BMW Natural Fibre Technology: కార్ల తయారీలో ఇప్పటివరకు కార్బన్‌ ఫైబర్‌ అంటే అత్యాధునిక మెటీరియల్‌గా భావించేవారు. తక్కువ బరువు, ఎక్కువ బలం కారణంగా గల్జరీ కార్లు, స్పోర్ట్స్‌ కార్లలో దీనిని విస్తృతంగా వాడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ దిశలో పెద్ద మార్పు రాబోతోంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ BMW, భవిష్యత్తు ప్రొడక్షన్‌ మోడళ్లలో కార్బన్‌ ఫైబర్‌కు బదులుగా నేచురల్‌ ఫైబర్‌ కాంపోజిట్స్‌ను ఉపయోగించనున్నట్టు ప్రకటించింది.

Continues below advertisement

అవిసె మొక్క ఆధారంగా రూపకల్పనఈ నేచురల్‌ ఫైబర్‌ కాంపోజిట్స్‌ ఫ్లాక్స్‌ (అవిసె మొక్క) ఆధారంగా తయారవుతాయి. ఈ మెటీరియల్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన Bcomp అనే సంస్థ అభివృద్ధి చేసింది. BMW ఇప్పటికే చాలా సంవత్సరాలుగా మోటార్‌ స్పోర్ట్స్‌లో ఈ మెటీరియల్‌ను ఉపయోగిస్తూ పరీక్షలు చేసింది. ఆ అనుభవంతోనే ఇప్పుడు దీన్ని సాధారణ కార్లలో కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

తగ్గనున్న కర్బన ఉద్గారాలుపరీక్షల ప్రకారం, ఈ ఫ్లాక్స్‌ ఫైబర్‌ కాంపోజిట్స్‌ కేవలం లోపలి భాగాలకే కాకుండా, బయట కనిపించే ప్యానెల్స్‌, స్ట్రక్చరల్‌ పార్ట్స్‌ తయారీకీ కూడా సరిపోతాయని BMW చెబుతోంది. ఉదాహరణకు, భవిష్యత్తు కార్లలో రూఫ్‌ ప్యానెల్స్‌ తయారీలో ఈ మెటీరియల్‌ వాడితే, తయారీ దశలోనే సుమారు 40 శాతం CO2 ఉద్గారాలు తగ్గుతాయి. అంతేకాదు, వాహనం జీవితకాలం పూర్తయ్యాక రీసైక్లింగ్‌ పరంగా కూడా ఇది మేలు చేస్తుంది.

Continues below advertisement

BMWకి చెందిన వెంచర్‌ క్యాపిటల్‌ విభాగం i Ventures, Bcomp సంస్థలో పెట్టుబడి పెట్టింది. Bcomp సంస్థను 2011లో స్థాపించారు. మొదటగా ఇది ఫ్లాక్స్‌ ఫైబర్లతో హై-పర్ఫార్మెన్స్‌ స్కీస్‌ తయారు చేసేది. 2022లో Bcomp అధికారికంగా BMW మోటార్‌ స్పోర్ట్‌ పార్ట్నర్‌గా మారింది.

Bcomp తయారు చేసిన ప్రత్యేకంగా నేసిన ఫాబ్రిక్‌ను Amplitex అంటారు. ఇది యూరప్‌లో పండించే ఫ్లాక్స్‌ మొక్కల నుంచి తీసిన ఫైబర్లతో తయారవుతుంది. అవసరాన్ని బట్టి వేర్వేరు నేసే విధానాలు ఉపయోగిస్తారు. దీంతో డిజైన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ఫాబ్రిక్‌ను నేరుగా వాడవచ్చు లేదా థర్మోప్లాస్టిక్‌ రెసిన్‌తో కలిపి ప్రీప్రెగ్‌ రూపంలో కూడా ఉపయోగిస్తారు.

స్ట్రక్చరల్‌ బలాన్ని పెంచేందుకు Powerribs అనే గ్రిడ్‌ లాంటి మెష్‌ను వాడతారు. ఇది కూడా ఫ్లాక్స్‌ ఫైబర్లతోనే తయారవుతుంది. ఇది ప్యానెల్స్‌కు బలం ఇచ్చి, బరువును తగ్గిస్తుంది.

BMW తొలిసారి ఈ నేచురల్‌ ఫైబర్‌ మెటీరియల్‌ను 2019 ఫార్ములా E కార్లలో ఉపయోగించింది. ఆ తర్వాత M4 DTM, M4 GT4 మోడళ్లలో కార్బన్‌ ఫైబర్‌ భాగాల స్థానంలో దీన్ని అమర్చారు. ముఖ్యంగా నుర్బుర్గ్‌ 24 అవర్స్‌ రేస్‌లో పాల్గొన్న M4 GT4లో ఈ భాగాలు విజయవంతంగా పనిచేశాయి.

Bcomp చెబుతున్నదేమిటంటే, ఉపయోగాన్ని బట్టి ఈ మెటీరియల్‌ 85 శాతం వరకు తక్కువ CO2 ఫుట్‌ప్రింట్‌ కలిగి ఉంటుంది. కొన్ని భాగాలు 50 శాతం వరకు తక్కువ బరువు ఉండగా, ప్లాస్టిక్‌ వినియోగాన్ని 70 శాతం వరకు తగ్గిస్తాయి.

ఇతర చాలా బ్రాండ్స్‌ కూడా...BMW ఒక్కటే కాదు. Cupra, Kia, Polestar, Volvo, Porsche వంటి బ్రాండ్లు కూడా ఇప్పటికే ఈ నేచురల్‌ మెటీరియల్స్‌ను వేర్వేరు మోడళ్లలో ఉపయోగిస్తున్నాయి. దీని ద్వారా ఆటోమొబైల్‌ పరిశ్రమలో పర్యావరణ అనుకూల టెక్నాలజీ దిశగా పెద్ద మార్పు మొదలైనట్టే కనిపిస్తోంది.

దీనిని బట్టి, భవిష్యత్‌ కార్లు కేవలం శక్తిమంతమైనవే కాదు, ప్రకృతికి మేలు చేసేలా కూడా మారబోతున్నాయని మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.