Second Hand Renault Kiger: కొత్త హ్యాచ్‌బ్యాక్ ధరకే SUV తరహాలో ఉండే కారు కావాలనుకునే వారికి యూజ్డ్ Renault Kiger మంచి ఆప్షన్‌గా మారింది. 2021 ఫిబ్రవరిలో భారత మార్కెట్‌లోకి వచ్చిన కైగర్... తక్కువ ధరలో స్పేస్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, టర్బో ఇంజిన్ ఆప్షన్‌తో చాలామందిని ఆకట్టుకుంది. నిస్సాన్ మాగ్నైట్‌కు బ్రదర్ మోడల్ అయిన ఈ కారు, ఇప్పుడు యూజ్డ్ మార్కెట్‌లోనూ డిమాండ్ పెంచుకుంది.
నాలుగు మీటర్లలోపే (సబ్-4 మీటర్) పొడవు ఉన్నప్పటికీ, కైగర్ ఇంటీరియర్‌లో ఐదుగురు పెద్దవాళ్లు సౌకర్యంగా కూర్చునేంత స్థలం ఉంది. అంతేకాదు, 405 లీటర్ల బూట్ స్పేస్, 205 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల గుంతలు రోడ్లపై కూడా భయం ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ రోడ్లను తరచూ ఉపయోగించే వారికి ఇది పెద్ద ప్లస్.
ఇంజిన్ ఆప్షన్లు
రెనాల్ట్ కైగర్‌లో రెండు 1.0 లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.ఒకటి నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ – ఇది 72hp శక్తి, 96Nm టార్క్ ఇస్తుంది.మరోది టర్బో పెట్రోల్ ఇంజిన్ – ఇది 100hp శక్తి, 160Nm టార్క్‌తో మరింత శక్తిమంతంగా ఉంటుంది.రెండింటికీ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా వస్తుంది. టర్బో ఇంజిన్‌కు CVT ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంది. నగర డ్రైవింగ్‌లో ఈ CVT చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.
మైలేజ్
ARAI ప్రకారం, టర్బో మాన్యువల్ – 20.38 kmpl మైలేజ్, నాన్ టర్బో మాన్యువల్ – 19.83 kmpl మైలేజ్ ఇస్తుంది.
డ్రైవింగ్ ఫన్ ముఖ్యం అనుకుంటే టర్బో వేరియంట్ తీసుకోవడం మంచిది. మైలేజ్ మాత్రమే ప్రాధాన్యం అయితే నాన్ టర్బో సరిపోతుంది.
వేరియంట్లు, ఫీచర్లు
లాంచ్ సమయంలో కైగర్ RxE, RxL, RxT, RxZ వేరియంట్లలో వచ్చింది. తర్వాత RxL తొలగించి, RxT (O) వంటి కొత్త ఆప్షన్లు తీసుకొచ్చారు.
టాప్ వేరియంట్ RxZలో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో క్లైమేట్ కంట్రోల్, నాలుగు ఎయిర్‌బ్యాగ్స్, రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు లభిస్తాయి.
బడ్జెట్ అనుమతిస్తే RxZనే ఎంచుకోవడం మంచిది. RxT కూడా విలువైన డీల్. RxE మాత్రం చాలా బేసిక్‌గా ఉంటుంది.
కొనేముందు ఇవి చెక్ చేయండి
కొంతమంది యజమానులు సస్పెన్షన్ నుంచి ఎక్కువ శబ్దం వస్తోందని చెప్పారు. టెస్ట్ డ్రైవ్‌లో గుంతలపై కారు ఎక్కువగా దూకుతోందా, శబ్దాలు వస్తున్నాయా గమనించాలి. కారు వయసుతో పాటు ఇంటీరియర్‌లో కూడా రాటిల్స్ (గలగల శబ్ధాలు) వచ్చే అవకాశముంది. డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యానెల్స్ దగ్గర శబ్దాలు వినిపిస్తే జాగ్రత్త. కొంతమంది ఫ్యూయల్ పంప్ సమస్య గురించి కూడా రిపోర్ట్ చేశారు. డ్రైవింగ్‌లో కారు స్మూత్‌గా నడుస్తుందా, లేదా చూసుకోవాలి.
సెకండ్ హ్యాండ్ ధర ఎంత?
ప్రి-ఓన్డ్ Renault Kiger ధరలు సాధారణంగా రూ.3.5 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉంటాయి. వేరియంట్, ఇంజిన్, మోడల్ ఇయర్ బట్టి ధర మారుతుంది. అయితే రూ.7 లక్షలకంటే ఎక్కువ పెట్టాలనుకుంటే కొత్త కారు తీసుకోవడం మంచిది. ఫేస్‌లిఫ్ట్ కూడా వచ్చిందనే విషయాన్ని ధర తగ్గించడానికి ఉపయోగించుకోవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.