Driving Licence Renewal Online Complete Guide: మనలో చాలామంది, గడువు తీరిన తమ డ్రైవింగ్‌ లైసెన్స్‌ (DL) ను రెన్యువల్‌ చేయించుకోవడం లేదు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం, గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్‌ను ఉపయోగించకూడదు. లైసెన్స్ రెన్యూవల్ ఆలస్యం చేస్తే మీకు ఫైన్‌ విధించవచ్చు. అంతేకాదు, మీరు ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే, చెల్లని లైసెన్స్ ఉన్నందుకు జ‌రిమానా కట్టాల్సి వస్తుంది. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలనుకుంటే, డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రెన్యూవల్‌ చేయించుకోవాలి. మరి, రెన్యూవల్ ఎలా చేయాలి? ఎంత ఫీజు చెల్లించాలి?.

రెన్యూవల్ చేయాల్సిన సమయంమీ డ్రైవింగ్‌ లైసెన్స్ గడువు ముగియడానికి 30 రోజుల ముందు నుంచి రెన్యూవల్‌కు అప్లై చేయవచ్చు. గడువు ముగిసిన తర్వాత 5 సంవత్సరాల లోపు అప్లై చేస్తే, మళ్లీ డ్రైవింగ్ టెస్ట్ అవసరం ఉండదు. కానీ 5 ఏళ్లు దాటితే కొత్తగా DL కోసం అప్లై చేయాలి.

ఆన్‌లైన్‌లో రెన్యూవల్ ఎలా చేయాలి?

  • parivahan.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి
  • “Online Services > Driving Licence Related Services” సెలెక్ట్ చేయండి
  • మీ రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్‌ లేదా తెలంగాణ) ఎంపిక చేసుకోండి
  • “Apply for DL Renewal” క్లిక్ చేయండి
  • అవసరమైన ఫారం (Form 2) నింపండి
  • డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
  • పేమెంట్ పూర్తి చేసి, సబ్మిట్ చేయండి
  • SMS/Email ద్వారా అప్లికేషన్ స్టేటస్‌ తెలుసుకోవచ్చు

అవసరమైన డాక్యుమెంట్లు:

  • ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్
  • ఆధార్ కార్డ్ లేదా ఇతర ఐడీ ప్రూఫ్
  • మెడికల్ సర్టిఫికెట్ (వయస్సు 40 ఏళ్లు దాటినవారికి తప్పనిసరి)
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  • స్కాన్‌ చేసిన సంతకం కాపీ

ఫీజులు & అపరాధ రుసుములు:

వివరాలు       మొత్తం ₹
రెన్యూవల్ ఫీజు  ₹200
గడువు ముగిసిన తర్వాత (30 రోజులు దాటితే)  ₹300 అపరాధ రుసుం
ఆలస్యం అయిన ప్రతి సంవత్సరానికి ₹100 అదనపు ఫీజు

ఉదాహరణకు... మీ లైసెన్స్ రెన్యువల్‌ 1 సంవత్సరం ఆలస్యమైతే: ₹200 + ₹300 + ₹100 = ₹600 చెల్లించాలి

ఆఫ్‌లైన్ ప్రక్రియ కూడా ఉందిమీ స్థానిక RTO కార్యాలయానికి నేరుగా వెళ్లి కూడా రెన్యూవల్ అప్లై చేయవచ్చు. అవసరమైన ఫారాలు నింపి, ఫీజును DD రూపంలో చెల్లించి సమర్పించవచ్చు. అక్కడ బయోమెట్రిక్ అపాయింట్‌మెంట్ తీసుకుని ఫొటో, ఫింగర్‌ప్రింట్‌లు ఇచ్చి ఈ పనిని పూర్తి చేయొచ్చు.

మీ డ్రైవింగ్‌ లైసెన్స్ గడువు పూర్తయ్యే 30 రోజుల ముందు రెన్యూవల్ చేయడం ఉత్తమం. ఆలస్యం చేస్తే ఎక్కువ ఫైన్‌ పడతుంది. RTO కార్యాలయానికి వెళ్లక్కరలేకుండా, ఆన్‌లైన్‌ ద్వారా 10 నిమిషాల్లో మీ రెన్యూవల్ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.

చివరిగా... డ్రైవింగ్‌ లైసెన్స్ రెన్యూవల్ ప్రక్రియ చాలా సులభం. డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచి, సరైన సమయానికి అప్లై చేస్తే ఫైన్‌ తప్పించుకోవచ్చు. వెహికల్‌ పర్మిట్‌ లేదా వాహన బీమా క్లెయిమ్‌లకు కూడా రెన్యూవల్ లైసెన్స్ అవసరం. కాబట్టి ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. తెలంగాణలో T App Folio App ద్వారా కూడా రెన్యువల్‌ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో RTA m-Wallet App ద్వారా డ్రైవింగ్‌ లైసెన్స్ రెన్యూవల్ పని పూర్తి చేయవచ్చు.