Understanding car suspension: కారు నడిపేటప్పుడు ప్రయాణం ఎందుకు సౌకర్యవంతంగా ఉంటుంది? గుంతలు, స్పీడ్ బ్రేకర్లు, ఎత్తుపల్లాలపై కూడా కారు ఎలా స్థిరంగా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కారు సస్పెన్షన్ వ్యవస్థలో దాగి ఉంటుంది. వాహనంలో అత్యంత కీలకమైన భాగాల్లో సస్పెన్షన్ ఒకటి. ఇది ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైడ్‌ను అందించడమే కాకుండా, వాహనం స్థిరత్వం, హ్యాండ్లింగ్ & భద్రతను కూడా మెరుగుపరుస్తుంది.

Continues below advertisement

ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న కార్లలో వివిధ రకాల సస్పెన్షన్ టెక్నాలజీలు ఉపయోగిస్తున్నారు. వాటి పని విధానం, ప్రయోజనాలు & లోపాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నాన్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ ‍‌(Non-independent suspension)

Continues below advertisement

దీనిని సాధారణంగా సాలిడ్ యాక్సిల్ లేదా రిజిడ్ యాక్సిల్ సస్పెన్షన్ అని పిలుస్తారు. ఇది ఆటోమొబైల్ రంగంలో అత్యంత పాత & సులభమైన సస్పెన్షన్ వ్యవస్థల్లో ఒకటి. ఈ వ్యవస్థలో రెండు చక్రాలను ఒక బలమైన మెటల్ యాక్సిల్ ద్వారా అనుసంధానిస్తారు. ఈ యాక్సిల్ వాహనం బరువును మోయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనికి కాయిల్ స్ప్రింగ్స్ లేదా లీఫ్ స్ప్రింగ్స్‌ను జత చేస్తారు. ట్రక్కులు, పికప్ వాహనాలు వంటి అధిక లోడ్ మోయాల్సిన వాహనాల్లో ఈ వ్యవస్థ ఎక్కువగా కనిపిస్తుంది. భారత మార్కెట్లో మారుతి సుజుకి జిమ్నీ & జీప్ రాంగ్లర్ వంటి ఆఫ్ రోడ్ వాహనాల్లో కూడా ఈ సస్పెన్షన్ ఉపయోగిస్తున్నారు.

ఈ సస్పెన్షన్ ప్రధాన ప్రయోజనం బలమైన నిర్మాణం & కఠినమైన రోడ్లపై మెరుగైన పనితీరు. అయితే ఒక వైపు చక్రం గుంతలో పడితే దాని ప్రభావం మరో చక్రంపై కూడా పడుతుంది. అందువల్ల రైడ్ క్వాలిటీ & హ్యాండ్లింగ్ పరంగా ఇది ఆధునిక వ్యవస్థలతో పోలిస్తే వెనుకబడుతుంది.

Also Read: Bike Customization: సులభంగా కస్టమైజ్ చేయించగల టాప్ 5 బైకులివే..స్పెషల్ లుక్ ఎలా ఇవ్వాలంటే..

సెమీ ఇండిపెండెంట్ సస్పెన్షన్ ‍‌(Semi-independent suspension)

ఈ వ్యవస్థను ట్విస్ట్ బీమ్ లేదా టార్షన్ బీమ్ సస్పెన్షన్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న చాలా బడ్జెట్ కార్ల వెనుక భాగంలో ఈ సస్పెన్షన్ వ్యవస్థ ఉంటుంది. ఇందులో మెటల్ బీమ్ & కాయిల్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఒక చక్రం కదిలినప్పుడు ఆ ప్రభావం పూర్తిగా మరో చక్రానికి చేరకుండా బీమ్ మలుపు తిరుగుతూ శక్తిని పంపిణీ చేస్తుంది.

ఈ సస్పెన్షన్ తక్కువ ఖర్చుతో తయారవుతుంది. అలాగే ప్రయాణ సౌకర్యం & హ్యాండ్లింగ్ మధ్య మంచి సమతుల్యతను అందిస్తుంది. మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి అనేక హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు & కాంపాక్ట్ SUVల్లో ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు.

