Drum Brakes vs Disc Brakes Latest Auto News: కారు కొనేటప్పుడు అందరూ ఇంజన్ పవర్, మైలేజీ, ఫీచర్ల మీద ఫోకస్ పెడతారు. కానీ ప్రాణాలను కాపాడే బ్రేకింగ్ సిస్టమ్ గురించి పెద్దగా పట్టించుకోరు. స్పెసిఫికేషన్ షీట్‌లో ఎక్కడో లోపల ఉండే బ్రేక్స్ వివరాలు మీ సేఫ్టీని, మెయింటెనెన్స్ ఖర్చులను డిసైడ్ చేస్తాయి. ఇండియాలో ప్రస్తుతం డ్రమ్, డిస్క్ బ్రేక్స్ రెండూ వాడుకలో ఉన్నాయి. వీటి మధ్య ఉన్న అసలు తేడాలేంటో ఇప్పుడు చూద్దాం.
డ్రమ్ బ్రేక్స్ అంటే ఏమిటి?ఇది చాలా పాత కాలం నాటి టెక్నాలజీ. ఇప్పటికీ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు, కాంపాక్ట్ సెడాన్ల వెనుక చక్రాలకు వీటిని వాడుతున్నారు. ఇందులో చక్రానికి ఒక డ్రమ్ ఉంటుంది. దాని లోపల బ్రేక్ షూస్ ఉంటాయి. మీరు బ్రేక్ నొక్కినప్పుడు హైడ్రాలిక్ ప్రెజర్ వల్ల ఆ షూస్ బయటకు వ్యాపించి డ్రమ్ లోపలి భాగాన్ని నొక్కుతాయి. ఆ ఘర్షణ వల్ల చక్రం ఆగిపోతుంది. ఇవి సిటీ ట్రాఫిక్‌లో తక్కువ స్పీడ్‌లో వెళ్లేటప్పుడు బాగానే పనిచేస్తాయి. కాకపోతే ఎక్కువసేపు బ్రేకులు వేస్తే లోపల వేడి పెరిగిపోయి పట్టు తగ్గే అవకాశం ఉంటుంది.
డిస్క్ బ్రేక్స్ స్పెషాలిటీ ఏంటి?ఇవి లేటెస్ట్ టెక్నాలజీతో తయారైనవి. ఇప్పుడు ఇండియాలో దొరికే దాదాపు అన్ని కార్ల ముందు చక్రాలకు డిస్క్ బ్రేక్స్ కంపల్సరీగా వస్తున్నాయి. ఇందులో ఒక రోటర్ డిస్క్, ఒక కాలిపర్ ఉంటాయి. మీరు బ్రేక్ వేయగానే కాలిపర్ లోపల ఉండే బ్రేక్ ప్యాడ్స్ ఆ డిస్కును గట్టిగా పట్టుకుంటాయి. ఇవి గాలికి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల వేడిని త్వరగా బయటకు పంపేస్తాయి. హైవేల మీద ఫాస్ట్ గా వెళ్లేటప్పుడు ఇవి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తాయి. వర్షాకాలంలో నీళ్లు నిలిచిన రోడ్ల మీద వెళ్లినా కూడా డిస్క్ బ్రేక్స్ త్వరగా ఆరిపోయి పర్ఫెక్ట్ బ్రేకింగ్ ఇస్తాయి.
రెండిటి మధ్య ప్రధాన తేడాలు..డ్రమ్ బ్రేక్స్ తయారీ ఖర్చు తక్కువ. అందుకే బేస్ మోడల్ కార్ల ధరలు తగ్గించడానికి కంపెనీలు వీటిని వాడతాయి. ఇవి త్వరగా అరిగిపోవు, ఎక్కువ కాలం మన్నిక వస్తాయి. మురికి, ఇసుక పడే రోడ్ల మీద కూడా డ్రమ్ బ్రేక్స్ లోపల భాగాలు సేఫ్ గా ఉంటాయి. కానీ డిస్క్ బ్రేక్స్ విషయానికి వస్తే వీటి పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. సర్వీసింగ్ చేయడం కూడా చాలా ఈజీ. బ్రేక్ ప్యాడ్స్ ఎంతవరకు అరిగిపోయాయో బయట నుండే చూసి తెలుసుకోవచ్చు. ప్రీమియం కార్లు, ఎస్‌యూవీల్లో ఇప్పుడు నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్లే ఇస్తున్నారు. తక్కువ వేగంతో ప్రయాణించే సిటీ కార్లకు వెనుక చక్రాల దగ్గర డ్రమ్ బ్రేక్స్ ఉన్నా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మీరు తరచుగా హైవే రైడ్స్ చేసేవారైతే మాత్రం డిస్క్ బ్రేక్స్ ఉన్న వేరియంట్లను ఎంచుకోవడం ఉత్తమం. బ్రేక్ ప్యాడ్ల ఖర్చు కొంచెం ఎక్కువైనా సేఫ్టీ విషయంలో ఇవి ది బెస్ట్. మీ డ్రైవింగ్ స్టైల్‌ను బట్టి సరైన బ్రేకింగ్ సిస్టమ్ ఉన్న కారును సెలెక్ట్ చేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
