Driving safety tips Telugu: కారైనా, బైక్ అయినా, స్కూటర్ అయినా.. అది ఎంత ఖరీదైనదైనా.. అందులో ఎన్ని హైటెక్ ఫీచర్లు ఉన్నా.. డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం జరగడానికి రెప్పపాటు కాలం చాలు. చాలామంది స్పీడ్ పెంచడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారు కానీ, అదే బండిలో ఉన్న సేఫ్టీ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి మాత్రం సమయం కేటాయించరు. ఇదే చాలా ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.
మన మెదడు క్షణాల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉన్నా, గంటకు 100 కి.మీ. వేగంతో వెళ్తున్న వాహనాన్ని అదుపు చేయాలంటే ముందుగానే అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితి వచ్చిన తర్వాత స్పందించే లోపే చాలా ఆలస్యం అయిపోతుంది. అందుకే వాహనం పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించడం చాలా ముఖ్యం.
ప్రమాదాలను నివారించే సింపుల్ టిప్స్
బ్రేక్ వేస్తే కిర్రుమనే శబ్దం వస్తుందా? బ్రేక్ వేసినప్పుడు వాహనం ఒకవైపుకు లాగుతుందా? అయితే బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయి ఉండొచ్చు లేదా బ్రేక్ ఆయిల్ సమస్య ఉండొచ్చు. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సర్వీస్ సెంటర్‌కు వెళ్లి తనిఖీ చేయించాలి. నిర్లక్ష్యం చేస్తే బ్రేకింగ్ సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా ఇతర భాగాలు కూడా దెబ్బతింటాయి.
లాంగ్ డ్రైవ్‌లలో చాలామందిని వేధించే మరో సమస్య డ్రైవర్ అలసట. వరుసగా ఆవలింతలు రావడం, కళ్లపాపలు భారంగా అనిపించడం మైక్రో స్లీప్‌కు సంకేతాలు. ఒకట్రెండు సెకన్లపాటు కళ్లు మూసుకుపోయినా భారీ ప్రమాదం జరగొచ్చు. ముఖ్యంగా వేకువజామున ప్రయాణించే సమయంలో మధ్యలో ఆగి నీళ్లు తాగడం, ముఖం కడుక్కోవడం లేదా కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి.
ఇది కూడా చదవండి: కొత్త బ్రెజ్జాలో అదిరిపోయే 6 మార్పులు - టర్బో పవర్, వెంటిలేటెడ్ సీట్లు, 5 స్టార్ రేటింగ్‌తో మరింత బలంగా మారుతి SUV
టైర్ల పరిస్థితిని కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. గాలి తక్కువగా ఉంటే వాహనం సరిగ్గా వేగం అందుకోదు. ఇంజిన్‌పై అదనపు ఒత్తిడి పడుతుంది. అన్ని టైర్లలో సమాన గాలి లేకపోతే వాహనం ఒక వైపుకు లాగే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఒక్కసారిగా బ్రేక్ వేయకుండా యాక్సిలరేటర్‌ను వదిలి వాహనం వేగం సహజంగా తగ్గేలా చేయాలి.
మరో పెద్ద సమస్య అతి వేగం & అతి బరువు. వాహనం మోయగల సామర్థ్యాన్ని మించి సామగ్రి ఎక్కిస్తే షాక్ అబ్జార్బర్లు కుంగిపోతాయి. ఇంజిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. అదే సమయంలో అధిక వేగంతో వెళ్తే వాహనం వైబ్రేట్ అవుతుంది. స్పీడోమీటర్‌పై ఎప్పటికప్పుడు దృష్టి ఉంచి రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా వేగాన్ని నియంత్రించడం ఉత్తమ మార్గం.
స్టీరింగ్ అకస్మాత్తుగా వణకడం లేదా ఒకే వైపుకు లాగడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని చిన్న సమస్యగా తీసుకోవద్దు. అలాంటి సమయంలో స్టీరింగ్‌ను బలంగా తిప్పే ప్రయత్నం చేయకుండా గట్టిగా పట్టుకుని నెమ్మదిగా వాహనాన్ని రోడ్డు పక్కకు తీసుకెళ్లాలి. తర్వాత మాత్రమే సమస్య ఏంటో పరిశీలించాలి.
ఇది కూడా చదవండి: XP100, Power100, Speed100పై కేంద్రం కీలక ప్రకటన - E20ని మించిన ఇంధనంపైనా క్లారిటీ
ఈ రోజుల్లో కార్లలో TPMS, ABS, Vehicle Dynamic Control వంటి ఆధునిక వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. కానీ అవి ఎలా పనిచేస్తాయో చాలామందికి తెలియదు. టైర్‌లో గాలి తగ్గితే TPMS వార్నింగ్ లైట్ వెంటనే వెలుగుతుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ABS ఉన్న వాహనాల్లో అత్యవసర పరిస్థితుల్లో బ్రేక్‌ను సరైన పద్ధతిలో ఉపయోగించడం వల్ల వాహనం స్కిడ్ కాకుండా నియంత్రణలో ఉండే అవకాశం పెరుగుతుంది.
హైవేలపై ఎక్కువసేపు ఒకే వేగంతో ప్రయాణించిన తర్వాత సాధారణ రోడ్లపైకి వచ్చినప్పుడు కొంతమంది డ్రైవర్లు రోడ్డుపై పూర్తి దృష్టి పెట్టలేకపోతారు. ఈ పరిస్థితిని నిపుణులు హిప్నాసిస్ ఎఫెక్ట్‌గా చెబుతున్నారు. అందుకే హైవే నుంచి బయటకు వచ్చిన వెంటనే వేగాన్ని తగ్గించి పరిసరాలపై పూర్తి దృష్టి పెట్టాలి.
ప్రమాదాలను పూర్తిగా ఆపడం ఎవరి చేతిలో ఉండకపోయినా, చిన్న జాగ్రత్తలు మాత్రం పెద్ద ప్రమాదాలను తప్పించగలవు. స్పీడ్ కంటే సేఫ్టీకి ప్రాధాన్యం ఇవ్వడం, వాహనాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయించడం & ఆధునిక సాంకేతిక వ్యవస్థలపై అవగాహన పెంచుకోవడం ప్రతి డ్రైవర్ బాధ్యత. రోడ్డుపై నిజమైన హీరో అంటే వేగంగా వెళ్లేవాడు కాదు.. సురక్షితంగా గమ్యానికి చేరుకునేవాడే.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
