Upcoming Cars in June 2025: మన దేశంలో ఇప్పుడు కార్‌ల డిమాండ్‌ పెరుగుతోంది. ఈ అవకాశాన్ని క్యాష్‌ చేసుకోవడానికి కార్‌ కంపెనీలు ప్రతి నెలా కొత్త మోడళ్లను లాంచ్‌ చేస్తున్నాయి, ఇప్పటికే ఉన్న మోడళ్లను అప్‌డేట్ చేస్తున్నాయి. కొత్త & అప్‌డేటెడ్‌ మోడల్స్‌లో కనిపిస్తున్న ఫీచర్లు, టెక్నాలజీ చూస్తే మతిపోతోంది. Volkswagen Golf GTI & Tata Altroz వంటి కార్లు ఈ నెలలో (మే 2025) ప్రజల ముందుకు వచ్చాయి. వచ్చే నెల (జూన్‌ 2025‌) మరింత ప్రత్యేకంగా ఉండబోతోంది. ఆ నెలలో.. ఎలక్ట్రిక్ నుంచి లగ్జరీ సెడాన్‌ వరకు కొన్ని కొత్త కార్లు భారతీయ రోడ్లపైకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి.

జూన్‌లో లాంచ్‌ కానున్న కొత్త కార్లు

1. టాటా హారియర్ ఈవీ (Tata Harrier EV)టాటా హారియర్ EVని తొలిసారి 2025 ఇండియా మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించారు & ఇప్పుడు లాంచ్‌కు సిద్ధమైంది. దీని డిజైన్ ప్రస్తుత ICE హారియర్ మాదిరిగానే ఉంటుంది, కానీ డెడికేటెడ్‌ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. పవర్‌ట్రెయిన్ వివరాలు ఇంకా రహస్యంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇది డ్యూయల్ మోటార్ సెటప్ & దాదాపు 500 కి.మీ. రేంజ్‌ ఇస్తుందని భావిస్తున్నారు. మిడ్‌ రేంజ్‌ EV SUV విభాగంలో ఈ కార్‌ ఒక సంచలనం కాగలదని భావిస్తున్నారు.

2. మెర్సిడెస్-AMG G 63 కలెక్టర్ ఎడిషన్ (Mercedes-AMG G 63 Collector Edition)మెర్సిడెస్-బెంజ్ ఇండియా, 12 జూన్ 2025న, AMG G 63 ప్రత్యేక కలెక్టర్ ఎడిషన్‌ను విడుదల చేయబోతోంది. ఇది పరిమిత యూనిట్లలోనే అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌క్లూజివ్‌ స్టైలింగ్ ఎలిమెంట్స్‌ ఈ కార్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి. దీని ధర స్టాండర్డ్ వెర్షన్ కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ SUV లగ్జరీ & పవర్‌ల పరిపూర్ణ కలయికగా ఉంటుంది.

3. ఎంజీ సైబర్‌స్టర్ (MG Cyberster)MG సైబర్‌స్టర్ అనేది రెండు-డోర్ల కన్వర్టబుల్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు. యూత్‌కు, ముఖ్యంగా స్పోర్టీ కార్ లవర్స్‌కు పర్‌ఫెక్ట్‌ ప్యాకేజీ కాగలదు. ఇది దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ అవుతుంది, దీనిలో రెండు బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్స్‌ ఉంటాయి. స్టైల్‌, ఓపెన్-టాప్ డిజైన్ & అధిక పనితీరుతో ఈ ఫోర్‌వీలర్‌ మార్కెట్లో యునిక్‌ మోడల్‌గా పేరు తెచ్చుకోవచ్చు.

4.ఆడి Q5 ఫేస్‌లిఫ్ట్ (Audi Q5 Facelift)ఆడి Q5 జూన్‌లో మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్‌ లాంచ్‌ చేసే అవకాశం ఉంది. ఈ ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో... కొత్త ఫ్రంట్ గ్రిల్, స్లీక్ LED హెడ్‌ల్యాంపులు & అడ్వాన్స్‌డ్‌ ఇంటీరియర్ అప్‌డేట్స్‌ ఉంటాయి. ప్రస్తుతం, ఇది ఒకే ఇంజిన్ ఆప్షన్‌తో రాబోతున్నప్పటికీ,  కొన్ని కొత్త ఫీచర్లు & మెరుగైన సాంకేతికతను తీసుకురావచ్చు.

5. BMW 2 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ (BMW 2 Series Facelift)BMW 2 సిరీస్ మిడ్-సైకిల్ అప్‌డేట్‌తో లాంచ్‌ కాబోతోంది. దీనిని ఇప్పటికే ప్రపంచ మార్కెట్లలో లాంచ్‌ చేశారు & జూన్‌లో భారతదేశంలో ప్రారంభించించే అవకాశం ఉంది. దీని ఎక్స్‌టీరియర్‌ కొత్తగా & ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంటీరియర్‌లో.. కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండవచ్చు. పవర్‌ట్రెయిన్‌లోనూ స్వల్ప మార్పులు చూడవచ్చు.