ఫుల్లీ ఇండిపెండెంట్ సస్పెన్షన్ ‍‌(Fully independent suspension)

ఆధునిక కార్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన సస్పెన్షన్ వ్యవస్థ ఇదే. ఇందులో ప్రతి చక్రం స్వతంత్రంగా పనిచేస్తుంది. ఒక చక్రంపై పడిన ప్రభావం మరో చక్రంపై పెద్దగా ఉండదు. ఫుల్లీ ఇండిపెండెంట్ సస్పెన్షన్‌లో కొన్ని రకాలు ఉన్నాయి:

మాక్‌ఫర్సన్ స్ట్రట్ (MacPherson Strut)

ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఉపయోగిస్తున్న ఇండిపెండెంట్ సస్పెన్షన్ రకం మాక్‌ఫర్సన్ స్ట్రట్. అమెరికన్ ఇంజినీర్ ఎర్ల్ ఎస్. మాక్‌ఫర్సన్ దీనిని అభివృద్ధి చేశారు. ఇందులో కాయిల్ స్ప్రింగ్ & షాక్ అబ్జార్బర్ ఒకే యూనిట్‌గా ఉంటాయి. ఇది తక్కువ ఖర్చుతో తయారవడమే కాకుండా స్థలాన్ని కూడా ఆదా చేస్తుంది.

భారతదేశంలో మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి బ్రాండ్లకు చెందిన చాలా కార్ల ముందు భాగంలో ఈ సస్పెన్షన్ ఉంటుంది.

డబుల్ విష్‌బోన్ సస్పెన్షన్ (Double wishbone)

ఇది మరింత అధునాతనమైన & ఖరీదైన వ్యవస్థ. ఇందులో పైభాగం & కింది భాగంలో రెండు కంట్రోల్ ఆర్మ్స్ ఉంటాయి. మహీంద్రా థార్ రాక్స్, టయోటా ఫార్చ్యూనర్ వంటి SUVల్లో ఈ సస్పెన్షన్ ఉపయోగిస్తున్నారు. అలాగే BMW 5 సిరీస్, రేంజ్ రోవర్ వంటి ప్రీమియం వాహనాల్లో కూడా ఇది కనిపిస్తుంది. ఈ వ్యవస్థ వల్ల స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్, గ్రిప్ & హ్యాండ్లింగ్ మెరుగ్గా ఉంటాయి. స్పోర్ట్స్ కార్లకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

Also Read: EV vs Petrol Car.. వర్షాకాలంలో ఏది బెటర్? రెండింటి సేఫ్టీ ఫీచర్లు ఎలా ఉంటాయి?

మల్టీ లింక్ సస్పెన్షన్ (Multi-Link suspension)

అత్యంత ఆధునిక & ఖరీదైన సస్పెన్షన్ వ్యవస్థల్లో మల్టీ లింక్ ఒకటి. ఇందులో మూడు లేదా అంతకంటే ఎక్కువ కంట్రోల్ ఆర్మ్స్ ఉపయోగిస్తారు. ప్రతి కదలికను వేర్వేరు భాగాలు నియంత్రించడం వల్ల రైడ్ క్వాలిటీ అత్యంత మెరుగ్గా ఉంటుంది. అలాగే కార్నరింగ్ సమయంలో కూడా అద్భుతమైన స్థిరత్వాన్ని అందిస్తుంది. హోండా అకార్డ్, ఆడి A6, వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ R వంటి ప్రీమియం వాహనాల్లో ఈ సస్పెన్షన్ కనిపిస్తుంది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా సాధారణ కార్లు ముందు భాగంలో మాక్‌ఫర్సన్ స్ట్రట్ & వెనుక భాగంలో ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్‌ను ఉపయోగిస్తున్నాయి. ఇది తక్కువ ఖర్చుతో మంచి సౌకర్యాన్ని అందిస్తుంది. మరోవైపు ప్రీమియం కార్లు, లగ్జరీ SUVలు & హై పెర్ఫార్మెన్స్ మోడళ్లలో డబుల్ విష్‌బోన్ లేదా మల్టీ లింక్ వంటి అధునాతన వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు.

ఒక కారు రోడ్డుపై ఎంత సౌకర్యంగా ప్రయాణిస్తుందో, ఎంత స్థిరంగా మలుపులు తిరుగుతుందో నిర్ణయించడంలో సస్పెన్షన్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. కారు కొనుగోలు చేసే ముందు ఇంజిన్, ఫీచర్లతో పాటు సస్పెన్షన్ రకం గురించి కూడా తెలుసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.