New Challan Rules 2025: కారు, బైకు లేదా మరేదైనా మోటారు వాహనాన్ని నడిపినప్పుడు ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేస్తే, ట్రాఫిక్‌ పోలీసులు చలాన్‌ రాస్తారు. కొంతమంది ఈ చలాన్లను తేలిగ్గా తీసుకుంటారు, ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నప్పుడు చూద్దాంలే అని ఆ మ్యాటర్‌ని అక్కడితో వదిలేస్తారు. మరికొందరు, 'తర్వాత చెల్లిద్దాం' అని వాయిదాలు వేస్తుంటారు. ఇకపై, ఈ పప్పులు ఉడకవు, చలాన్‌ చెల్లింపులను వాయిదా వేయడం ఇక కుదరదు. చలాన్లను 45 రోజుల్లోగా క్లియర్‌ చేయకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే వరకు వెళ్లే కొత్త కఠిన నిబంధనల 'ముసాయిదా'ను కేంద్ర రవాణా శాఖ ప్రకటించింది.

Continues below advertisement

45 రోజుల్లో చెల్లించకపోతే కఠిన చర్యలుఇప్పటి వరకు, చలాన్‌ చెల్లించడానికి 90 రోజుల సమయం ఉండేది. కానీ కొత్త నిబంధనల్లో ఆ గడువు సగానికి సగం, అంటే 45 రోజులకు తగ్గింది. ఈ గడువు దాటితే, వాహనంపై ఎలాంటి లావాదేవీలను సంబంధిత RTO అంగీకరించరు. అంటే.. మీరు ఆ వాహనాన్ని అమ్మలేరు, లైసెన్సు రెన్యువల్‌ చేసుకోలేరు, పేరు లేదా చిరునామా మార్చుకోవడం కూడా కుదరదు.

గడువు లోగా చలాన్‌ చెల్లించకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం ట్రాఫిక్‌ పోలీసులకు ఉంటుంది. మీ బండిపై చలాన్‌ జారీ అయితే, సంబంధిత అధికారి మూడు రోజుల్లో ఎలక్ట్రానిక్‌ నోటీసు, పదిహేను రోజుల్లో ఫిజికల్‌ నోటీసు పంపాలి.

Continues below advertisement

"5" కు మించి చలాన్లు ఉంటే లైసెన్సే పోతుంది!ఒక వాహనంపై 5 లేదా అంత కంటే ఎక్కువ చలాన్లు ఉంటే, సంబంధిత డ్రైవింగ్‌ లైసెన్సు సస్పెండ్‌ చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు. సెంట్రల్‌ మోటార్‌ వెహికిల్స్‌ రూల్స్‌-1989లో చేసిన కీలక సవరణల్లో భాగం ఇది ఒక భాగం.

నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి'వాహనం నేను నడపలేదు, నా డ్రైవర్‌, స్నేహితుడు లేదా మరొకరు నడిపారు. చలాన్‌ నేనెందుకు చెల్లించాలి' అని చెప్పడం కూడా ఇకపై కుదరదు. వాహన యజమాని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటేనే, అంటే ట్రాఫిక్‌ రూల్స్‌ను బ్రేక్‌ చేసిన సమయంలో ఆ వాహనాన్ని తాను నడపలేదు అని నిరూపించుకుంటేనే, వాహనం నడిపిన వ్యక్తిని బాధ్యుడిగా పరిగణిస్తారు. లేదంటే, బండి ఇచ్చినందుకు ఆ చలాన్‌ను వాహన యజమానే చెల్లించాలి.

డిజిటల్‌ మానిటరింగ్‌తో కఠినంగా అమలుఈసారి ముసాయిదా రూల్స్‌లో చలాన్‌ జారీ, చెల్లింపు, అప్పీల్‌ వంటి ప్రక్రియలను పూర్తిగా డిజిటల్‌ మానిటరింగ్‌, ఆటోమేషన్‌ ఆధారంగా చేయాలని కేంద్రం సూచించింది. దీని వల్ల ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించిన రికార్డులు వెంటనే అప్‌డేట్‌ అవుతాయి, ఎలాంటి సడలింపులు ఉండవు.

రూల్స్‌ జంప్‌ చేసేవాళ్లకు కఠిన హెచ్చరికముసాయిదాలో ఉన్న నిబంధనలు చట్ట రూపంలో అమల్లోకి వస్తే, ట్రాఫిక్‌ నియమాలు పాటించని వాహనదారులకు ఇక మన్నింపు దొరకడం కష్టమే. చలాన్‌ పడిన వెంటనే 45 రోజుల్లో చెల్లించాలి లేదా అప్పీల్‌ చేసుకోవాలి. ఆలస్యం చేస్తే వాహనం స్వాధీనం, లైసెన్సు రద్దు తప్పదని అధికారులు చెబుతున్నారు. అంటే, “పోలీసులు ఆపినప్పుడు చెల్లిస్తాం” అనడం పాత కథ!. ఇప్పుడు చలాన్‌ పడితే వెంటనే రెస్పాన్స్‌ ఇవ్వడం తప్ప మరో మార్గం లేదు. ట్రాఫిక్‌ నియమాలను కట్టుదిట్టంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ కొత్త సవరణలను ప్రతిపాదించారు.

ఈ కొత్త ముసాయిదా నిబంధనలపై అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ మీకు ఉంది. ఒకవేళ, ప్రతిపాదిత నిబంధనలపై మీకు అభ్యంతరాలు గానీ, సూచనలు గానీ ఉంటే.. కేంద్ర రహదారి రవాణా మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శికి వాటిని పోస్ట్‌ చేయవచ్చు. లేదా, comments-morth@gov.in ఐడీకి ఈ-మెయిల్‌ చేయొచ్చు.