భారత్‌లో దీపావళి రాగానే కారు షోరూమ్‌లలో కస్టమర్ల రద్దీ కనిపిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక రకాల పండుగ ఆఫర్లు ఉన్నాయి. దాంతో దీపావళికి వాహనం కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుంది. దీపావళి తర్వాత డిసెంబర్‌లో కూడా వాహనాలపై సంవత్సరం ముగింపు ఆఫర్లు కొనసాగుతాయి. దీంతో చాలా మందికి దీపావళికి కారు కొనాలా లేక డిసెంబర్‌లో కొంటే ఎక్కువ ప్రయోజనమా అనే గందరగోళం ఏర్పడుతుంది. వాహనం ఎప్పుడు కొనుగోలు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి.
దీపావళికి కొంటే కలిగే ప్రయోజనాలు
దీపావళి పండుగ సమయంలో కారు కొనడం వల్ల అతి పెద్ద ప్రయోజనం ఏంటంటే.. ఆటోమొబైల్ కంపెనీలు, డీలర్‌షిప్‌లు కస్టమర్లను ఆకర్షించడానికి అనేక పండుగ ప్యాకేజీలను ఇస్తాయి. ఇందులో ఆకర్షణీయమైన క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ మినహాయింపులు, ఫ్రీ యాక్సెసరీలు ఉంటాయి. ఈ సమయంలో డీలర్‌షిప్‌ల వద్ద వాహనాల స్టాక్ ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా మీకు నచ్చిన మోడల్, కావాల్సిన కలర్, సరిగ్గా సరిపోయే వేరియంట్ సులభంగా పొందవచ్చు. ఈ పండుగ సీజన్‌ను మన దేశంలో కొత్త ప్రారంభానికి, పెట్టుబడులకు అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
డిసెంబర్‌లో కారు కొంటే కలిగే ప్రయోజనాలు
మీరు కొన్నిరోజులు వేచి ఉండి డిసెంబర్ నెలలో కారు కొనుగోలు చేస్తే మీకు అధిక ప్రయోజనం లభిస్తుంది. సంవత్సరపు చివరి నెలలో అన్ని కారు కంపెనీలు, డీలర్లు తమ వార్షిక సేల్స్ టార్గెట్స్ పూర్తి చేయాలనే ఒత్తిడిని ఎదుర్కొంటారు. తమ పాత స్టాక్‌ను పూర్తి చేయడానికి డీలర్లు ఈ సమయంలో దీపావళితో పోలిస్తే చాలా పెద్ద మొత్తంలో క్యాష్ డిస్కౌంట్లు, ఫ్రీ ఇన్సూరెన్స్, బంపర్ ఎక్స్ఛేంజ్ బెనిఫిల్స్ ఆఫర్ చేస్తారు. కొన్నిసార్లు అక్టోబర్- నవంబర్‌లో మీ బడ్జెట్‌కు మించి ఉన్న వాహనాలు, డిసెంబర్‌లో భారీ డిస్కౌంట్లతో మీ బడ్జెట్‌కు కాస్త దగ్గరగా వస్తాయి.
డిసెంబర్‌లో కొనడం వల్ల కలిగే నష్టం
డిసెంబర్‌లో లభించే భారీ డిస్కౌంట్ల వెనుక కొన్ని ఇబ్బందులు, నష్టాలున్నాయి. మీరు డిసెంబర్ 20న ఒక కారు కొనుగోలు చేస్తే, ఆర్‌సి (RC), తయారీ రికార్డుల ప్రకారం మీ కారు మోడల్ 2026 ఏడాదికి చెందినదిగా భావిస్తారు. మీరు కొన్నిరోజులు వేచి ఉండి 2027 జనవరిలో వాహనాన్ని కొనుగోలు చేస్తే, అది కొత్త తయారీ సంవత్సరానికి చెందినదిగా భావిస్తారు. భవిష్యత్తులో ఎప్పుడైనా మీ వాహనాన్ని అమ్మే సమయంలో సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్‌లో కొనుగోలుదారులు ఎల్లప్పుడూ తయారీ సంవత్సరాన్ని చూస్తారు. డిసెంబర్ లో వాహనం కావడం వల్ల మీకు దాని రీసేల్ వ్యాల్యూ కొంచెం తక్కువగా లభిస్తుంది.
ఇప్పుడు మీకు ఏ సమయం సరైనదనే విషయం మీ ప్రయోజనాలు, భవిష్యత్ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. మీకు నచ్చిన కలర్, వేరియంట్, లేటెస్ట్ తయారీ సంవత్సరం వెహికల్ కావాలనుకుంటే, అలాగే పండుగ రోజున కొత్త వాహనం కొనుగోలు చేయాలని భావిస్తే, దీపావళి పండుగకే కారు కొనుగోలు చేయాలి.
వీలైనంత ఎక్కువ డబ్బు ఆదా చేయడమే అయితే, మోడల్ సంవత్సరం పాతదవ్వడం వల్ల పెద్దగా తేడా ఉండదనుకుంటే, స్టాక్ ముగిసినప్పటికీ అందుబాటులో ఉన్న ఆప్షన్‌లతో సర్దుకుపోతారు. అలాంటివాళ్లు డిసెంబర్ ఇయర్-ఎండ్ సేల్ వరకు వేచి చూడటం మీకు మంచి డీల్‌గా మారుతుంది.
