Car New Prices After GST Cut In India: భారతదేశంలో, కారు కొనడం మధ్య తరగతి కుటుంబాలకు ఇప్పటికీ పెద్ద కలగా, అందని ద్రాక్షలా ఉంది. దీనికి కారణం సుస్పష్టం - ప్రభుత్వాలు విధిస్తున్న "భారీ స్థాయి పన్నులు". ఈ పరిస్థితిలో మార్పు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ ఏడాది దీపావళికి ముందు, కేంద్ర ప్రభుత్వం, వివిధ కేటగిరీల కార్లపై GSTని తగ్గించవచ్చనే చర్చ జరుగుతోంది. ఇది జరిగితే, ఆల్టో, క్రెటా, స్కార్పియో & ఫార్చ్యూనర్ వంటి పాపులర్‌ వాహనాలు చౌకగా మారవచ్చు. ఇది మీ సేవింగ్స్‌ & EMI రెండింటిపైనా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. 

ప్రస్తుతం కార్లపై GST ఎలా విధిస్తున్నారు?

ఇప్పుడు, భారతదేశంలో కార్లపై GST రేట్లు ఒకేలా లేవు. కారు పొడవు, ఇంజిన్ సామర్థ్యం & ఇంధన రకం (పెట్రోల్, డీజిల్ లేదా ఎలక్ట్రిక్)పై ఆధారపడి పన్నులు మారుతున్నాయి. 

4 మీటర్ల కంటే తక్కువ పొడవు & ఇంజిన్ సామర్థ్యం 1.2 లీటర్ల వరకు ఉన్న చిన్న పెట్రోల్ కార్లకు 1% సెస్సుతో 28% GST వసూలు చేస్తున్నారు. అంటే మొత్తం పన్ను 29%కి చేరుకుంటుంది. 

4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు లేదా ఇంజిన్ సామర్థ్యం 1.5 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న పెద్ద పెట్రోల్ లేదా డీజిల్ కార్లకు 3% నుంచి 15% సెస్సుతో కలిపి 28% GST విధించబడుతుంది. ఈ కారణంగా, వాటిపై మొత్తం పన్ను 31% నుంచి 43% వరకు ఉంటుంది.

ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించేందుకు పన్ను రేటు చాలా తక్కువగా ఉంది & వాటిపై 5% GST మాత్రమే విధిస్తున్నారు. 

పాత కార్ల విషయంలో, వాటిని డీలర్ల ద్వారా విక్రయిస్తే, లాభాల మార్జిన్‌లో 18% చొప్పున GST విధిస్తున్నారు. దీని అర్థం.. ప్రస్తుతం కారు వాస్తవ ధరలో మూడింట ఒక వంతు పన్నుగా వెళుతుంది.

GST ని 28% నుంచి 18% కి తగ్గిస్తే ఏమవుతుంది?ప్రభుత్వం, కార్లపై GST రేట్లను 28% నుంచి 18%కి తగ్గించాలని భావిస్తోంది, ఇది జరిగితే వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనం లభిస్తుంది. అన్నింటిలో మొదటిది, కార్ల ధరలు తగ్గుతాయి. చిన్న కార్ల ధర దాదాపు రూ. 55,000 తగ్గవచ్చు. సెస్ తగ్గింపు ప్రభావం కూడా కనిపిస్తుంది కాబట్టి పెద్ద కార్ల ధరలు కూడా తగ్గుతాయి. దీంతో పాటు, పన్ను తగ్గింపు కారణంగా అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నారు. వాహనాలు చౌకగా మారితే ప్రజలు కొనుగోలు చేయగలుగుతారు. ఆటోమొబైల్ పరిశ్రమ దీని నుంచి ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతుంది. కార్ల అమ్మకాల పెరుగుదలతో, కంపెనీల ఆదాయాలు పెరుగుతాయి & ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.

ఉదాహరణకు, ఒక కారు బేస్‌ ప్రైస్‌ రూ.5 లక్షలు అయితే, ప్రస్తుత 29% పన్నులు కలిపిన తర్వాత అది దాదాపు 6.45 లక్షలకు చేరుకుంటుంది. ప్రభుత్వం GSTని 18%కు తగ్గిస్తే, సెస్ కలిపిన తర్వాత మొత్తం పన్ను 19% అవుతుంది. అటువంటి పరిస్థితిలో, అదే కారును ఇప్పుడు 5.90 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. అంటే కస్టమర్లు దాదాపు 10% ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు.

కస్టమర్లకు మరో అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే EMI కూడా తగ్గుతుంది. కారు ధర తగ్గినప్పుడు, రుణ మొత్తం తగ్గుతుంది & EMI తేలికగా మారుతుంది. ఈ విధంగా, కారు కొనాలనే కల ఇకపై కేవలం కలగా మిగిలిపోదు, వాస్తవ రూపం దాలుస్తుంది. 

కస్టమర్లలో గందరగోళం, డీలర్లలో ఆందోళనGST తగ్గింపు వార్త కస్టమర్లను కాస్త గందరగోళానికి గురిచేసింది కూడా. ఆగస్టు ప్రారంభంలో కార్లకు డిమాండ్ బాగానే ఉందని డీలర్లు చెబుతున్నారు. కానీ ఇప్పుడు, బుకింగ్ చేసుకునే ముందు, GST ఎప్పుడు తగ్గుతుందని కస్టమర్లు అడుగుతున్నారు. చాలామంది, GST తగ్గిన తర్వాత కారు కొందామంటూ, కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఎందుకంటే, ఇప్పుడు కారు కొని దీపావళి నాటికి పన్ను తగ్గితే, అనవసరంగా ఎక్కువ ధర పెట్టినట్లు అవుతుందని భావిస్తున్నారు.

డీలర్లు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాళ్లు ఇప్పటికే కొనుగోలు చేసిన స్టాక్‌పై ఇప్పటి రేటు ప్రకారం మొత్తం పన్ను చెల్లించారు. GSTని మరింత తగ్గిస్తే, కొత్త కార్లు తక్కువ రేటుకు అమ్ముడవుతాయి & పాత స్టాక్ ధర మాత్రం అలాగే ఉంటుంది. దీనివల్ల వర్కింగ్ క్యాపిటల్ & వడ్డీ భారం పెరుగుతుంది. అందుకే చాలా మంది డీలర్లు ఇప్పుడు బెస్ట్ సెల్లింగ్ మోడళ్లలో తక్కువ స్టాక్‌ను మాత్రమే ఉంచుతున్నారు.