National Highway Toll Payment Annual Pass Telugu: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే వాహనదారులకు ఒక శుభవార్త. ఆగస్టు 15, 2025 నుంచి FASTag వార్షిక పాస్‌ అందుబాటులోకి రానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వాహన ఓనర్లకు టోల్‌ చెల్లింపుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది, ఏడాది మొత్తం ఇది వర్తిస్తుంది. ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ ద్వారా ఒక్కసారి చెల్లింపుతో మొత్తం 200 టోల్‌ ట్రిప్స్‌ లేదా ఒక సంవత్సరం వరకు ఎలాంటి అదనపు చెల్లింపు లేకుండా ప్రయాణించవచ్చు. ముఖ్యంగా, తరచూ ప్రయాణించే కారు, జీప్‌, వాన్‌ యజమానులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Continues below advertisement


పాస్‌ ధర & వాలిడిటీ
ఈ వార్షిక పాస్‌ ధర ₹3,000. దీని వాలిడిటీ కొనుగోలు తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. 200 టోల్‌ ట్రిప్స్‌ లేదా 1 సంవత్సరం, ఈ రెండింటిలో ఏది ముందుగా ముగుస్తుందో అంతవరకు ఉంటుంది. ఉదాహరణకు, మీరు 10 నెలల్లో 200 ట్రిప్స్‌ పూర్తి చేస్తే పాస్‌ వ్యాలిడిటీ ఆటోమేటిక్‌గా ముగుస్తుంది. అప్పుడు మీరు ఆటోమేటిక్‌గా సాధారణ ఫాస్టాగ్‌ విధానంలోకి మారిపోతారు. మళ్లీ ఏడాది పాస్‌ను రీఛార్జ్‌ చేసుకుంటే, 200 టోల్‌ ట్రిప్స్‌ లేదా 1 సంవత్సరం వ్యాలిడిటీ అందుబాటులోకి వస్తుంది.


అర్హత
ఈ పాస్‌ వ్యక్తిగత వాహనాలకు (కారు, జీప్‌, వాన్‌) మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య వాహనాలకు ఇది వర్తించదు. అలాగే, ఒకసారి పాస్‌ కొనుగోలు చేసిన తర్వాత, అది ఆ వాహనానికి మాత్రమే లింక్‌ అవుతుంది. వేరే వాహనానికి మార్చుకోవడం సాధ్యం కాదు.


కొనుగోలు విధానం



  • FASTag వార్షిక పాస్‌ను కొనుగోలు చేయడం చాలా సులభం. మీ దగ్గర ఉన్న FASTag‌ అకౌంట్‌లోనే ఈ పాస్‌ను రీచార్జ్‌ చేయవచ్చు.

  • Rajmarg Yatra యాప్, NHAI లేదా MoRTH వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

  • మీ FASTag ID లేదా వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌తో లాగిన్‌ అయ్యి “Annual Pass” ఆప్షన్‌ ఎంచుకోవాలి.

  • ₹3,000 చెల్లింపు చేసిన వెంటనే పాస్‌ యాక్టివేట్‌ అవుతుంది.

  • రిజిస్ట్రేషన్ విజయవంతమైతే SMS లేదా యాప్‌ నోటిఫికేషన్‌ వస్తుంది.


వర్తించే ప్రదేశాలు
ఈ పాస్‌ NHAI & MoRTH ఆధ్వర్యంలోని జాతీయ రహదారి & ఎక్స్‌ప్రెస్‌వే టోల్‌ ప్లాజాల్లో మాత్రమే ఉపయోగించవచ్చు. రాష్ట్ర హైవేలు లేదా నగర పరిధిలోని టోల్‌ ప్లాజాలకు ఇది వర్తించదు. అలాంటి చోట్ల సాధారణ FASTag చెల్లింపు కొనసాగుతుంది.


ముఖ్యాంశాలు



  • పాస్‌ వ్యాలిడిటీ ఒక ఏడాది ముగిసిన వెంటనే లేదా 200 ట్రిప్స్‌ పూర్తయిన వెంటనే FASTag సాధారణ చెల్లింపు పద్ధతికి మారుతుంది.

  • ఈ పాస్‌కు ఆటోమేటిక్‌ రెన్యూవల్‌ ఆప్షన్‌ లేదు. కావాలనుకుంటే మీరు మళ్లీ ₹3,000 చెల్లించి రీచార్జ్‌ చేసుకోవాలి.

  • ట్రిప్‌ అంటే రౌండ్‌ ట్రిప్‌ (రాను,పోను) కాదు. ఒక్కసారి టోల్‌ గేట్‌ను క్రాస్‌ చేయగానే ఒక ట్రిప్‌గా లెక్కిస్తారు.


ప్రయోజనం ఎవరికీ ఎక్కువ
రోజూ లేదా వారంలో ఎక్కువసార్లు జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఇది చాలా లాభదాయకం. సాధారణంగా ఒక్క టోల్‌ చార్జీ ₹70–₹100 ఉంటుంది. ఏడాది పాస్‌తో ఒక ట్రిప్‌ ఖర్చు సగటున ₹15 కు తగ్గుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. సమయం & డబ్బు రెండింటినీ ఇది ఆదా చేస్తుంది.