Car Sales in February 2023: ఈ కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి దేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. జనవరిలో పెద్ద సంఖ్యలో కార్లు అమ్ముడుపోయాయి. అలాగే ఫిబ్రవరిలో కూడా కంపెనీల పనితీరు బాగానే ఉంది. ఈ నెలలో చాలా కార్ల కంపెనీలు అమ్మకాలలో సానుకూల వృద్ధిని సాధించారు. 2023 ఫిబ్రవరిలో మారుతి సుజుకి, హ్యుందాయ్, కియా, ఎంజీ, టయోటా విక్రయాల గురించి తెలుసుకుందాం.
ఇంకా చదవండి
మారుతీ సుజుకి
మారుతీ సుజుకి 2023 ఫిబ్రవరిలో మొత్తం 1,72,321 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇందులో ఐదు శాతం పెరుగుదల నమోదైంది. దేశీయ మార్కెట్లో కంపెనీ గతేడాది ఇదే నెలలో 1,50,823 యూనిట్లను విక్రయించింది. ఫిబ్రవరిలో కంపెనీ ఆల్టో, ఎస్-ప్రెస్సో 21,875 యూనిట్లలు అమ్ముడుపోయాయి. కాంపాక్ట్ విభాగంలో 79,898 యూనిట్లు, ఎస్‌యూవీ విభాగంలో 33,550 యూనిట్లను మారుతి సుజుకి విక్రయించింది. అయితే కంపెనీ ఎగుమతులు మాత్రం 2022 ఫిబ్రవరిలో 24,021 యూనిట్ల నుంచి 17,207 యూనిట్లకు తగ్గాయి.
హ్యుందాయ్ మోటార్స్
దేశీయంగా కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరిలో 47,001 యూనిట్లను విక్రయించగా, గత ఏడాది ఫిబ్రవరిలో 44,050 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో కంపెనీ 10,850 యూనిట్లను ఎగుమతి చేసింది.
కియా మోటార్స్
2023 ఫిబ్రవరిలో కంపెనీ విక్రయాలు 35.8 శాతం పెరిగి 24,600 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 18,121 యూనిట్లుగా ఉంది. కియా కారెన్స్ భారతదేశంలో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ MPV ఇప్పటివరకు 76,904 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇదే టైమ్ పీరియడ్‌లో సోనెట్, సెల్టోస్ వరుసగా 9,836 యూనిట్లు, 8,012 యూనిట్లను అమ్ముడుపోయాయి.
ఎంజీ మోటార్స్
ఎంజీ మోటార్ ఇండియా 2023 ఫిబ్రవరిలో 4,193 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 4,528 యూనిట్లు అమ్ముడుపోయాయి. అంటే కంపెనీ విక్రయాలు ఏడు శాతం క్షీణించాయి. కొత్త హెక్టర్ బుకింగ్‌లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయని, అయితే ఎంపిక చేసిన వేరియంట్‌ల సరఫరా కారణంగా పరిస్థితి ప్రభావితమైందని ఎంజీ తెలిపింది.
టయోటా
టయోటా కిర్లోస్కర్ మోటార్ గత నెలలో 15,338 యూనిట్ల అమ్మకాలతో 75 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సమయంలో, కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లు 8,745 యూనిట్లు విక్రయించబడ్డాయి.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో కూడా అద్భుతమైన వృద్ధి కనిపిస్తోంది. దీని కారణంగా ఒకదాని తర్వాత మరొకటిగా కార్ల తయారీదారీ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ కూడా తన ఎలక్ట్రిక్ కారు సిట్రోయెన్ ఈసీ3ని భారత దేశ మార్కెట్లో విడుదల చేసింది. ఇది రెండు ట్రిమ్‌లలో లాంచ్ అయింది. దేశీయ మార్చెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు టాటా టియాగోతో పోటీపడనుంది.
కంపెనీ సిట్రోయెన్ ఈసీ3 కారును రూ.11.50 నుంచి రూ.12.43 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లో పరిచయం చేసింది. దాని పోటీదారు టాటా టియాగో ఎలక్ట్రిక్ కంటే సిట్రోయెన్ ఈసీ3 కారు ధర రూ. 1.31 లక్షలు ఎక్కువ కావడం విశేషం.
ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ స్పీడ్ గంటకు 107 కిలో మీటర్లుగా ఉంది. ఇది కాకుండా ఛార్జింగ్ చేయడానికి రెండు ఛార్జింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి 15A ఛార్జింగ్ సాకెట్ ద్వారా ఈ కారును పూర్తిగా ఛార్జ్ చేయడానికి 10 గంటల 30 నిమిషాలు పడుతుంది. రెండోది డీసీ ఫాస్ట్ ఛార్జర్. దీని ద్వారా ఈ కారు కేవలం 57 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవ్వగలదు.