Continental ContiSeal Tyres: కారు టైరు పంక్చర్‌ అయితే రోడ్డుపై ఆగిపోవాల్సిందే అన్న భయం ఇప్పటికీ చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా హైవేల్లో, లేదా వర్షాకాలంలో ఈ సమస్య మరింత పెద్ద తలనొప్పిగా మారుతుంది. అలాంటి పరిస్థితులకు చెక్‌ పెట్టే ఉద్దేశంతో, కొంతకాలం క్రితం, కాంటినెంటల్‌ కంపెనీ తీసుకొచ్చిన టెక్నాలజీనే కాంటిసీల్‌ (ContiSeal). ఈ టైర్లు నిజంగా ఎంతవరకు పని కొస్తాయో తెలుసుకోవడానికి, ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్‌లు చెన్నైలోని వాబ్కో ప్రూవింగ్‌ గ్రౌండ్‌లో ప్రత్యేక ట్రాక్‌ టెస్ట్‌ నిర్వహించారు.

Continues below advertisement

టైర్ల పరీక్ష కోసం ట్రాక్‌ మీద మేకులుఈ పరీక్షలో, రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ (Range Rover Evoque) SUVకి కాంటిసీల్‌ టైర్లు అమర్చి, ప్రత్యక్షంగా డెమో చూపించారు. ట్రాక్‌కు వెళ్లే ముందు, చిన్న చిన్న మేకులు ఉన్న ప్రదేశం మీద కారును నడిపించారు. బయటకు చూస్తే ఆ మేకులు చాలా చిన్నవిగా కనిపించినప్పటికీ, కాంటినెంటల్‌ చెబుతున్న ప్రకారం కాంటిసీల్‌ టైర్లు 5 మిల్లీమీటర్ల వరకు ఉన్న పంక్చర్‌ను కూడా వెంటనే సీల్‌ చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి.

పంక్చర్‌ను ఎలా సీల్‌ చేస్తుంది?అసలు ఈ కాంటిసీల్‌ టైర్లు ఎలా పని చేస్తాయంటే, టైరు ట్రెడ్‌ లోపల భాగంలో ప్రత్యేకమైన విస్కస్‌ సీలెంట్‌ లేయర్‌ ఉంటుంది. టైరు లోపలికి నెయిల్‌ లేదా పదునైన వస్తువు వెళ్లినప్పుడు, ఆ రంధ్రాన్ని ఈ సీలెంట్‌ వెంటనే మూసేస్తుంది. సాధారణ ట్యూబ్‌లెస్‌ టైర్లలో గాలి నెమ్మదిగా బయటకు వస్తుంటే, కాంటిసీల్‌ టైర్లలో అలాంటి సమస్య ఉండదు. అంటే, గాలి అస్సలు తగ్గదు. ఒకవేళ, కారు వేగానికి టైరు నుంచి ఆ మేకు బయటకు పడిపోయినా కూడా కారును సాధారణంగా నడపవచ్చు.

Continues below advertisement

పరీక్ష అప్పుడే ఐపోలేదు...డెమో తర్వాత, పంక్చర్‌ పడిన టైర్లతోనే ఉన్న రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ను డ్రై బ్రేకింగ్‌, వెట్‌ బ్రేకింగ్‌ టెస్టులకు తీసుకెళ్లారు. డ్రై ట్రాక్‌ (పొడి రోడ్డు) మీద 50 మీటర్ల దూరంలో రెండు కోన్‌ సెట్లు ఏర్పాటు చేశారు. 60 కిలోమీటర్ల వేగంతో కారును నడిపి, మొదటి కోన్‌ దాటిన వెంటనే గట్టిగా బ్రేక్‌ వేయాలని ఇన్‌స్ట్రక్టర్లు చెప్పారు. ఈ టెస్ట్‌ లక్ష్యం – రెండో కోన్‌ చేరకముందే కారును ఆపడం. పంక్చర్‌ పడిన కాంటిసీల్‌ టైర్లు ఇక్కడ మంచి గ్రిప్‌ చూపించి, ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి.

ఆ తర్వాత వెట్‌ బ్రేకింగ్‌ ట్రాక్‌ (తడి రోడ్డు) మీద ఇదే ప్రక్రియను మళ్లీ చేశారు. తడిగా, జారుడుగా ఉన్న ఆ కాంక్రీట్‌ రోడ్‌ మీద గట్టిగా బ్రేక్‌ వేయగానే కారు సైడ్‌కు జారిపోతుందేమో అన్న అనుమానం అందరికీ వచ్చింది. కానీ ఆశ్చర్యకరంగా, టైర్లు స్ట్రెయిట్‌ లైన్‌లోనే కారును నిలిపాయి. పంక్చర్‌ అయిన తర్వాత గాలి తగ్గి టైర్లు పని చేయవేమో అనుకున్న అంచనాలను ఇవి పూర్తిగా తప్పు అని నిరూపించాయి.

ఫైనల్‌ మాటమొత్తంగా చూస్తే, రోజూ లాంగ్‌ డ్రైవ్స్‌ చేసే వారు, ప్రీమియం కార్లు వాడేవారు, హైవే సేఫ్టీకి ప్రాధాన్యం ఇచ్చే వారికి కాంటినెంటల్‌ కాంటిసీల్‌ టైర్లు మంచి ఆప్షన్‌గా కనిపిస్తున్నాయి. పంక్చర్‌ భయం లేకుండా ప్రయాణం చేయాలనుకునే వారికి ఈ టెక్నాలజీ నిజంగా ఉపయోగపడేలా ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.