Car Safety Tips In Rainy Season: భారతదేశంలో రుతుపవనాల సీజన్‌ ప్రారంభమైంది, ఉత్తర భారతంలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల ధాటికి రోడ్లు కూడా చెరువుల్లా మారాయి. ఈ పరిస్థితుల్లో కారు నడపడానికి సవాలుతో కూడిన విషయం. తడి రోడ్లు, తక్కువ విజన్‌ & ట్రాఫిక్ జామ్‌ల మధ్య కారు అష్టదిగ్బంధం అవుతుంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి మీ కారు సిద్ధంగా లేకుంటే, మీరు తిప్పలు పడాల్సి వస్తుంది. అందువల్ల, వర్షాకాలం ముందు మీ కారును పూర్తిగా సిద్ధం చేసుకోవడం ముఖ్యం. 

వర్షాకాలంలో మీ కారులో ఈ 5 కీలకాంశాలను చెక్‌ చేయండి

1. టైర్ల పరిస్థితి వర్షాకాలంలో రోడ్లు తడిచి జారుతుంటాయి కాబట్టి టైర్ల పట్టు చాలా ముఖ్యం. ఈ కాలంలో, టైర్ ట్రెడ్ లోతు కనీసం 2.5 మి.మీ ఉండాలి. ఏ టైర్ పరిగిపోకూడదు లేదా అరిగిపోకూడదు. టైర్‌ను ఎక్కువగా గాలితో నింపకూడదు & టైర్ 4-5 సంవత్సరాల పాతది అయినా లేదా 40,000-50,000 కి.మీ. కంటే ఎక్కువ దూరం నడిచినా దానిని మార్చడం మంచిది. అలాగే, టైర్ స్పెషలిస్ట్ దగ్గరకు కారును తీసుకువెళ్లి వీల్‌ అలైన్‌మెంట్ & బ్యాలెన్సింగ్ చేయాలి.

2. విండ్‌షీల్డ్ వైపర్లువర్షాల్లో, విండ్‌షీల్డ్‌ మీద నుంచి జారిపోతున్న వాన నీటి మధ్య రోడ్డు స్పష్టంగా లేదా ఎక్కువ దూరం కనిపించదు. ఇదే అతి పెద్ద సవాలు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి విండ్‌షీల్డ్ వైపర్‌లు మీకు సాయపడతాయి. వైపర్‌కు ఉన్న రబ్బరు స్ట్రిప్ అరిగిపోకుండా లేదా చిరిగిపోకుండా చూసుకోండి. వాషర్ ఫ్లూయిడ్ నాజిల్ మూసుకుపోకుండా & ఫ్లూయిడ్‌లో ధూళి లేదా మట్టి లేకుండా చూసుకోండి. విండ్‌షీల్డ్‌ మీద రెయిన్‌-రెపెలెంట్‌ కోటింగ్‌ వేయించడం కూడా మంచిది.

3. లైటింగ్ సిస్టమ్వర్షం & పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెడ్‌లైట్లు & ఫాగ్ ల్యాంప్‌లు మాత్రమే మీకు మార్గం చూపించే నేస్తాలు. అందువల్ల, హెడ్‌లైట్లు & ఫాగ్ లైట్ల ప్రకాశం సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయండి. లెన్స్‌ మీద పొగమంచు, దుమ్ము లేదా బ్లర్రింగ్‌ ఉందా అనేవి చూడండి. దీంతో పాటు.. టెయిల్‌ లైట్లు & ఇండికేటర్లు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవడం కూడా ముఖ్యం. భారీ వర్షం సమయంలో ఈ లైటింగ్ వ్యవస్థలు మీకు అతి పెద్ద రక్షణగా మారతాయి.

4. బ్రేకింగ్ సిస్టమ్వర్షాల సమయంలో తడిసిన రోడ్లు కారు బ్రేకింగ్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. తడి రోడ్లపై బ్రేక్‌లు సమయానికి పడాలి & సరిగ్గా పనిచేయాలి. దీని కోసం, బ్రేక్ ప్యాడ్‌లు అరిగిపోయాయేమో చెక్‌ చేయండి. బ్రేక్‌ వేసినప్పుడు ఏదైనా శబ్దం లేదా షాక్ వేవ్‌ లాంటిది అనిపిస్తే బ్రేకింగ్ సిస్టమ్‌ను కచ్చితంగా తనిఖీ చేయాలి. బ్రేక్ ఫ్లూయిడ్ స్థాయి కూడా పూర్తిగా ఉండాలి. చవకైన బ్రేక్ ప్యాడ్స్‌కు బదులుగా నాణ్యమైన బ్రేకింగ్ సిస్టమ్‌ను ఉపయోగించండి, ఎందుకంటే ఈ పొదుపు కంటే మీ జీవిత విలువే ఎక్కువ.

5. తుప్పు నిరోధక పూతవర్షపు నీరు కారు లోహ భాగాలను దెబ్బతీస్తుంది & తుప్పు పట్టడానికి కారణమవుతుంది. అందువల్ల, బాడీ ప్యానెల్స్‌పై తుప్పు పట్టిన సంకేతాలేమైనా ఉన్నయేమో చూడండి. తలుపులు, బోనెట్ లేదా అండర్ బాడీ భాగాలలో తుప్పు ప్రారంభ సంకేతాలను గుర్తించండి. యాంటీ-రస్ట్ కోటింగ్‌ను సకాలంలో చేయించండి. తుప్పు ఎక్కువగా ఉంటే ఆ భాగాన్ని మార్చడం మంచిది. ఇది కారు జీవితాన్ని పెంచుతుంది & రీసేల్‌ విలువ కూడా బాగానే ఉంటుంది. పైగా, ప్రమాదాలను నివారించి మీ ప్రాణాలకు రక్షణ కవచంలా పని చేస్తుంది.