Getting Vehicle Owner Details Using Vehicle Number: కార్, బైక్ లేదా మరేదైనా వాహనానికి ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ చూసినప్పుడు, ఈ బండి ఓనర్ ఎవరో అనే ఆసక్తి కలుగుతుంది. లేదా, యాక్సిడెంట్స్ వంటి అనుకోని సంఘటనల సందర్భంలోనూ వాహనం యజమాని వివరాలు అవసరమవుతాయి. వాహనం ఓనర్ వివరాలు కనిపెట్టడం కష్టమైన పనేమీ కాదు, మీకు బండి నంబర్ తెలిస్తే చాలు. మీరు మీ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి, నిలుచున్న చోటనే ఆ వివరాలన్నీ రాబట్టవచ్చు. లేదా, ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని ఆన్‌లైన్ మోడ్ ద్వారా డిటైల్స్ సంపాదించవచ్చు. దీనికోసం mParivahan వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ మీకు ఉపయోగపడుతుంది.
ఎంపరివాహన్ యాప్ అంటే ఏమిటి?mParivahan అనేది కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ (Ministry of Road Transport & Highways) ఆధ్వర్యంలోని వెబ్‌సైట్ & మొబైల్ యాప్. మీరు వాహనం వివరాలు తెలుసుకోవాలనుకుంటే, mParivahan యాప్ లేదా Vahan పోర్టల్ ద్వారా ఈ పనిని సులభంగా పూర్తి చేయవచ్చు. యాప్ ద్వారా తెలుసుకోవాలంటే, ముందుగా, mParivahan యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. Android వినియోగదారుల కోసం Google Play Storeలో & iPhone వినియోగదారుల కోసం Apple App Storeలో ఈ యాప్ అందుబాటులో ఉంది. లేదా, మీరు వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు. యాప్ లేదా పోర్టల్‌ను ఓపెన్ చేసిన తర్వాత, ముందుగా, మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి లాగిన్ అవ్వాలి. OTP ధృవీకరణ తర్వాత, 6-అంకెల MPINని సెట్ చేయాలి. తద్వారా మీరు భవిష్యత్తులో సులభంగా లాగిన్ కావచ్చు.
యాప్ లేదా వెబ్‌సైట్ నుంచి వాహన సమాచారాన్ని ఎలా పొందాలి?- mParivahan యాప్ లేదా పోర్టల్‌లోకి లాగిన్ అయిన తర్వాత, మీరు ఏ వాహనం సమాచారం పొందాలనుకుంటున్నారో ఆ వాహనం నంబర్‌ను నమోదు చేయాలి - ఉదాహరణకు "AA01AB1234". - ఇప్పుడు, "Search Vehicle" లేదా "Check RC Status" బటన్‌పై క్లిక్ చేయండి. - ఆ వాహనానికి సంబంధించిన సమాచారం మీ ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. - వాహనం యజమాని పేరు, వాహనం ఎప్పుడు రిజిస్ట్రేషన్ జరిగింది, ఫిట్‌నెస్ & బీమా ఎప్పటి వరకు చెల్లుతుంది, వాహనం ఏ తరగతికి & ఏ కంపెనీకి చెందింది అనే వివరాలు కనిపిస్తాయి. - వ్యక్తిగత వివరాల గోప్యత కారణంగా వాహన యజమాని ఇంటి పూర్తి చిరునామా & మొబైల్ నంబర్ మాత్రం కనిపించవు.
ఇది చట్టబద్ధమైనదేనా?mParivahan అనేది భారత ప్రభుత్వ అధికారిక సర్వీస్ పోర్టల్ కాబట్టి దీని ద్వారా వివరాలు తెలుసుకోవడం పూర్తిగా చట్టబద్ధమైన పనే. దీనిని పోలీసులు, ట్రాఫిక్ విభాగంతో పాటు సాధారణ పౌరులు కూడా ఉపయోగించవచ్చు. వాహన గుర్తింపు, దొంగతనం కేసులు & రోడ్డుపై నిలిపిన ఏదైనా అనుమానాస్పద వాహనాన్ని చెక్ చేయడానికి mParivahan పోర్టల్ లేదా యాప్ ఉపయోగించవచ్చు.
mParivahan కాకుండా, వాహనం యజమాని వివరాలను అనేక థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా కూడా పొందవచ్చు. అయితే, వాటివల్ల మీ వివరాల భద్రత ప్రశ్నార్థకం కావచ్చు. కాబట్టి, వాహనం యజమాని వివరాలు తెలుసుకోవాలంటే mParivahan యాప్ లేదా Vahan పోర్టల్‌ను మాత్రమే ఉపయోగించండి.