రన్‌లో చేతక్ సేవింగ్స్ ఇస్తుందని మనం గుర్తించాలి.
ఇంజిన్ పవర్ vs మోటార్ పర్ఫార్మెన్స్
హోండా యాక్టివా 125లో బలమైన 123. 92cc, 4-స్ట్రోక్ ఎస్ ఇంజిన్ ఉంది. ఇది 8.42పీఎస్ పవర్‌ను, 10.5Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీని గరిష్ట వేగం 90kmphగా ఉంది. మరోవైపు బజాచ్ చేతక్ C2501 ఒక ఎలక్ట్రిక్ హబ్ మోటార్‌తో వస్తుంది. దీని గరిష్ట వేగం కేవలం 55km/Hr మాత్రమే. వేగంగా వెళ్లాలనుకునే వారికి యాక్టివా బెస్ట్ ఛాయిస్. సిటీలో కూల్‌గా వెళ్లాలనుకునే వారికి చేతక్ సరిపోతుంది.
మైలేజ్, రేంజ్ లెక్కల సంగతి ఏంటీ?
మైలేజ్ విషయంలో యాక్టివా 125 లీటర్‌కు 47kmpl మైలేజ్ ఇస్తుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు. అంటే ఫుల్ ట్యాంక్ చేస్తే దాదాపు 250కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇక చేతక్ C2501 ఎలక్ట్రిక్ రేంజ్ అద్భుతంగా ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 113కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. దీనిని పుల్ ఛార్జ్ చేయడానికి కేవలం 3.45 గంటల సమయం మాత్రమే పడుతుంది.
టెక్నాలజీలో ఎవరు తోపు ?
ఫీచర్ల విషయంలో చేతక్ కాస్త అడ్వాన్స్‌డ్‌గా ఉంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్స్, ఎస్‌ఎంఎస్ అలర్ట్, హిల్ హోల్డ్, రివర్స్ అసిస్ట్, వంటి స్మార్ట్ పీచర్లు ఉన్నాయి. యాక్టివాలో కూడా సెమీ డిజిటల్ కన్సోల్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫీలింగ్ వంటి ప్రాక్టికల్ ఫీచర్లు ఉన్నాయి. అయితే చేతక్ మెటల్ బాడీ దీనికి ప్రీమియం లుక్ ఇస్తుంది.
