Boman Irani Mahindra XEV 9S: ప్రముఖ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ పర్యావరణ హితమైన జ‌ర్నీ వైపు అడుగులు వేశారు. మహీంద్రా సంస్థ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన 'XEV 9S' ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆయన తాజాగా డెలివరీ తీసుకున్నారు. ఇది 7-సీటర్ సౌకర్యంతో వస్తున్న ప్రీమియం ఫ్యామిలీ ఈవీ. లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలకు అనువుగా, ఆధునిక టెక్నాలజీతో ఈ కారును మహీంద్రా తీర్చిదిద్దింది. ఈ కారులో 59 kWh, 70 kWh, 79 kWh అనే మూడు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి వరుసగా 170 kW నుండి 210 kW వరకు గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తాయి. మహీంద్రాకు చెందిన 'INGLO' ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి రూపొందిన ఈ వాహనం సిటీ ప్రయాణాలకు, హైవే డ్రైవింగ్‌కు అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది.

Continues below advertisement

స్టైలిష్ ఎక్స్‌టీరియర్ డిజైన్

డిజైన్ పరంగా XEV 9S సరికొత్త లుక్‌తో ఆకట్టుకుంటుంది. ముందు భాగంలో గ్రిల్ లేకుండా క్లోజ్డ్ డిజైన్, స్లీక్ ఎల్‌ఈడీ లైట్ బార్, ఎల్-షేప్ డీఆర్‌ఎల్‌లు (DRLs) ఉన్నాయి. వెర్టికల్ హెడ్ ల్యాంప్స్ కారుకు ఒక డిఫ‌రెంట్ లుక్ ని ఇస్తాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఎరోడైనమిక్ అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ కారుకు ప్రీమియం అప్పీల్ ఇస్తాయి. వెనుక వైపు మహీంద్రా ఎలక్ట్రిక్ బ్యాడ్జింగ్ ఈ కారు ప్రత్యేకతను చాటుతుంది.

లగ్జరీ ఇంటీరియర్, ఫీచర్లు

కారు లోపలి భాగం చాలా విశాలంగా ఉంటుంది. ఇందులో 527 లీటర్ల బూట్ స్పేస్, ముందు భాగంలో 150 లీటర్ల ఫ్రంక్ (Frunk) సౌకర్యం ఉంది. రెండో వరుస సీట్లలో వెంటిలేషన్, రిక్లైన్, స్లైడ్ ఫంక్షన్లతో పాటు 'బాస్ మోడ్' (Boss Mode) ఫీచర్ కూడా ఉంది. డ్యాష్‌బోర్డ్‌పై మూడు భారీ 31.24 సెంటీమీటర్ల డిస్‌ప్లేలు ఉన్నాయి. డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేసే 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ మ్యూజిక్ లవర్స్‌కు గొప్ప అనుభూతిని ఇస్తుంది. 5G కనెక్టివిటీ, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

సేఫ్టీలో నంబర్ వన్

సెక్యూరిటీ విషయంలో మహీంద్రా రాజీ పడలేదు. ఇందులో ఏడు ఎయిర్ బ్యాగ్‌లు, లెవల్ 2+ అడాస్ (ADAS) టెక్నాలజీ ఉన్నాయి. డ్రైవర్ నిద్రమత్తును గుర్తించే సిస్టమ్, 360-డిగ్రీ మానిటరింగ్ కెమెరా వంటివి ప్రయాణాన్ని సురక్షితం చేస్తాయి. రూ. 19.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రస్తుతం మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. బోమన్ ఇరానీ వంటి సెలబ్రిటీలు ఈ కారును ఎంచుకోవడం దీని క్రేజ్‌ను మరింత పెంచుతోంది.