Car Colour Safety Study 2025: కొత్తగా కారు కొనాలనుకుంటున్నారా? బడ్జెట్‌, బ్రాండ్‌, సేఫ్టీ ఫీచర్స్‌ అన్నీ చూసేసి చివరగా “ఏ రంగు తీసుకుందాం?” అనుకుంటున్నారా?, జాగ్రత్త!. కారు రంగు కూడా రోడ్లపై మీ భద్రతను ప్రభావితం చేస్తుందని చెప్పే తాజా అధ్యయనం వెలుగులోకి వచ్చింది, అది మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది.

Continues below advertisement

ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీ యాక్సిడెంట్‌ రీసెర్చ్‌ సెంటర్‌, 8.5 లక్షల ప్రమాదాలను విశ్లేషించి, కారు రంగులు & ప్రమాదాల మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టింది. ఫలితాలు చూసినవారికి షాక్‌.

నలుపు రంగు అంటే హై రిస్క్‌తెలుపు రంగుతో పోల్చితే నలుపు రంగు (Black color) కార్లు 47% ఎక్కువ ప్రమాదాల్లో చిక్కుకున్నాయని తేలింది. కారణం - నల్ల కారు రాత్రివేళల్లో లేదా సూర్యాస్తమయం సమయంలో స్పష్టంగా కనిపించదు. ఇతర డ్రైవర్లు వాహనాన్ని గుర్తించడంలో ఆలస్యం అవుతుంది. దీని ఫలితం - యాక్సిడెంట్‌.

Continues below advertisement

అదే విధంగా... బూడిద రంగు‍ (Grey color) కార్లు 11%, వెండి రంగు (Silver color) 10%, ముదురు బులుగు ‍రంగు ‌(Dark blue color) & ముదురు ఎదురు రంగు (Dark red color) కార్లు 7% వరకు ప్రమాదాల్లో పాల్గొన్నాయని రీసెర్చ్‌ చెబుతోంది. గ్రే కలర్‌, సిల్వర్‌ కలర్‌ కార్లు పొగమంచు లేదా మేఘావృత వాతావరణంలో బ్యాక్‌గ్రౌండ్‌లో కలిసిపోతాయి, అందుకే వీటితోనూ యమ డేంజర్‌.

ఏ రంగులు సేఫ్‌?ప్రమాదాలకు తక్కువగా గురయ్యే రంగుల్లో తెలుపు రంగు ముందుంది. అది దూరం నుంచే స్పష్టంగా కనిపించడం వల్ల డ్రైవర్లు సమయానికి స్పందించగలుగుతారు. ఆ తర్వాత పసుపు, నారింజ, బంగారు రంగులు (Yellow, Orange, Gold colors) కూడా చాలా సురక్షితమని తేలింది. అందుకే స్కూల్‌ బస్సులు, ట్యాక్సీలు పసుపు రంగులో ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోండి.

డ్రైవింగ్‌ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

డార్క్‌ కలర్స్‌ కారు నడిపే వాళ్లు రాత్రివేళల్లో తక్కువ వేగంతో నడపడం మంచిది. అలాగే డేలైట్‌ రన్నింగ్‌ లైట్స్‌ (DRL) ఏర్పాటు చేయించుకోవాలి. కారు వెనుక బంపర్‌ లేదా డోర్‌ ఎడ్జ్‌ల వద్ద రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లు లేదా రేడియం టేపులు అతికిస్తే రాత్రివేళల్లో విజిబులిటీ పెరుగుతుంది.

బ్రేక్‌ లైట్స్‌, టెయిల్‌ లైట్స్‌ సరిగా ఉన్నాయో లేదో తరచుగా చెక్‌ చేసుకోండి. ఒక్క లైటు పని చేయకపోయినా కూడా వెంటనే మార్చేయండి.

బ్లైండ్‌ స్పాట్‌ మానిటరింగ్‌ (BSM), ఆటోమేటిక్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ (AEB) ఉన్న వాహనాలు కొనడం ఉత్తమం. వీటివల్ల ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు.

చివరి చిట్కారాత్రివేళల్లో ముందు వెళ్తున్న వాహనానికి నేరుగా వెనకాల కాకుండా కొంచెం పక్కగా ఉండి నడపండి. అలా చేయడం వల్ల మీ విజిబులిటీ మెరుగవుతుంది, ప్రమాద అవకాశాలు తగ్గుతాయి.

కాబట్టి, కారు కొనేప్పుడు రంగును “లుక్స్‌” కోణంలో మాత్రమే కాకుండా, "సేఫ్టీ" కోణంలో కూడా ఆలోచించండి. మీరు వైట్‌, ఎల్లో, ఆరెంజ్‌ వంటి రంగులను ఎంచుకుంటే అది కేవలం స్టైల్‌ మాత్రమే కాకుండా మీ భద్రతకు ఒక స్మార్ట్‌ సెలెక్షన్‌ కూడా అవుతుంది.

గుర్తుంచుకోండి: “కారు రంగు కేవలం ఫ్యాషన్‌ కాదు... సేఫ్టీ సిగ్నల్‌ కూడా!”

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.