E20 Petrol Bike Scooter Performance: E20 పెట్రోల్ లేదా E20 ఇంధనం అంటే "20 శాతం ఎథనాల్ కలిపిన పెట్రోల్". ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉంది. మీకు తెలీకుండానే మీరు E20 పెట్రోల్‌ను వాడేస్తున్నారు. అయితే.. కానీ బైక్, స్కూటర్ ఓనర్లు మాత్రం ఒకే ప్రశ్న వేస్తున్నారు ‒ "ఇది నా వాహనానికి మంచిదా? ఏమైనా నష్టమా?" అని. ఈ సందేహం దేశవ్యాప్తంగా ఉంది.
టూవీలర్ కంపెనీలు చెప్పింది ఏంటి?
హోండా: 2025 ఏప్రిల్ నుంచి తయారైన అన్ని ద్వి చక్ర వాహనాలు (బైకులు, స్కూటర్లు) E20 అనుకూలం. 2025 ఏప్రిల్ కంటే ముందు తయారైన మోడల్స్‌లో E20 వినియోగం వల్ల ఇంజిన్ భాగాల మీద పెద్ద ప్రభావం, సమస్యలు లేవు. కానీ, బండి పెర్ఫార్మెన్స్‌లో కొంత తేడా రావొచ్చు.
బజాజ్: 2017 నుంచి వచ్చిన BS4 మోడల్స్ వరకు E20 కి మెటీరియల్ పరంగా అనుకూలంగా ఉంటాయి.
TVS: 2023 నుంచి మా అన్ని వాహనాలు E20 రెడీగా తయారవుతున్నాయి.
హీరో మోటోకార్ప్: ఏప్రిల్ 2023 నుంచి కొత్త వాహనాలు పూర్తిగా E20 కంపాటిబుల్. పాత BS-III/BS-IV మోడల్స్‌లో ఇంధన సామర్థ్యం కొంచెం తగ్గొచ్చు కానీ పెద్ద ఇబ్బందులు ఉండవు.
రాయల్ ఎన్‌ఫీల్డ్: BS6 అమలులోకి వచ్చిన 2020 నుంచే మొత్తం లైనప్ E20కి సపోర్ట్ చేస్తోంది. పాత మోడల్స్ కోసం అప్‌గ్రేడ్ కిట్స్ ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నాం.
బండి వారంటీపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?BS6 మోడల్ వాహనాలకు వారంటీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. "మాన్యువల్‌లో వేరే సూచనలు ఉన్నా కూడా, వాహనాలకు ఉన్న వారంటీ E20 వాడకం వల్ల రద్దు కాదు" అని SIAM (Society of Indian Automobile Manufacturers) స్పష్టంగా చెప్పింది.
ఎలాంటి సమస్యలు రావొచ్చు?
| సమస్య | వివరణ |
| ఇంధన సామర్థ్యం తగ్గడం | వాహనం వయస్సు, రైడింగ్ స్టైల్‌పై ఆధారపడి 3–20% వరకు పడిపోవచ్చు. |
| పనితనం తగ్గడం | ముఖ్యంగా పాత కార్బ్యురేటర్ వాహనాల్లో స్పష్టంగా కనిపించవచ్చు. |
| చలికాలం స్టార్టింగ్ ట్రబుల్ | చల్లటి వాతావరణంలో లేదా వాహనం ఎక్కువ రోజులు ఆఫ్‌లో ఉంటే ఈ సమస్య రావచ్చు. |
| విడిభాగాలు మాసుకుపోవడం | రబ్బరు, మెటల్ ఇంధన భాగాలు ఎక్కువ కాలం తర్వాత నష్టపోవచ్చు. |
పాత బైక్‌ల పరిస్థితి ఏంటి?BS4కు ముందు వచ్చిన పాత బైక్‌లు ఎక్కువగా కార్బ్యురేటర్‌తో ఉంటాయి. వీటిలో ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడకం వల్ల మిస్‌ఫైర్, ఇంధన తగ్గుదల వంటి సమస్యలు రావొచ్చు. ఇలాంటి కేసుల్లో, కార్బ్యురేటర్ జెట్టింగ్ మార్చించడం మంచి పరిష్కారం. అయితే ఇంధన ట్యాంక్, పైపులు, రబ్బరు సీల్స్ వంటి భాగాలు ఎథనాల్ వల్ల త్వరగా పాడవుతాయేమోనన్న సందేహం ఉంది.
మీ బైక్, స్కూటర్‌ను ఎలా కాపాడుకోవాలి?
BS6 తర్వాతి వాహనాలు: టెన్షన్ అవసరం లేదు. ఇంధన ఇంజెక్షన్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఫ్యూయల్ మిశ్రమాన్ని అడ్జస్ట్ చేస్తుంది. ట్యాంక్‌లో రస్ట్ ఉందో లేదో చెక్ చేస్తూ ఉండండి.
పాత వాహనాలు: కార్బ్యురేటర్ సర్దుబాటు చేయించుకోవాలి. పెర్ఫార్మెన్స్ తగ్గితే వర్క్‌షాప్‌లో చెక్ చేయించండి.
పెట్రోల్ నిల్వ: వాహనాన్ని ఎక్కువ రోజులు వాడకపోతే ఫుల్ ట్యాంక్‌తో పార్క్ చేయండి. ఇలా చేస్తే తేమ వేరు కావడం వల్ల జరిగే నష్టం తగ్గుతుంది.
రెగ్యులర్ సర్వీసింగ్: ట్యాంక్, ఇంధన పైపులు, సీల్స్ లాంటి భాగాలను సర్వీస్ సమయంలో పరిశీలించండి.
E20 పెట్రోల్ వాడటం తప్పనిసరి మార్పు, ఇది పర్యావరణానికి మేలు చేస్తుంది. అయితే, వాహన యజమానులు తమ బండి వయస్సు, మోడల్ ఆధారంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త బైక్‌లు, స్కూటర్లకు పెద్ద సమస్య లేదు. పాత వాహనాలను రెగ్యులర్ చెకప్, మెయింటెనెన్స్‌తో సేఫ్‌గా వాడుకోవచ్చు.