ట్రాఫిక్ రూల్స్ కఠినతరం అయ్యాక.. వాహన ఇన్సురెన్స్ అనేది తప్పనిసరి అయ్యింది. ఇన్సురెన్స్ లేని వాహనాలను నడిపితే భారీగా జరిమానాలు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, కారు ఇన్సురెన్స్ కోసం భారీగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తక్కువ మొత్తంలో డబ్బు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. కారు కొనుగోలు చేసిన సమయం, తయారీ ఇయర్, మోడల్, బీమా కవరేజ్ రకం, ఇంజిన్ సామర్థ్యం, కారు ఉన్న ప్రదేశం లాంటి పలు అంశాలు కారు బీమా ప్రీమియం మీద ప్రభావం చూపిస్తాయి. అయితే, మొత్తం బీమా ప్రీమియంను తగ్గించడానికి కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది.
మైనర్ క్లెయిమ్లను నివారించాలి
స్క్రాచ్‌లు, చిన్న డెంట్స్ లాంటి డ్యామేజ్‌లు రిపేర్ చేయడానికి సాధారణంగా తక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి, అలాంటి రిపేర్‌లకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం వల్ల నో క్లెయిమ్ బోనస్‌ను కోల్పోయే అవకాశం ఉంటుంది. నో క్లెయిమ్ బోనస్ కలిగి ఉండటం వలన బీమా ప్రీమియంను చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
అవసరమైన యాడ్ ఆన్లను మాత్రమే ఎంచుకోవాలి
కారు బీమా ఎక్కువగా చాలా కవరేజీలను జోడించే ఆప్షన్స్ తో వస్తుంది. యాడ్-ఆన్‌ల సంఖ్యను పెంచడం వలన బీమా కంపెనీకి కారు బాధ్యత పెరుగుతుంది. దీని మూలంగా అధిక బీమా ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. అందుకే, అవసరమైన యాడ్ ఆన్ లు మాత్రమే సెలక్ట్ చేసుకోవడం మంచింది.
స్వచ్ఛంద తగ్గింపులను పెంచాలి
స్వచ్ఛంద తగ్గింపుల సంఖ్యను పెంచడం ద్వారా, క్లెయిమ్ మొత్తంలో కొంత భాగాన్ని చెల్లించడానికి ఇన్స్యూరెన్స్ కంపెనీ అంగీకరిస్తుంది. ఇలా చేయడం ద్వారా, బీమా కంపెనీపై కారు బాధ్యత తగ్గుతుంది. ఫలితంగా బీమా ప్రీమియం తగ్గుతుంది.
మీ కారులో మోడిఫికేషన్స్ నివారించాలి
కారులో మోడిఫికేషన్స్ చేస్తే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది. అనవసర మార్పుల మూలంగా ఎక్కువ క్లెయిమ్ అందించేందుకు కంపెనీలు అంగీకరించవు. అందుకే, అనవసరమైన మార్పులను నివారించడం వలన మీ కారు యొక్క బీమా ప్రీమియం తగ్గుతుంది.
పాత కార్ల కోసం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ని ఎంచుకోండి
పాత కార్ల కోసం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌ని ఎంచుకోవడం మూలంగా కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై చాలా డబ్బు ఆదా అవుతుంది. ఎందుకంటే పాత కార్ల IDV విలువ సాధారణంగా తక్కువగా ఉంటుంది.
యాంటీ-థెఫ్ట్ పరికరాలను ఇన్స్టాల్ చేయాలి
కారు బీమా ఖర్చు బీమా కంపెనీకి కారు విధించే షరతుల మీద ఆధారపడి ఉంటుంది. యాంటీ-థెఫ్ట్ పరికరాలను ఇన్‌స్టాల్ చేయడం వలన మీ కారు దొంగిలించబడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాంటీ-థెఫ్ట్ అలారం, స్టీరింగ్ లాక్, గేర్ లాక్, సహా పలు యాంటీ-థెఫ్ట్ పరికరాలను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా మీ కారు యొక్క బీమా ప్రీమియం తగిన మార్జిన్‌తో తగ్గించబడుతుంది.
పాలసీ డబ్బులు సకాలంలో చెల్లించాలి
బీమా గడువు తేదీతో వస్తుంది కాబట్టి కచ్చితంగా అనుకున్న సమయానికి చెల్లించాలి. కారు బీమాను అప్‌డేట్ చేయడంలో లేట్ చేస్తే కంపెనీ దృష్టిలో ప్రాధాన్యత కోల్పోయే అవకాశం ఉంటుంది. అటు ల్యాప్స్ అయిన పాలసీపై భారీ మొత్తాన్ని కంపెనీలు వసూలు చేస్తాయి.
కార్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం
కారు ఇన్సూరెన్స్‌ను అనవసరమైన వ్యయంగా భావించే అనేక మంది వ్యక్తులు ఉన్నప్పటికీ, నష్టాల ఖర్చులను అంచనా వేయలేనందున కారు బీమాను కలిగి ఉండటం ఉత్తమం. కారు బీమా కలిగి ఉండటం దురదృష్టకర పరిస్థితుల్లో వినియోగదారులకు మంచి ఆర్థిక చేదోడుగా ఉంటుంది.
Read Also: దేశీయ మార్కెట్లోకి అదిరిపోయే బెంజ్ కారు, త్వరలో తొలి 7-సీటర్ ఎలక్ట్రిక్ లగ్జరీ SUV లాంచ్