ప్రపంచ ప్రఖ్యాత ఆటో దిగ్గజం ఫోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. కాస్ట్ కటింగ్ లో భాగంగా 3 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఫోర్డ్ మోటార్ కో ప్రకటించింది. వీరిలో 2 వేల మంది పూర్తిస్థాయి ఉద్యోగులున్నారు. మరో వెయ్యి మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించింది. ఈ సంస్థకు అమెరికా, కెనడాలలో 31 వేల మంది ఉద్యోగులున్నారు. ఇప్పుడు ఉద్యోగాల నుంచి తొలగింపునకు గురువుతున్న వారి సంఖ్య 6 శాతానికి చేరనుంది. భారత్‌లోని కొంత మంది ఫోర్డ్ ఉద్యోగులపైనా వేటు పడనుంది. అయితే ఫ్యాక్టరీ కార్మికులు 56 వేల మందిలో ఎవరినీ తొలగించడం లేదని వెల్లడించింది.
ఫోర్డ్ ప్రస్తుతం కొత్త సాంకేతికతతో ముందుకు వెళ్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బిల్ ఫోర్డ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ జిమ్ ఫార్లీ వెల్లడించారు. గతంతో పోల్చితే పనితీరు పూర్తిగా మారబోతుందన్నారు. అదుకే మానవ వనరులను తగ్గించుకునన్నట్లు తెలిపారు. ఉద్యోగాల కోత సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఫోర్డ్ కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే ఆటోమేకర్ ఉద్యోగులకు అంతర్గత ఇ-మెయిల్ పంపినట్లు తెలిపింది.
ఫోర్డ్ లో చాలా మంది ఉద్యోగులు ఉన్నారని.. ఎలక్ట్రిక్, సాఫ్ట్ వేర్-లాడెన్ వాహనాల పోర్ట్ ఫోలియోకు మారడానికి అవసరమైన నైపుణ్యం ప్రస్తుత ఉద్యోగులకు లేదని ఫార్లే చెప్పారు. 2026 నాటికి 3 బిలియన్ డాలర్ల వార్షిక వ్యయాలను తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. అప్పటికి 10 శాతం ప్రీ-టాక్స్ ప్రాఫిట్ మార్జిన్‌ను చేరుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. ఇది గతేడాది 7.3 శాతంగా ఉందన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలు, వాటికి శక్తినిచ్చే బ్యాటరీలపై ఫోర్డ్ కంపెనీ దృష్టి పెట్టింది. అందులో భాగంగానే వైట్ కాలర్ సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల టాటా మోటార్స్ అనుబంధ సంస్థ అయిన టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (TPEML), గుజరాత్‌లోని సనంద్ లో ఫోర్డ్ ఇండియా తయారీ ప్లాంటును రూ. 725.7 కోట్లకు కొనుగోలు చేసింది. ప్యాసింజర్ వాహన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇప్పుడు సనంద్ యూనిట్ లో మొత్తం భూమి, భవనాలు, వాహనాల తయారీ ప్లాంట్‌తో పాటు యంత్రాలు, పరికరాలను పొందుతుందని టాటా మోటార్స్ తెలిపింది. ఈ డీల్ లో అర్హులైన ఉద్యోగులందరి బదిలీ కూడా ఉంటుందని తెలిపింది.
సనంద్ ఆధారిత ప్లాంట్ కొనుగోలు కోసం టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మరియు ఫోర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ ట్రాన్స్ ఫర్ అగ్రిమెంట్ (UTA)పై సంతకం చేశాయి. టాటా మోటార్స్ దాని తయారీ సామర్థ్యం ఉన్నత స్థాయికి చేరుకోవడంతో, ఈ కొనుగోలు సులభతరం అయ్యింది. వాటాదారులందరికీ సంతోషాన్ని ఇచ్చింది. మొత్తంగా భారత్ లోని తన తయారీ ప్లాంటును టాటా కంపెనీకి కట్టబెట్టింది ఫోర్డ్. ప్రస్తుతం మరింత ఖర్చును తగ్గించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.. అందులో భాగంగానే ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. వేలాది మంది ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు అయోమయంలో పడింది.