Pros and Cons Of Buying A Second-hand Car: దిల్లీలో, పాత వాహనాల విషయంలో తీసుకొచ్చిన కొత్త రూల్స్ దెబ్బకు చాలా మంది తమ పాత కార్లను అత్యంత రేట్లకు అమ్ముకున్నారు. ఆటోమేకర్లు అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కొత్త కార్లను విడుదల చేస్తున్నప్పటికీ, యూజ్డ్ కార్ల మార్కెట్ కూడా హుషారుగానే ఉంది. మొదటిసారి డ్రైవ్ చేస్తున్నవాళ్లకు, మొదటిసారి కారు కొంటున్నవాళ్లకు తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్ లభిస్తుంది. కానీ ఈ కార్లు నిజంగా డబ్బుకు తగ్గ విలువైనవేనా?.
యూజ్డ్ కారు కొనడం వల్ల కలిగే లాభాలు
1. ధరసెకండ్ హ్యాండ్ కారు విలువ దాదాపు 50% తగ్గుతుంది, ఇంకా ఎక్కువే తగ్గవచ్చు. యూజ్డ్ కార్ల కొనుగోలు విషయంలో ఏడాదికి దాదాపు 20% తరుగుదలను లెక్కించవచ్చు. అంటే మీరు ఒక సంవత్సరం క్రితం లాంచ్ అయిన కారును సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేస్తే దాని అసలు ధరపై 20% వరకు ఆదా చేయవచ్చు. మొదటి సంవత్సరంలో బాగా తక్కువ తిరిగిన కారు అమ్మకానికి వస్తే, అది మీకు మంచి డీల్ అవుతుంది.
2. వేరియంట్ అప్‌గ్రేడ్స్‌మీరు ఏదైనా కార్ షోరూమ్‌కి వెళ్ళినప్పుడు, అక్కడి సిబ్బంది ఒకే కారు రెండు వేరియంట్‌ల మధ్య రేటులో తేడా చెబుతుంటారు. సాధారణంగా, యూజ్డ్ కార్ల మార్కెట్లో వేరియంట్‌ల పట్టింపు ఉండదు. మీరు ఓపిగ్గా వెతికితే, తక్కువ వేరియంట్‌కు చెల్లించే ధరకే టాప్-స్పెక్ కారును పొందవచ్చు.
3. తక్కువ రుణ మొత్తంఓల్డ్ కారును కొనడం వల్ల కలిగే స్పష్టమైన ప్రయోజనం ఇది. కారును చవకగా కొంటారు కాబట్టి మీరు తక్కువ మొత్తంలో రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు & దానిపై వడ్డీ మొత్తం కూడా తక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
4. తక్కువ బీమా ప్రీమియంలుమీరు పాత కారు కొన్నా లేదా కొత్త కారు కొనుగోలు చేసినా ఆ వాహనానికి ఖచ్చితంగా బీమా చేయించుకోవాలి. కొత్త కారుకు బీమా ప్రీమియం పాత కారు కంటే చాలా ఎక్కువ. మీరు పాత కారు కొంటే తక్కువ ప్రీమియంలను సులభంగా చెల్లించవచ్చు. ఎందుకంటే ఆ కారు IDV (ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ) మునుపటి కంటే తక్కువగా ఉంటుంది.
5. మరమ్మత్తుపై వారంటీఉపయోగించిన కారును మీరు బ్రాండెడ్ డీలర్‌షిప్ నుంచి కొనుగోలు చేస్తే, భవిష్యత్ మరమ్మత్తులపై వారంటీ లభిస్తుంది. సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే బ్రాండ్లన్నీ ఈ ఆఫర్ ఇస్తున్నాయి.
సెకండ్ హ్యాండ్ కారు కొనడం వల్ల నష్టాలు
1. మోసపోవచ్చురూ. 50,000 లోపు సెకండ్ హ్యాండ్ కార్లు అంటూ చాలామంది ప్రచారం చేస్తుంటారు. అలాంటి వాటిని కొంటే మీరు మోసపోవచ్చు. సాధారణంగా, అలాంటి కార్లు బయటకు బాగా కనిపిస్తాయి, మీరు వాటిని ఉపయోగిస్తున్నప్పుడు మీకు భారీ మరమ్మతులతో మోత మోగించవచ్చు. అమ్మకానికి ఉన్న చౌకైన లగ్జరీ కార్ల విషయంలో కూడా ఇదే పరిస్థితి.
2. వ్యక్తుల నుంచి కొనుగోలు చేయడంమీరు ఒక వ్యక్తి నుంచి నేరుగా కొనుగోలు చేస్తే, కారు కంపెనీ దానికి బాధ్యత వహించదు. కారు కంపెనీ ఇప్పటికే ఇచ్చిన వారంటీని మీ పేరిట బదిలీ చేసుకోవచ్చు. కానీ, మీరు ఒక వ్యక్తి నుంచి కొనుగోలు చేస్తే మీకు ఎటువంటి వారంటీ/గ్యారంటీ లభించదు. అయితే, యూజ్డ్ కార్ డీలర్‌షిప్‌లు ఉపయోగించిన కార్లపై కూడా మీకు వారంటీని అందిస్తాయి.
3. అధిక వడ్డీ రేట్లుకారు ధర తక్కువగా ఉండటం వల్ల తక్కువ మొత్తం రుణం అవసరం పడినప్పటికీ, బ్యాంకులు & ఫైనాన్స్ కంపెనీలు కొత్త కార్ లోన్ కంటే ఉపయోగించిన కారు లోన్ మీద ఎక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తాయి. అంటే, కారు ధర రూపంలో మీరు ఆదా చేయవచ్చు కానీ వడ్డీ రేటును తగ్గించలేరు.
4. నచ్చిన కారు ఉండదునాకు నలుపు రంగు హ్యుందాయ్ క్రెటా కావాలి అని మీరు అనుకోగానే, సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో అది దొరకదు. మీకు నచ్చిన కారు కోసం మీరు చాలా సెర్చ్ చేయాలి, అయినా దొరక్కపోవచ్చు. మీకు కనిపించిన కారులో.. మీకు నచ్చిన గుణాల్లో ఒకటి ఉంటే మరొకటి ఉండదు. కాబట్టి రాజీ పడాల్సి వస్తుంది.
5. అదనపు ప్రయోజనాలుకొత్త కార్ల స్టాక్‌ను కచ్చితంగా వదిలించుకోవాలి కాబట్టి, కార్ కంపెనీలు భారీ డిస్కౌంట్లను అందిస్తాయి. ఉపయోగించిన కార్ల మార్కెట్ విషయంలో ఈ పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆ కార్లు పేరుకుపోయినా సెల్లర్ పట్టించుకోడు. యూజ్డ్ కార్ల మార్కెట్లలో ధరలు తక్కువగా ఉన్నప్పటికీ, మీకు అంత "డిస్కౌంట్" లభించదు.
సెకండ్ హ్యాండ్ కారును కొనడం వల్ల కలిగే లాభాలు & నష్టాలు ఇవే. ఓల్డ్ కారు కొనాలనే ఆలోచన మీకు ఉంటే, ఈ లాభనష్టాలను బేరీజు వేసుకుని మీరే ఒక నిర్ణయం తీసుకోవచ్చు.