Government Approves 503 Crore For 4874 EV Chargers: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వాడకాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ఈ-డ్రైవ్ (PM E-Drive) పథకం కింద దేశవ్యాప్తంగా 4,874 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రూ. 503.86 కోట్ల విలువైన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి అత్యధికంగా రూ. 123.26 కోట్లు కేటాయించి, అక్కడ 1,243 ఛార్జర్లు ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి మే 12న ఈ వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనదారులకు ఛార్జింగ్ ఇబ్బందులు లేకుండా చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 

Continues below advertisement

రాష్ట్రాల వారీగా ఛార్జింగ్ నెట్‌వర్క్..

ఈ ప్రతిపాదన ప్రకారం రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కేరళ, తెలంగాణ, కర్ణాటక ఇంకా తమిళనాడు వంటి పలు రాష్ట్రాల్లో ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థలైన హిందుస్థాన్ పెట్రోలియం (HPCL), ఇండియన్ ఆయిల్ (IOCL) ఇంకా భారత్ పెట్రోలియం (BPCL) సంస్థలకు అప్పగించారు. ఈ చమురు సంస్థలకు చెందిన పెట్రోల్ బంకుల్లోనే కొత్త ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల వాహనదారులు తమ ప్రయాణాల మధ్యలో ఛార్జింగ్ పెట్టుకోవడం చాలా సులభం అవుతుంది. ఈ ఛార్జర్లు టూ-వీలర్లు, త్రీ-వీలర్లు, కార్లతో పాటు బస్సులు ఇంకా ట్రక్కులకు కూడా సపోర్ట్ చేస్తాయి అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Continues below advertisement

పీఎం ఈ-డ్రైవ్ బడ్జెట్ వివరాలు..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఈ-డ్రైవ్ పథకం మొత్తం బడ్జెట్ రూ. 10,900 కోట్లుగా ఉంది. ఇందులో కేవలం పబ్లిక్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే రూ. 2,000 కోట్లు కేటాయించడం విశేషం. మిగిలిన నిధులను ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఇన్సెంటివ్స్ ఇచ్చేందుకు వాడుతారు. దాదాపు 24.79 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్లు, 3.16 లక్షల త్రీ-వీలర్ల కొనుగోలుకు మద్దతుగా రూ. 3,679 కోట్లు డిమాండ్ ఇన్సెంటివ్స్ కింద ఇచ్చే అవకాశం ఉంది. అలాగే దేశవ్యాప్తంగా 14,028 ఎలక్ట్రిక్ బస్సుల పంపిణీ కోసం రూ. 4,391 కోట్లు కేటాయించారు. వాహన పరీక్షా సంస్థల ఆధునికీకరణ కోసం మరో రూ. 780 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోంది.

ఫేమ్ పథకం విజయవంతం..

గతంలో అమలు చేసిన ఫేమ్ (FAME) పథకం ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 8,932 ఈవీ ఛార్జర్లను చమురు సంస్థలు ఏర్పాటు చేశాయని కుమారస్వామి తెలిపారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం రూ. 8,735 కోట్ల సబ్సిడీని విడుదల చేసింది. ఒక్క కర్ణాటకలోనే ఇప్పటివరకు 721 ఛార్జర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు పీఎం ఈ-డ్రైవ్ ద్వారా ఈ సంఖ్యను భారీగా పెంచబోతున్నారు. పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను నిర్మించడంలో ఈ ఛార్జింగ్ స్టేషన్లు కీలక పాత్ర పోషిస్తాయి. పెట్రోల్, డీజిల్ వాహనాలపై ఆధారపడటం తగ్గించి, ప్రజలు ఈవీల వైపు మొగ్గు చూపేలా ఈ నిర్ణయం ప్రోత్సహిస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ముఖ్యమైన ప్రాంతంలో ఛార్జింగ్ పాయింట్ ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.