CNG Cars Vs Petrol Cars Mileage Comparison: సీఎన్జీ వాహనాలు ఒకప్పుడు పెట్రోల్‌ కార్లకు చౌకైన ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. తక్కువ ధర, ఎక్కువ మైలేజీ కారణంగా ప్రజలు CNG (Compressed Natural Gas) కార్ల వైపు పెద్ద సంఖ్యలో మొగ్గు చూపారు. కానీ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా సీఎన్‌జీ ధరలు నిరంతరం పెరుగుతూ వచ్చి, ఇప్పుడు పెట్రోల్‌ ధరలకు దగ్గరగా చేరుకున్నాయి. ఈ కారణంగా వినియోగదారులు సీఎన్జీపై అంతగా ఆసక్తి చూపడం లేదు. మరోవైపు, మైలేజీ పరంగా కూడా పెద్ద తేడా లేకపోవడంతో, చాలామంది పెట్రోల్‌ వాహనాలనే ఎంచుకుంటున్నారు. సీఎన్జీ వాహనాల మెయింటెనెన్స్‌ ఖర్చులు, రీ-ఫిల్లింగ్‌ స్టేషన్ల కొరత వంటి అంశాలు కూడా ఈ మార్పునకు కారణమయ్యాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సీఎన్జీ కార్ల మార్కెట్‌లో వృద్ధి వేగం మందగించింది. భవిష్యత్తులో వినియోగదారులు హైబ్రిడ్‌ & ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మరింతగా వెళ్ళే అవకాశం ఉందని అంచనా. దీంతో, CNG ఒకప్పుడు ఇచ్చిన “చౌకైన ప్రత్యామ్నాయం” భరోసాను ఇప్పుడు బలహీనపడుతోందని స్పష్టమవుతోంది.

కొన్నేళ్ల క్రితం వరకు, పెట్రోల్‌ ధరలు పెరుగుతూనే ఉన్న సమయంలో, ప్రజలు సీఎన్జీ వాహనాల వైపు బలంగా ఆకర్షితులయ్యారు. తక్కువ ధరలో ఇంధనం, ఎక్కువ మైలేజీ ఇవ్వడం వల్ల సీఎన్జీ వాహనాలు మధ్య తరగతి కుటుంబాలకు సరిపోయే ఆప్షన్‌గా మారాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

ధరల్లో పెరుగుదలప్రస్తుతం సీఎన్జీ ధరలు క్రమంగా పెరుగుతూ, పెట్రోల్‌ ధరలకు దగ్గరగా చేరాయి. హైదరాబాద్‌, విజయవాడ వంటి నగరాల్లో లీటరు పెట్రోల్‌ ధర 110 రూపాయల వద్ద ఉండగా, కిలో సీఎన్జీ ధర 95-100 రూపాయల మధ్యలో ఉంది. ఒకప్పుడు 30-40 రూపాయల తేడా ఉండేది, ఇప్పుడు అది 10-15 రూపాయలకు తగ్గిపోయింది.

మైలేజీ తేడా లేకపోవడంసాధారణంగా ప్రజలు సీఎన్జీ వాహనాలు కొనుగోలు చేసే ప్రధాన కారణం - ఎక్కువ మైలేజీ. కానీ నేటి ఆధునిక పెట్రోల్‌ వాహనాలు కూడా లీటరుకు 18–22 కి.మీ. వరకు ఇస్తున్నాయి. సీఎన్జీ వాహనాలు ఇంకొంచం బెటర్‌గా కిలోకు 24-26 కి.మీ. ఇస్తున్నప్పటికీ, ఖర్చును సమర్థించలేకపోతోంది. ఫలితంగా వినియోగదారులు “ఇక సీఎన్జీ ఎందుకు?” అని ప్రశ్నించడం మొదలుపెట్టారు.

మెయింటెనెన్స్‌ & ఇబ్బందులుసీఎన్జీ వాహనాలకు మెయింటెనెన్స్‌ ఖర్చులు పెట్రోల్‌ వాహనాల కంటే ఎక్కువ. ఇంజిన్‌పై ఎక్కువ ఒత్తిడి పడటంతో, సమయానికి సర్వీసింగ్‌ చేయకపోతే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అదనంగా, సీఎన్జీ రీఫిల్లింగ్‌ స్టేషన్లు పెట్రోల్‌ బంక్‌లా విస్తృతంగా లేవు. దీంతో లాంగ్‌ డ్రైవ్స్‌లో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ పరిస్థితుల దృష్ట్యా, చాలామంది కస్టమర్లు పెట్రోల్‌ వాహనాలనే ఎంచుకుంటున్నారు. “ధరలో పెద్దగా తేడా లేదు, మైలేజీ కూడా దాదాపు సమానమే. అలాంటప్పుడు సీఎన్జీతో రిస్క్‌ ఎందుకు?” అనే లాజిక్‌ ఇప్పుడు ఎక్కువ మంది నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది.

భవిష్యత్తు ఇలా ఉంటుందా..?వాహన రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, భవిష్యత్తులో సీఎన్జీ వాహనాల వృద్ధి మందగించనుంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఎలక్ట్రిక్‌ & హైబ్రిడ్‌ వాహనాల దిశగా వినియోగదారులు క్రమంగా మళ్లే అవకాశం ఉంది. 

ఒకప్పుడు “బెస్ట్‌ బడ్జెట్‌ ఛాయిస్‌”గా పేరొందిన సీఎన్జీ వాహనాలు, ఇప్పుడు పెట్రోల్‌తో పోలిస్తే ఎక్కువ లాభం ఇవ్వడం లేదు. ఇంధన ధరలు దాదాపు సమానంగా ఉండటం, మైలేజీ తేడా తగ్గిపోవడం, మెయింటెనెన్స్‌ ఖర్చులు పెరగడం వంటి కారణాలు ప్రజలను మళ్లీ పెట్రోల్‌ వాహనాల వైపు నెడుతున్నాయి. భవిష్యత్తులో సీఎన్జీ స్థానాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు.