GST Bike Price Reduction: దసరా, దీపావళి వంటి పెద్ద పండుగల ముందు, కేంద్ర ప్రభుత్వం ద్విచక్ర వాహన మార్కెట్ కోసం తీపి కబురు చెప్పింది, GST రేట్లను సవరించింది. కొత్త GST రేట్ల ప్రకారం, 350cc వరకు ఉన్న బైకులపై పన్ను ఇప్పుడు 18% కి తగ్గింది. దీని అర్థం చిన్న & మధ్య తరహా బైకులు చౌకగా మారతాయి, కామన్ మ్యాన్ అందుకునే స్థాయికి దిగొస్తాయి. అదే సమయంలో, 350cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైకులను లగ్జరీ కేటగిరీలో ఉంచారు & వాటిపై పన్నును 40% కి పెంచారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఎంట్రీ-లెవల్ బైకుల అమ్మకాలను పెంచవచ్చు. అయితే, ప్రీమియం & హై-పెర్ఫార్మెన్స్ బైకుల ప్రియులు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ చిన్న బైకులు చౌకగా మారతాయిఈ మార్పు, రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై మిశ్రమ ప్రభావాన్ని చూపుతుంది. హంటర్ 350, క్లాసిక్ 350, మెటియోర్ 350 & బుల్లెట్ 350 వంటి కంపెనీ ప్రసిద్ధ బైకులు ఇప్పుడు చౌకగా మారతాయి, ఎందుకంటే వాటిపై కేవలం 18% GST మాత్రమే వర్తిస్తుంది. మరోవైపు.. హిమాలయన్ 450, గెరిల్లా 450, స్క్రామ్ 440 & 650cc సిరీస్ (ఇంటర్సెప్టర్, కాంటినెంటల్ GT, సూపర్ మెటియోర్ & షాట్‌గన్) ఇప్పుడు 40% పన్ను పరిధిలోకి చేరతాయి. దీనివల్ల వాటి ధరలు పెరుగుతాయి & అడ్వెంచర్-టూరర్ విభాగంలో డిమాండ్ కొంచెం తగ్గవచ్చు.
బజాజ్ & ట్రయంఫ్ బైకులపై ప్రభావంబజాజ్ డొమినార్ 400 & పల్సర్ NS400Z ఇప్పుడు 40% పన్ను స్లాబ్ కిందకు వచ్చాయి. బజాజ్-ట్రయంఫ్ భాగస్వామ్య మోడళ్లైన స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X &థ్రక్ట్సన్ 400 కూడా ఖరీదైనవిగా మారతాయి. ఇప్పటివరకు వీటిని మిడ్-కెపాసిటీ విభాగంలో అందుబాటు ఎంపికలుగా పరిగణించేవారు. పన్ను పెరుగుదల వాటి ఇమేజ్‌ను ప్రభావితం చేయవచ్చు.
స్ల్పెండర్ ప్లస్ ధర ఎంత తగ్గుతుంది?కొత్త GST రేటు అమలులోకి వచ్చిన తర్వాత హీరో స్ప్లెండర్ ప్లస్ ఎంత చౌకగా మారుతుందో ఒక ఉదాహరణ చూద్దాం. ప్రస్తుతం, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,426. దానిపై GSTని దాదాపు 10% తగ్గిస్తే, ధరను దాదాపు రూ. 7,900 తగ్గించవచ్చు. ఈ మేరకు కస్టమర్ ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు. అయితే, బైకు కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్-షోరూమ్ ధరతో పాటు ఇతర ఛార్జీలు కూడా యాడ్ అవుతాయి, గమనించాలి.
మొత్తం KTM సిరీస్ రేటు పెరుగుతుందిస్పోర్ట్స్ & అడ్వెంచర్ బైకులకు ప్రసిద్ధి చెందిన KTMను కొత్త GST రేట్లు ప్రభావితం చేస్తాయి. డ్యూక్ సిరీస్, RC సిరీస్ & అడ్వెంచర్ సిరీస్‌లోని చాలా బైకులు 350cc కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్నవి, వీటిపై ఇప్పుడు 40% పన్ను యాడ్ అవుతుంది. అంటే పండుగ సీజన్‌లో KTM బైకుల ధరలు పెరుగుతాయి & వాటి అమ్మకాలు ఒత్తిడికి లోనవుతాయి.
మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ లేదా క్లాసిక్ వంటి 350cc కంటే తక్కువ ఇంజిన్ ఉన్న బైకును కొనాలనుకుంటే, ఇది మీకు మంచి అవకాశం. ఈ బైకులు మునుపటి కంటే చౌకగా ఉంటాయి. మీ కల హిమాలయన్ 450, బజాజ్ డొమినార్ 400 లేదా KTM అడ్వెంచర్ వంటి మిడ్ రేంజ్ & హై రేంజ్ బైకు అయితే, ఇప్పుడు మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవాలి. ప్రభుత్వ నిర్ణయం సాధారణ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది, ప్రీమియం బైకులను ఇష్టపడే వారి జేబులపై భారం పెంచుతుంది.