India Public EV Charging Stations: భారత్‌లో రోజురోజుకూ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఇంకా కొనే ఆలోచన చాలా మందికి ఉన్నప్పటికీ ఛార్జింగ్ స్టేషన్లు అన్ని ప్రాంతాల్లో లేవనే ఆలోచన వారిని వెనక్కి లాగుతోంది.. అందుకే చాలా మంది ఈవీలు కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే దీనిపై పార్లమెంట్‌లో కేంద్రం కీలక విషయాలు పంచుకుంది. ఇప్పుడు పెట్రోల్ పంపులు ఉన్నట్టుగానే దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొంది.
కేంద్రం చెప్పిన వివరాలు ప్రకారం ఇప్పటికే 52,700 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. దీన్ని మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది.
లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ దేశంలోని ఈవీ మౌలిక సదుపాయాలను వివరించారు. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 52, 718 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఫోర్‌వీల్ డ్రైవ్ కార్ల యజమానుల కోసం అతి పెద్ద ఊరట ఏంటంటే, ఈ స్టేషన్‌లలో 16, 561 స్టేషన్‌లలో కార్ల కోసం హైస్పీడ్ లేదా పాస్ట్ ఈవీ ఛార్జర్లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. దీని వల్ల హైవేల, నగరాల్లో డ్రైవర్లు సుదూర ప్రయాణం చేసేటప్పుడు విలువైన సమయం ఆదా అవ్వడమే కాక, ఇబ్బందులు కూడా తగ్గుతాయి.
దేశంలోని ప్రతి మూలకూ ఛార్జింగ్ స్టేషన్లను విస్తరించడానికి శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్రం చెప్పింది. ఫేమ-2 పథకం కింద భారీగా పరిశ్రమల మంత్రిత్వశాఖ 912.50 కోట్లను ఆమోదించినట్టు పార్లమెంట్‌కు తెలియజేసింది. అదనంగా కొత్త పీఎం ఇ- డ్రైవ్ పథకం కింద కేవలం ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణ కోసమే రెండు వేల కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారు. ప్రధాన నగరాల్లో , రద్దీగా ఉండే రాష్ట్ర రహదారులపై నిరాటంకమైన ఛార్జింగ్ పాయింట్లను అందించడమే ఈ భారీ పెట్టుబడి లక్ష్యం.
ఛార్జింగ్ స్టేషన్లను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు!
ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, రూల్స్‌ను కూడా సరళీకరించిందని గమనించాలి. విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును డీలైసెన్స్ కార్యకలాపంగా ప్రకటించారు.
అంటే ఇప్పుడు ఏ ప్రైవేటు పారిశ్రామికవేత్త లేదా వ్యాపార వేత్త అయినా ఎలాంటి సంక్లిష్టమైన పత్రాలతో పని లేకుండా తమ సొంత ఛార్జింగ్ స్టేషనను ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా కార్ల అమ్మకాలు, తయారీని ప్రోత్సహించడానికి ఆటో పీఎల్‌ఐ పథకం కింద 13శాతం నుంచి 18శాతం వరకు ఆర్థిక ప్రోత్సహకాలు అందిస్తున్నారు.
