Roadside Assistance Service India: ప్రతిరోజూ కారులో ప్రయాణించేవారికి చిన్నపాటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. టైర్‌ పంక్చర్‌ కావచ్చు. బ్యాటరీ డౌన్‌ కావచ్చు. పెట్రోల్‌ అయిపోవచ్చు. ఒక్కోసారి కారు అసలు స్టార్ట్‌ కాకపోవచ్చు. ఇలాంటి సమస్యలు ఎప్పుడు వస్తాయో చెప్పలేం. ముఖ్యంగా వర్షంలో, చీకటిలో, హైవేపై లేదా అపరిచిత ప్రాంతంలో కారు ఆగిపోతే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఇలాంటి సమయాల్లో "రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌" సేవలు ఎంతో ఉపయోగపడతాయి. అత్యవసర పరిస్థితుల్లో వాహనదారుడికి వెంటనే సాయం అందిస్తాయి. చిన్న సమస్యను అక్కడికక్కడే పరిష్కరించడంతో పాటు, అవసరమైతే కారును సురక్షిత ప్రాంతానికి తరలిస్తాయి.

Continues below advertisement

టైర్‌ పంక్చర్‌ అయితే..టైర్‌లో గాలి పూర్తిగా పోయినా లేదా టైర్‌ దెబ్బతిన్నా ప్రయాణం కొనసాగించడం ప్రమాదకరం. రోడ్డుపై ఉన్న గాజు ముక్కలు, మేకులు, గుంతలు, తక్కువ గాలి, టైర్‌ అరిగిపోవడం వంటి కారణాలతో పంక్చర్‌ కావచ్చు. ఇలాంటి సమయంలో రోడ్‌సైడ్‌ సిబ్బంది టైర్‌ మార్చడంలో లేదా మరమ్మతు చేయడంలో సాయం చేస్తారు.

బ్యాటరీ డౌన్‌ అయితే..కారు స్టార్ట్‌ కాకపోవడానికి బ్యాటరీ సమస్య ప్రధాన కారణం. లైట్లు ఆపకుండా ఉంచడం, ఎక్కువ కాలం కారు నడపకపోవడం, పాత బ్యాటరీ, విద్యుత్‌ వ్యవస్థలో లోపాలు దీనికి కారణం కావచ్చు. జంప్‌ స్టార్ట్‌ సాయంతో కారును మళ్లీ నడిపించే అవకాశం ఉంటుంది.

Continues below advertisement

పెట్రోల్‌ అయిపోతే..దూర ప్రయాణాల్లో ఇంధనం ఎంత అవసరమో సరిగ్గా అంచనా వేయలేకపోతే మధ్యలోనే కారు ఆగిపోవచ్చు. ట్రాఫిక్‌లో ఎక్కువ సమయం గడపడం వల్ల కూడా ఇంధనం ఊహించిన దానికంటే వేగంగా ఖర్చవుతుంది. ఇలాంటి సందర్భాల్లో అత్యవసర ఇంధన సరఫరా ఉపయోగపడుతుంది.

కారు స్టార్ట్‌ కాకపోతే..బ్యాటరీతో పాటు స్టార్టర్‌, ఇగ్నిషన్‌, ఇంధన సరఫరా వంటి వ్యవస్థల్లో లోపం వల్ల కారు స్టార్ట్‌ కాకపోవచ్చు. సమస్యను ప్రాథమికంగా గుర్తించి అవసరమైన సాయం అందించడంలో రోడ్‌సైడ్‌ సేవలు ఉపయోగపడతాయి.

కారు తాళాలు లోపలే ఉండిపోయినా..తాళాలు కారులోనే పెట్టి తలుపులు లాక్‌ చేసుకోవడం చాలామందికి ఎదురయ్యే సమస్య. తాళం చెవి పాడవడం లేదా ఆటోమేటిక్‌ లాకింగ్‌ వల్ల కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ నిపుణుల సాయంతో కారు తలుపును తెరవవచ్చు.

ఇది కూడా చదవండి: కేవలం రూ.6.30 లక్షలకే సేఫెస్ట్ హ్యాచ్‌బ్యాక్.. Tata Altroz కనీస డౌన్‌పేమెంట్‌, నెలవారీ EMI లెక్కలు చూశారా?

ఇంజిన్‌ వేడెక్కినా..కూలెంట్‌ తగ్గడం, రేడియేటర్‌లో లీకేజీ, కూలింగ్‌ ఫ్యాన్‌ సమస్య, థర్మోస్టాట్‌ లోపం వల్ల ఇంజిన్‌ వేడెక్కుతుంది. అలాంటి సమయంలో కారును వెంటనే ఆపాలి. ఎక్కువసేపు నడిపితే ఇంజిన్‌కు తీవ్ర నష్టం కలగవచ్చు.

విద్యుత్‌ సమస్యలు వచ్చినా..ఫ్యూజ్‌లు కాలిపోవడం, వైర్లలో సమస్యలు, బ్యాటరీ లోపాలు, సెన్సార్‌ సమస్యలు వంటి కారణాలతో కారులో విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతినవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది భద్రతకు కూడా ముప్పుగా మారుతుంది.

బ్రేకులు పనిచేయకపోతే..బ్రేక్‌ ప్యాడ్లు అరిగిపోవడం, బ్రేక్‌ లిక్విడ్‌ లీక్‌ కావడం, డిస్క్‌ల సమస్య వంటి కారణాలతో బ్రేకింగ్‌ సామర్థ్యం తగ్గుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన సమస్య. ఇలాంటి సమయంలో కారును నడపకుండా సురక్షితంగా తరలించడం మంచిది.

క్లచ్‌ విఫలమైనా..క్లచ్‌ ప్లేట్‌ అరిగిపోవడం, క్లచ్‌ లిక్విడ్‌ లీక్‌ కావడం లేదా క్లచ్‌ కేబుల్‌ దెబ్బతినడం వల్ల గేర్లు మార్చడం కష్టమవుతుంది. సమస్య తీవ్రమైతే కారు ముందుకు కదలదు. అప్పుడు టోయింగ్‌ సాయం అవసరం కావచ్చు.

పూర్తిగా కారు మొరాయిస్తే..ఇంజిన్‌, గేర్‌బాక్స్‌, ఇంధన వ్యవస్థ లేదా విద్యుత్‌ వ్యవస్థలో తీవ్రమైన లోపం వస్తే కారు పూర్తిగా ఆగిపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో  రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ నిపుణుల సాయంతో సమస్యను గుర్తించడం లేదా కారును సర్వీస్‌ కేంద్రానికి తరలించడం చేయవచ్చు.

ఇది కూడా చదవండి: మీ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిందని టెన్షన్ వద్దు.. ఇంట్లో కూర్చునే ఎలా రెన్యువల్ చేసుకోవాలంటే?

అయితే, సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీ వాహనాన్ని క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయించాలి. టైర్లలో గాలి, బ్యాటరీ, కూలెంట్‌, బ్రేకులు పరిశీలించాలి. డాష్‌బోర్డ్‌లో హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదు. కారులో అత్యవసర వస్తువులను కూడా ఉంచుకోవాలి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనుకోని సమస్యలు రావచ్చు. అలాంటి సమయంలో రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ దొరికితే భరోసాగా ఉంటుంది. కాబట్టి, రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ సర్వీస్‌ కాంటాక్ట్‌ నంబర్‌ మీ మొబైల్‌ ఫోన్‌లో తప్పకుండా ఉండాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.