E20 Fuel Compatibility: కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ఒక ప్రకటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది. E20 ఇంధనాన్ని (20% ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌) 2030 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంటే, ఐదేళ్ల ముందే, అంటే 2025లోనే అందుబాటులోకి వచ్చిందన్నది కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటన సారాంశం. ఈ ప్రకటన తర్వాత, ఇప్పుడు, సోషల్ మీడియాలో E20 ఇంధనం గురించి చాలా చర్చ జరుగుతోంది. ఈ కొత్త ఇంధనాన్ని తమ పాత వాహనంలో పోయిస్తే ఇంజిన్ పాడవుతుందా అని బండి ఓనర్లు భయపడుతున్నారు. దీనికి సమాధానం చెప్పాలని గూగులమ్మను (Google) కూడా అడుగుతున్నారు.

నిజం ఏమిటంటే E20 అస్సలు కొత్తది కాదు. దిల్లీ-NCR వంటి పెద్ద నగరాల్లో, ప్రజలు చాలా కాలంగా తమకు తెలియకుండానే E20 ఇంధనాన్ని (20% ఇథనాల్ & 80% పెట్రోల్) ఉపయోగిస్తున్నారు.

E20 ఇంధనం - కొత్త వాహనాలు2023 ఏప్రిల్ తర్వాత తయారైన అన్ని కార్లు E20తో నడిచేలా రూపొందిస్తున్నారు. చాలా పెద్ద కంపెనీలు ఇప్పటికే E20-రెడీ వెహికల్స్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. కాబట్టి కొత్త కార్లకు E20 ఇంధనం విషయంలో ఎటువంటి సమస్య లేదు.

పాత వాహనాలపై ప్రభావం ఎంత?మీ కారు దాదాపు 10 సంవత్సరాల పాతది (2015 కు ముందు తయారైనది) & E10 ఇంధనంతో (10% ఇథనాల్ & 90% పెట్రోల్) నడిచేలా దానిని తయారు చేసి ఉంటే, ఇప్పుడు ఆ కారులో E20 పెట్రోల్‌ కొట్టించడం వల్ల ఎటువంటి పెద్ద హాని జరగదు. ఒకే తేడా ఏమిటంటే కారు మైలేజ్ కొంచెం తగ్గవచ్చు. E10 ఇంధనం ఉపయోగించే కార్లలో E20 ఇంధనం ఉపయోగించడం వల్ల కారు ఇంజిన్‌పై తక్షణ ప్రతికూల ప్రభావాన్ని చూపదు. కారు 2015 కి ముందు ఉత్పత్తి అయితే, E20 ఫ్యూయల్‌ వాడడం వల్ల దీర్ఘకాలంలో ఇంజిన్‌పై స్వల్ప ప్రభావం ఉండవచ్చు. పదేళ్ల పాత కారులో E20 ఇంధనం ఉపయోగించపోయినా ఇదే జరుగుతుంది, ఎందుకంటే వాహనాల్లో కాలక్రమేణా ఇంజిన్ & విడిభాగాలు అరిగిపోవడం ఒక సాధారణ ప్రక్రియ.

నిర్వహణ చాలా అవసరంమీరు E20 వాడుతుంటే, "సర్వీసింగ్‌" అనే అతి ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ కారును క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకోవడం ఉత్తమం. మీరు కారును మునుపటి కంటే కొంచెం ముందుగానే సర్వీసింగ్ చేయించుకోవలసి రావచ్చు. సర్వీసింగ్‌ గడువు అనేది బ్రాండ్‌ను బట్టి & మోడల్‌ను బట్టి మారవచ్చు. ఏదేమైనా, మీరు వాహనాన్ని సరిగ్గా మెయిన్‌టైన్‌ చేయగలిగితే నిర్వహిస్తే,  E20 వాడినప్పటికీ పెద్ద సమస్య & ఎలాంటి టెన్షన్‌ ఉండదు.

ఓ కారు ఓనర్‌ మాట"నేను 10 ఏళ్ల పాత కారు నడుపుతున్నాను, E20 ఇంధనాన్ని ఉపయోగిస్తున్నాను. కారు ఇప్పటికీ బాగానే నడుస్తోంది. మైలేజ్ కొంచెం తగ్గింది గానీ ఇంజిన్ లేదా పెర్ఫార్మెన్స్‌పై గణనీయమైన ప్రభావం కనిపించలేదు" - సోమనాథ్ ఛటర్జీ

E20 ఇంధనం గురించి సోషల్‌ మీడియాలో చాలా సమాచారం కనిపిస్తోంది. అయితే, పాత కార్లలో E20 ఇంధనం వినియోగించడం అనేది ప్రజలు నమ్ముతున్నంత ప్రమాదకరం కాదని ఎక్స్‌పర్ట్‌ మెకానిక్స్‌ చెబుతున్నారు. మీ కారు 10 సంవత్సరాల పాతది  (2015 కు ముందు తయారైనది) అయినప్పటికీ మీరు E20 ఇంధనం టెన్షన్‌ లేకుండా దానిని హాయిగా నడపవచ్చు. ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించుకుంటూ ఉండాలని మాత్రం గుర్తుంచుకోండి.