Electric Two-Wheeler Documents: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. పెట్రోల్ & డీజిల్ ధరలు పెరగడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా ఎక్కువ మంది ఎలక్ట్రిక్‌ టూవీలర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ నడిపేందుకు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం? అన్ని ఎలక్ట్రిక్‌ టూవీలర్లకు ఒకే నిబంధనలు వర్తిస్తాయా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Continues below advertisement

డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరా?Electric Two Wheelerకు సంబంధించిన నిబంధనలు దాని మోటార్ సామర్థ్యం & గరిష్ఠ వేగాన్ని బట్టి మారుతాయి. 250W కంటే తక్కువ మోటార్ పవర్ & గంటకు గరిష్ఠంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే 'లో స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌'కు డ్రైవింగ్‌ లైసెన్స్‌ (Driving Licence) అవసరం లేదు. అలాగే RTO రిజిస్ట్రేషన్‌ కూడా ఉండదు. అందువల్ల విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు & తక్కువ దూర ప్రయాణాలు చేసే వారికి ఇవి మంచి ఎంపికగా మారుతున్నాయి.

అయితే 250W కంటే ఎక్కువ పవర్ లేదా గంటకు 25 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లే ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడపాలంటే చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి. లైసెన్స్ లేకుండా అలాంటి వాహనాలను నడపడం చట్టవిరుద్ధం.

Continues below advertisement

ఇది కూడా చదవండి: టీవీఎస్‌ ఆర్బిటర్‌ vs బజాజ్‌ చేతక్‌! బడ్జెట్‌ ఈవీ రేసులో ఏ స్కూటర్‌ కింగ్‌?

వయోపరిమితి ఎంత?భారత్‌లో సాధారణంగా మోటార్ సైకిల్ లేదా స్కూటర్ నడిపేందుకు కనీస వయస్సు 18 సంవత్సరాలు. అయితే, లో స్పీడ్ & గేర్‌లెస్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌లు/స్కూటర్లను కొన్ని నిబంధనల ప్రకారం 16 సంవత్సరాలు పూర్తి చేసిన వారు కూడా ఉపయోగించవచ్చు. అయినప్పటికీ, స్థానిక నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించడం మంచిది.

ఇన్సూరెన్స్‌ ఎందుకు అవసరం?250W లోపు పవర్ & 25 kmph లోపు వేగంతో నడిచే 'లో స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌'కు బీమా (Insurance) చట్టపరంగా తప్పనిసరి కాదు. అయినప్పటికీ ప్రమాదాలు, దొంగతనం వంటి అనుకోని పరిస్థితుల నుంచి ఆర్థిక రక్షణ కోసం ఇన్సూరెన్స్‌ తీసుకోవడం ప్రయోజనకరం.

అధిక వేగంతో ప్రయాణించే ఎలక్ట్రిక్‌ టూవీలర్లకు మాత్రం ఇన్సూరెన్స్‌ తప్పనిసరి. ముఖ్యంగా, సమగ్ర బీమా (Comprehensive Insurance) తీసుకుంటే ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, దొంగతనం వంటి అనేక రకాల నష్టాలకు రక్షణ లభిస్తుంది. ఇన్సూరెన్స్‌ క్లెయిమ్ పొందాలంటే చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి.

ఇది కూడా చదవండి: Toyota Fortunerకు అదిరిపోయే మేకోవర్ - కొత్త జనరేషన్ SUVలా మార్చేసిన ఓనర్

నంబర్‌ ప్లేట్‌ & రిజిస్ట్రేషన్‌ నిబంధనలుకేంద్ర మోటారు వాహనాల నిబంధనలు, 1989 ప్రకారం RTOలో నమోదయ్యే ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ (High Security Registration Plate (HSRP)) తప్పనిసరి. ఈ నిబంధన అధిక వేగం గల ఎలక్ట్రిక్‌ టూవీలర్లకు కూడా వర్తిస్తుంది.

అయితే 250W లోపు పవర్ & గరిష్ఠంగా 25 kmph వేగంతో నడిచే లో స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌'కు RTO రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు. అందువల్ల HSRP నంబర్‌ ప్లేట్‌ కూడా అవసరం ఉండదు. ఈ మినహాయింపు వల్ల కొనుగోలుదారులకు డాక్యుమెంటేషన్ ప్రక్రియ మరింత సులభమవుతోంది.

రహదారి పన్ను & రిజిస్ట్రేషన్ ఫీజులో రాయితీలుఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపులు ప్రకటించింది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్‌ టూవీలర్లను రిజిస్టర్ చేసుకునే ఖర్చు తగ్గుతోంది. అదే విధంగా, ఎలక్ట్రిక్‌ వాహనం కొనుగోలుదారులకు కొన్ని పథకాల ద్వారా ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది.

రాష్ట్రాల వారీగా సబ్సిడీలుఎలక్ట్రిక్‌ టూవీలర్లకు లభించే రాయితీ (Subsidy) ప్రతి రాష్ట్రంలో ఒకేలా ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ EV పాలసీల ప్రకారం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. అందువల్ల కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌/స్కూటర్‌ కొనుగోలు చేసే ముందు ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న రాయితీలు, పన్ను మినహాయింపులు & ఇతర ప్రయోజనాలను పరిశీలించడం మంచిది.

ఎలక్ట్రిక్‌ వాహనం కొనుగోలు చేసే ముందు, ఆ వాహనం 'లో స్పీడ్‌ విభాగం'లోకి వస్తుందా లేదా 'హై స్పీడ్‌ విభాగం'లోకి వస్తుందా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. దానికి అనుగుణంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌, రిజిస్ట్రేషన్‌ & ఇతర డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుంటే చట్టపరమైన ఇబ్బందులు లేకుండా పర్యావరణ హిత ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.