E20 petrol could damage rubber parts: దేశంలో E20 పెట్రోల్‌పై అనుమానాల పరంపరకు అడ్డుకట్ట పడడం లేదు. E20 ఇంధనం వల్ల ఇంజిన్‌లు దెబ్బతింటున్నాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వేళ, 2021లో ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నిర్వహించిన అధ్యయనం మరోసారి చర్చనీయాంశంగా మారింది. E20 పెట్రోల్ వినియోగం వల్ల లోహ భాగాలపై పెద్దగా ప్రభావం లేకపోయినా, కొన్ని రబ్బర్ & ప్లాస్టిక్ భాగాలపై దీర్ఘకాలంలో ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.
పరిశోధన ఇలా సాగింది...
ఈ పరిశోధనలో ఫ్యూయల్ సిస్టమ్‌లో ఉపయోగించే 8 రకాల లోహాలు, 6 రకాల ఎలాస్టోమర్లు, 4 రకాల ప్లాస్టిక్ పదార్థాలను పరీక్షించారు. నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్ణీత కాలం పాటు E20 ఇంధనంలో ముంచి వాటి పనితీరును పరిశీలించారు. పోలిక కోసం E10 పెట్రోల్‌ను ప్రామాణికంగా తీసుకుని రెండు ఇంధనాల ప్రభావాన్ని విశ్లేషించారు.
లోహాలపై తుప్పు పట్టే స్థాయిని బరువు మార్పుల ఆధారంగా అంచనా వేశారు. అదే సమయంలో రబ్బర్ & ప్లాస్టిక్ భాగాల్లో బరువు, పరిమాణం, బలం, సాగుదల, గట్టితనం వంటి లక్షణాల్లో వచ్చిన మార్పులను పరిశీలించారు.
ఇది కూడా చదవండి: రూ.6 లక్షలకే కొత్త SUV తీసుకొస్తున్న మారుతి! టాటా పంచ్‌కి షాక్ తప్పదా?
ARAI నివేదిక ప్రకారం, E20 ఇంధనం వల్ల లోహ భాగాలపై గణనీయమైన ప్రభావం కనిపించలేదు. అయితే NBR-PVC, ఎపిక్లోరోహైడ్రిన్ వంటి రబ్బర్ పదార్థాలు & PA66 అనే ప్లాస్టిక్ పదార్థంపై సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఎక్కువ ప్రభావం కనిపించినట్లు పేర్కొంది. ఈ పదార్థాలను సాధారణంగా గ్యాస్కెట్లు, సీల్స్, O-రింగ్స్, పైపులు, హోస్‌లు వంటి ఫ్యూయల్ సిస్టమ్ భాగాల తయారీలో ఉపయోగిస్తారు. దీర్ఘకాలం E20 వినియోగిస్తే ఈ భాగాలు వేగంగా అరిగిపోయే అవకాశం ఉందని అధ్యయనం సూచించింది.
అదే ఏడాది విడుదలైన నీతి ఆయోగ్ నివేదిక కూడా ఈ అంశాన్ని ప్రస్తావించింది. వాహనం రకాన్ని బట్టి సగటున 6 శాతం వరకు ఫ్యూయల్ ఎఫిషియెన్సీ తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అయినప్పటికీ ఇంజిన్ పనితీరు, స్టార్ట్ సామర్థ్యం, డ్రైవబిలిటీ వంటి అంశాల్లో ఎలాంటి తీవ్రమైన లోపాలు కనిపించలేదని స్పష్టం చేసింది. ఇంజిన్‌లో అసాధారణ అరుగుదల, కార్బన్ డిపాజిట్లు లేదా ఇంజిన్ ఆయిల్ నాణ్యత తగ్గిన ఆనవాళ్లు కూడా గుర్తించలేదని నివేదిక వెల్లడించింది.
ఇటీవల సోషల్ మీడియాలో E20 పెట్రోల్ వల్ల ఇంజిన్‌లు దెబ్బతింటున్నాయంటూ అనేక పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటివరకు వాటిని నిర్ధారించే స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇటీవల ఒక ఇన్నోవా హైక్రాస్ యజమాని చేసిన ఆరోపణలను టయోటా కూడా ఖండించింది. ఆ వాహనంలో తలెత్తిన సమస్య E20 వల్ల కాదని, కలుషితమైన ఇంధనం కారణమని కంపెనీ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: E20పై కేంద్రమంత్రి కీలక ప్రకటన! హర్దీప్ సింగ్ ఏం చెప్పారంటే?
2023 ఏప్రిల్ తర్వాత తయారైన కొత్త కార్లు & ద్విచక్ర వాహనాలు ఇప్పటికే E20 ప్రమాణాలకు అనుగుణంగా తయారవుతున్నాయి. కాబట్టి అలాంటి వాహనాల యజమానులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ E20 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించని పాత వాహనాల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ఫ్యూయల్ సిస్టమ్‌లోని రబ్బర్ & ప్లాస్టిక్ భాగాలను ప్రత్యేక అప్‌గ్రేడ్ కిట్లతో మార్చుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఏ వాహన తయారీ సంస్థ కూడా అధికారికంగా అలాంటి కిట్లను అందుబాటులోకి తీసుకురాలేదు. ప్రస్తుతం కొన్ని థర్డ్ పార్టీ సంస్థల వద్ద మాత్రమే ఇవి లభిస్తున్నాయి. వాటి ఖర్చును పూర్తిగా వాహన యజమానే భరించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే, E20కే పరిమితం కాకుండా భవిష్యత్తులో E22, E25, E27 & E30 వంటి అధిక ఎథనాల్ మిశ్రమ ఇంధనాలను కూడా ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న E10 & E20 వాహనాలపై E25 ప్రభావాన్ని అధ్యయనం చేయాలని ARAIకి బాధ్యతలు అప్పగించారు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
