ఇక నుంచి తయారు చేసే కార్లలో ఉండే ఫ్రంట్ ఫేసింగ్ సీట్లు అన్నిటికీ త్రీ-పాయింట్ సీట్ బెల్టులను కచ్చితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం తయారీదారులను ఆదేశించింది. అలాగే వెనకవైపు సీట్లలో మధ్యలో ఉండే సీటుకు కూడా ఈ నియమం వర్తిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం మీడియా సమావేశంలో తెలిపారు.


‘కార్లలో ముందు కూర్చునే వినియోగదారులకు మూడు పాయింట్ల సీట్ బెల్ట్ అందించాలి.’ అని రహదారుల శాఖ మంత్రి తెలిపారు. ప్రస్తుతం మనదేశంలో తయారయ్యే కార్లలో ముందు సీట్లకు, వెనకవైపు రెండు సీట్లకు మాత్రమే త్రీ-పాయింట్ సీటు బెల్టులను అందిస్తున్నారు. మధ్యలో ఉండే సీట్లకు మాత్రం 2-పాయింట్ లేదా ల్యాప్ సీట్ బెల్టును అందిస్తున్నారు. మనదేశంలో ప్రతి సంవత్సరం ఐదు లక్షలకు పైగా రోడ్డు యాక్సిడెంట్లలో సుమారు లక్షన్నర మందికి పైగా మరణిస్తున్నారని గడ్కరీ తెలిపారు.