EV battery replacement cost In India: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వేగంగా పెరుగుతున్నా, చాలా మంది వినియోగదారులను వెనక్కి లాగుతున్న ఒక పెద్ద ఆందోళన - 'బ్యాటరీ మార్పు ఖర్చు గురించిన భయం'. “EV కొంటే, కొన్ని సంవత్సరాల్లోనే బ్యాటరీ డెడ్ అవుతుంది, కొత్తది రీప్లేస్ చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి” అనే భావన బలంగా ఉంది. కానీ నిజానికి వాస్తవాలు చెప్పేది పూర్తిగా వేరే కథ.
ప్రధాన అవరోధాలు – Deloitte రిపోర్ట్ వెల్లడించిన విషయాలు
2025 Deloitte అధ్యయనం ప్రకారం, భారతీయులు ఎలక్ట్రిక్ వెహికల్ కొనడంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఇవి:
- ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత (39%)
- ఛార్జింగ్ టైమ్ ఎక్కువగా ఉండటం (38%)
- అధిక ప్రాథమిక ఖర్చు (32%)
- బ్యాటరీ మార్చడం గురించిన భయం (31%)
EV బ్యాటరీ మార్చడానికి ఎంత ఖర్చు అవుతుంది?
ప్రస్తుతం భారతదేశంలో EV బ్యాటరీ ధరలు వాహనం, కంపెనీ ఆధారంగా మారుతాయి. ఉదాహరణకు:
| వాహనం | బ్యాటరీ కెపాసిటీ | అంచనా ఖర్చు |
| Tata Nexon EV | 30.2 kWh | ₹3.5 లక్షల నుంచి ₹4.5 లక్షలు |
| Tata Tiago EV | 19.2 kWh | సుమారు ₹3.8 లక్షలు |
| MG ZS EV | 50.3 kWh | ₹6.6 లక్షల నుంచి ₹8.5 లక్షలు |
| Hyundai Kona Electric | 39.2 kWh | సుమారు ₹11.9 లక్షలు |
సాధారణంగా EV బ్యాటరీ మార్చడానికి ₹3 లక్షల నుంచి ₹8 లక్షల వరకు అవుతుంది. ఇది వాహన విలువలో సుమారు 50% ఉంటుంది. ఇది ఖరీదైనదే అయినప్పటికీ ఈ ఖర్చు కారు కొన్న వెంటనే తరుముకుంటూ రావడం లేదు. కంపెనీ ఇచ్చే బ్యాటరీ చాలా సంవత్సరాల వరకు చక్కగా పని చేస్తుంది.
బ్యాటరీ జీవితకాలం - అపోహలు vs వాస్తవాలు
అపోహ: EV బ్యాటరీ 5-7 సంవత్సరాల్లోనే డెడ్ అవుతుంది.వాస్తవం: ఆధునిక EV బ్యాటరీలు 10-20 సంవత్సరాలు సులభంగా పని చేస్తాయి.
సగటు డీగ్రేడేషన్ రేట్ సంవత్సరానికి కేవలం 1.8%
టెస్లా డేటా ప్రకారం 7 సంవత్సరాల తర్వాత కూడా 93% బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. 2 లక్షల కి.మీ. డ్రైవ్ చేసిన తర్వాత కూడా 80% కెపాసిటీ మిగులుతుంది. అంటే, మొబైల్ ఫోన్ బ్యాటరీలా ఇవి త్వరగా డీగ్రేడ్ కావు.
వారంటీలతో ధైర్యం నూరిపోస్తున్న కంపెనీలు
టాటా మోటార్స్ - లైఫ్‌టైమ్ వారంటీ (15 సంవత్సరాలు/అన్‌లిమిటెడ్ కి.మీ.లు)
ఓలా ఎలక్ట్రిక్ - 8 సంవత్సరాలు/1.25 లక్షల కి.మీ.లు, ట్రాన్‌ఫరబుల్ వారంటీ
ఈ వారంటీలు వినియోగదారుల ఆందోళనను తగ్గిస్తున్నాయి.
భవిష్యత్తు ధరలు భారీగా తగ్గుతాయి!
Goldman Sachs అంచనా ప్రకారం, 2025 పూర్తయ్యే నాటికి ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ధరలు 33% పడిపోతాయి. 2030 నాటికి దాదాపు 66% వరకు తగ్గుతాయి. అంటే EVలు కూడా ICE (సాంప్రదాయ ఇంధన ఇంజిన్) వాహనాలతో సమాన ధరలకు లభిస్తాయి.
చివరిగా చెప్పొచ్చేదేమిటంటే...బ్యాటరీ మార్చడం గురించిన భయం ఎక్కువగా అపోహల మీద ఆధారపడి ఉంది. వాస్తవానికి ఆధునిక EV బ్యాటరీలు 10-20 సంవత్సరాల పాటు పని చేస్తాయి. పెద్ద కంపెనీలు వారంటీ ఇస్తున్నాయి. భవిష్యత్తులో బ్యాటరీ ధరలు మరింత చౌక అవుతాయి. కాబట్టి, సరైన అవగాహన పెంచుకుంటే చాలు, EVలు భయంకరమైన రిస్క్ మాత్రం కాదు, భవిష్యత్తు రవాణా పరిష్కారం అని స్పష్టంగా చెప్పొచ్చు.