DRLs in Cars: ఈ మధ్యకాలంలో కార్లలో ఎన్నో అధునాతన ఫీచర్లు వస్తున్నాయి. భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త టెక్నాలజీలను వాహన తయారీ సంస్థలు అందిస్తున్నాయి. అలాంటి వాటిలో DRLs కూడా ఒకటి. చాలా కొత్త కార్లలో ఈ లైట్లు కనిపిస్తున్నాయి. అయితే DRLs అంటే ఏమిటి? అవి ఎందుకు ఉంటాయి? ఎలా పనిచేస్తాయి? అనే విషయం చాలామందికి పూర్తిగా తెలియదు.

Continues below advertisement

DRLs అంటే ఏంటి?

DRLs అంటే డేటైమ్ రన్నింగ్ లైట్స్. అంటే పగటిపూట మీ వాహనం ఇంకా స్పష్టంగా కనిపించేలా చేసే లైట్లు. ఇవి సాధారణంగా కారు ముందు భాగంలో హెడ్‌లైట్ల దగ్గర ఉంటాయి. కొన్ని కార్లలో బంపర్ ప్రాంతంలోనూ ఏర్పాటు చేస్తారు. కారు స్టార్ట్ చేసినప్పుడు DRLs ఆటోమేటిక్‌గా వెలుగుతాయి. డ్రైవర్ ప్రత్యేకంగా స్విచ్ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. వీటి ప్రధాన ఉద్దేశం రోడ్డుపై ఇతరులకు మీ కారును స్పష్టంగా కనిపించేలా చేయడం. ముఖ్యంగా హైవేలపై, రద్దీగా ఉండే రోడ్లపై, మబ్బులు లేదా వర్షం ఉన్నప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి.

Continues below advertisement

DRLs ఎలా పనిచేస్తాయి?

DRLs వ్యవస్థ కారు విద్యుత్ వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. కారు స్టార్ట్ అయిన వెంటనే లైట్లు వెలుగుతాయి. కొన్ని కార్లలో సెన్సర్లు వెలుతురు పరిస్థితులను గుర్తిస్తాయి. చీకటి పెరిగినప్పుడు హెడ్‌లైట్లు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి. హెడ్‌లైట్లు ఆన్ అయిన తర్వాత కొన్ని వాహనాల్లో DRLs మసకబారతాయి. మరికొన్ని కార్లలో పూర్తిగా ఆఫ్ అవుతాయి. ఇలా డ్రైవర్‌కు అదనపు పని అవసరం లేకుండానే ఈ లైటింగ్ వ్యవస్థ పనిచేస్తుంది.

DRLs వల్ల ప్రయోజనాలు ఏంటి?

DRLs ప్రధాన ప్రయోజనం వాహనం కనిపించే సామర్థ్యాన్ని పెంచడం. పగటిపూట కూడా ఎదురుగా వచ్చే డ్రైవర్లు, బైక్ రైడర్లు, పాదచారులు మీ వాహనాన్ని సులభంగా గుర్తించగలుగుతారు. దీంతో ప్రమాదాల ముప్పు తగ్గే అవకాశం ఉంటుంది.

వీటికున్న మరో ప్రత్యేకత.. తక్కువ విద్యుత్ వినియోగం. ప్రస్తుతం చాలా కార్లలో LED DRLs ఉపయోగిస్తున్నారు. ఇవి తక్కువ విద్యుత్‌తో మంచి వెలుతురును అందిస్తాయి. అంతేకాదు.. కారుకు ఆధునిక రూపాన్ని కూడా ఇస్తాయి. ముఖ్యంగా కొత్త మోడళ్లలో స్టైలిష్‌గా కనిపించేలా వీటిని డిజైన్ చేస్తున్నారు. దీంతో కారు ప్రీమియం లుక్‌ను సొంతం చేసుకుంటుంది.

ఇది కూడా చదవండి: టైర్‌ మార్పు నుంచి టోయింగ్‌ వరకు, నిల్‌ పెట్రోల్‌ నుంచి ఇంజిన్‌ డౌన్‌ వరకు.. మీ ఆపదలో ఆదుకునే సర్వీస్‌ ఇది!

DRLs - హెడ్‌లైట్‌ మధ్య తేడా ఏంటి?

DRLs, హెడ్‌లైట్లు ఒకటి కాదు. వాటి పని కూడా వేర్వేరు. DRLs ప్రధాన ఉద్దేశం పగటిపూట వాహనం ఇతరులకు కనిపించేలా చేయడం. హెడ్‌లైట్లు మాత్రం చీకటిలో రోడ్డును స్పష్టంగా చూపించడానికి ఉపయోగపడతాయి. DRLs సాధారణంగా తక్కువ కాంతితో పనిచేస్తాయి. విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. హెడ్‌లైట్లు ఎక్కువ కాంతిని ఇస్తాయి. రాత్రివేళ రోడ్డుపై ముందున్న ప్రాంతాన్ని స్పష్టంగా చూడటానికి అవి అవసరం.

DRLsలో సమస్యలు వస్తే?

ఇతర వాహన భాగాల మాదిరిగానే DRLsలోనూ సమస్యలు రావచ్చు. లైట్లు మిణుకుమిణుకుమంటూ వెలగడం, కాంతి తగ్గిపోవడం, ఒకవైపు మాత్రమే పనిచేయడం, పూర్తిగా ఆఫ్ అవడం వంటివి సాధారణ సమస్యలు. వైరింగ్ లోపాలు, ఫ్యూజ్ సమస్యలు, బ్యాటరీ బలహీనపడటం, ఎల్‌ఈడీ దెబ్బతినడం వంటి కారణాలతో ఇలా జరగవచ్చు. లైట్లు సరిగా పనిచేయకపోతే వెంటనే తనిఖీ చేయించుకోవాలి. ఫ్యూజ్, వైరింగ్ కనెక్షన్లు, లైట్ యూనిట్‌ను నిపుణులతో పరీక్షించాలి. లైట్ కవర్లపై దుమ్ము ఉన్నా కాంతి తగ్గవచ్చు. కాబట్టి వాటిని శుభ్రంగా ఉంచడం కూడా ముఖ్యం.

ఇది కూడా చదవండి: కైగర్ నుంచి డస్టర్ వరకు.. రెనాల్ట్ కార్లపై అదిరిపోయే బెనిఫిట్స్, ఈ నెలలో మాత్రమే

DRLs అనేవి ఆధునిక కార్లలో ఉపయోగకరమైన భద్రత ఫీచర్. ఇవి రోడ్డుపై వాహనం కనిపించేలా చేయడంతో పాటు కారుకు స్టైలిష్ రూపాన్ని కూడా ఇస్తాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.